'డిండి ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టడమే సముచితం'

Updated By ManamSat, 04/14/2018 - 12:55
Name of Dindi irrigation scheme, Telangana govt, CM Kcr

Name of Dindi irrigation scheme, Telangana govt, CM Kcr హైదరాబాద్‌: డిండి ఎత్తిపోతల పథకానికి నీటిపారుదల రంగ నిపుణులు, దివంగత ఆర్.విద్యాసాగర్ రావు పేరు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యాసాగర్ రావు మొదటి వర్ధంతి రానున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకొని సంబంధిత దస్త్రంపై సంతకం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. సాగునీటి రంగంలో తెలంగాణపై జరిగిన వివక్షను విద్యాసాగర్ రావు ఎలుగెత్తి చాటారని.. సంక్లిష్టమైన విషయాలను చాలా సులువుగా అర్థమయ్యే విధంగా విడమరిచి చెప్పి ప్రజలను చైతన్య పరిచారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆయన.. ముఖ్యంగా సాగునీటి అంశాలపై విస్తృత చర్చకు అవకాశం కల్పించారని అభిప్రాయపడ్డారు.

ఫ్లోరైడ్ పీడిత నల్గొండ జిల్లాకు తాగునీరు, తెలంగాణలో బీళ్లుగా మారిన భూములకు సాగునీరు అందివ్వాలనేది విద్యాసాగర్ రావు జీవితాశయమన్న కేసీఆర్ చెప్పారు. ఆయనకు ఘననివాళిగా ఆయన పుట్టిన నల్గొండ జిల్లాకు నీరందించే డిండి ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టుకోవడం సముచితంగా ఉంటుందని భావిస్తున్నామని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత ప్రాంతాలకు మంచినీరు, సాగునీరు అందించే ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టడం సబబుగా ఉంటుందని అన్నారు. ఇకపై ఈ ప్రాజెక్టును ఆర్.విద్యాసాగర్ రావు డిండి ఎత్తిపోతల పథకంగా పరిగణించాలని నీటి పారుదల శాఖను ఆదేశించారు.

English Title
Name of Dindi irrigation scheme to be changed, decides Telangana govt
Related News