కుటుంబ కథా‘చిత్రం’ నకాషీ

Updated By ManamFri, 08/03/2018 - 02:21
nakashi painting

నవాబులు మెచ్చిన కళ. వారి కాలంలో దర్బారుల్లోనూ, మహల్స్‌లోనూ ఆ చిత్రాలే కొలువుతీరాయి. అదే నకాషీ కళ. 16వ శతాబ్ది నాటి చిత్రాలు కూడా ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. మరుగైపోతుందన్న కళకు ఆ కుటుంబమంతా అంకితమై జీవిస్తున్నారు.  వీరే కాదు కొన్ని తరాలు ఆ కళనే నమ్ముకున్నాయి. వారిచేతిలో రూపుదిద్దుకోని పురాణమంటూలేదు. చివరకు ఈ కళే వారి కులంగా, పేరు చివర చేరిపోయింది. సహజైమెన రంగులు మాత్రమే వాడే ఒకే కళ ఈ నకాషీ చిత్రకళ. ఎన్నో ఏళ్ళ చరిత్రకు  ఆనవాళ్ళుగా మిగిలింది ఈ కళ.
image
ఒకప్పుడు వారు గీసిన బొమ్మలు ఊరూరా కథలుగా చెప్పేవారు. మారుతున్న కాలంతో కొన్నిమార్పులను సంతరించుకుని, పురాణాలతో పాటు ప్రాంతీయ సంస్కృతి, సాంప్రదాయాలను కూడా ఈ కళలో చేటుచేసుకుని ఇప్పటి  తరానికి చేరువౌతుంది. అంతటి ఘనకీర్తి కలిగిన ఈ కళాసంపదను మన తెలంగాణా ప్రభుత్వం ఆదరించి అండగా నిలిచింది. ధనాలకోట వైకుంఠం నకాషీ, వనజ నకాషీలు ఈ కళను పూర్వీకులనుండీ అభ్యసిస్తే, వీరి కుమారుడు రాకేష్ వర్శ వృత్తిగా చేసుకోవడమే కాదు కొత్త ప్రయోగాలను చేస్తూ కళాభిమానులకు మరింత చేరువ చేస్తున్నాడు. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో అవార్డులనూ సొంతం చేసుకున్నారు వీరు. ఇంతటి చరిత్ర కలిగిన నకాషీ కళను గురించి ఈ కుటుంబం మనం మిసిమితో పంచుకున్న ముచ్చట్లు... 

దేవతలకు సంబంధించిన కథలన్ని బొమ్మలుగా మలచి చెప్పే కళే నకాషీ. నకాషీ అనే ఉద్దూ పదానికి నక్ష్ అంటే అచ్చు గుద్దినట్టు చిత్రించడం అని అర్థం. నవాబుల రాజ దర్బారులో, మహల్స్ లో కళారూపాలన్నీ ఈ నకాషీ చిత్రకారుల చేతిలో రూపుదిద్దుకున్నవే. ఒక రూపాన్ని చెప్పింది చెప్పినట్లుగా విని దానికి రంగుల్లో చిత్రంగా మలచడమే నకాషీకళ. దేవతలకు సంబంధించిన కథల్ని బొమ్మలుగా గీసి చెప్పేకళ నకాషీ.. ఈకథలు ముఖ్యంగా కుల దేవుళ్ళ కథలను చెపుతాయి. మహాభారతం, రామాయణ ఘట్టాలు, శ్రీకృష్ణుని లీలలు, జాంబవంతుని కథ, కాటమరాయుని కథ, మార్కండేయ పురాణం, ఆదిశక్తి పుట్టిన నాటినుండీ, మహాభారత యుద్ధం పూర్తయ్యే వరకూ అన్ని ఘట్టాలనూ చిత్రాలుగా మలచి వాటి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సంచార జాతులు కథలుగా చెప్పేవారు. ఒకప్పుడు తోలుబొమ్మలాట ఎంత ఆదరణ కలిగి ఉండేదో అంతే ఆదరణ ఈ నకాషీ చిత్రాలతో కథలను చెప్పడంలో ఉండేది. దీనికోసమే కొన్ని కుటుంబాలు నిత్యం ఊర్లు తిరుగుతూ ఈ కళను ప్రదర్శించేవారు. 

వస్త్రంపై సహజైమెన రంగులతో బొమ్మలు వేసే పద్దతినే నకాషీ అంటారు. వీరిని నకాషీలు లేదా పట చిత్రకళాకారులుimage అంటారు. వరంగల్ జిల్లా చేర్వాలలో ఈ కళ ఉన్నది. మడేల్ పురాణం, గౌడ పురాణం జాంబ పురాణం స్క్రోల్స్ గా చిత్రి    స్తారు. ఇందుకోసం సహజైమెన రంగులనే వాడతారు. ఇలా గీసిన చిత్రాలు వందల ఏళ్ళపాటు ఉండటం, ఈ చిత్రకళ ప్రత్యేకత. నకాశీ కళలో రంగులు అన్నీ సహజ సిద్ధంగా తయారుచేసుకున్నవే వాడతారు. రంగురాళ్ళను కొనుగోలు చేసి వాటిని నూరుకుని రంగులు తయారుచేసుకుంటారు. ముఖ్యంగా ఇందుకోసం ఆరు రంగులను వాడతారు. తెలుపురంగును శంఖాలతోను, నలుపు రంగును కిరోసిన్ దీపంతో వచ్చే మసితోను తయారుచేస్తారు. ఒక ఎరుపు, పసుపు రంగులు రంగురాళ్ళను నూరి చేస్తారు. నీలం రంగును ఇండిగో ఆకులతో చేస్తారు. ఇక మాస్క్‌లు తయారీ మరింత శ్రద్ధగా చేస్తారు. ఒక మాస్క్ తయారీకి వారం రోజులు వరకూ సమయం పడుతుంది. చెక్కపొట్టు, కోడిగుడ్డు సొన, బంక కలిపి బొమ్మను తయారుచేస్తారు. రెండురోజులు ఆరిన తరువాత, పైన చింతగింజల అంబలితో వస్త్రాన్ని అతికిస్తారు. అతికించిన వస్త్రంపై రెండుసార్లు సున్నం నీటిని అద్ది రంగులు వేస్తారు. 

- శ్రీశాంతి దుగ్గిరాల

English Title
nakashi painting
Related News