ఇందిరా గాంధీపై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ

Updated By ManamTue, 06/26/2018 - 13:20
nadrendra modi

న్యూఢిల్లీ :ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్ పార్టీపై  తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాకుండా మాజీ ప్రధాని ఇందిరాగాంధీపైనా ఆయన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఎమర్జెన్సీ విధించి 43 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ ముంబయి విభాగం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మంగళవారం మాట్లాడారు. అధికార కాంక్షతో ఇందిరాగాంధీ కుటుంబం దేశం మొత్తాన్ని జైలులా మార్చేస్తుందని ఎవరూ ఎప్పుడూ అనుకోలేదన్నారు.

Narendra modi

అయితే కాంగ్రెస్ ఎమర్జెన్సీ విధించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిందన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ నియంతా వ్యవహరించారని మోదీ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆమె రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని ప్రధాని ఎద్దేవా చేశారు. బీజేపీకి రాజ్యాంగం దైవంతో సమానమని ఆయన అన్నారు. ఆర్ఎస్ఎస్‌, జన్‌సంఘ్‌ నుంచి దళితులు, ముస్లింలు తమను తాము కాపాడుకోవాలని దుష్ప్రచారం చేశారంటూ ప్రధాని మండిపడ్డారు.

హట్లర్‌లా ఇందిరా గాంధీ..!
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జ్జెన్సీని గుర్తుచేస్తూ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ.. ఆమెను ఒకప్పటి జర్మనీ నియంత హిట్లర్‌తో పోల్చారు. హిట్లర్, ఇందిరా గాంధీ ఇద్దరూ రాజ్యంగాన్ని గౌరవించలేదని జైట్లీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వంగా మార్చేందుకు ఇద్దరూ రాజ్యాంగాన్ని ఉపయోగించుకున్నారని విమర్శించారు. 1975 జూన్ 25న ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఈ సందర్భంగా జైట్లీ నిన్న (సోమవారం) సోషల్ మీడియాలో వరుస పోస్ట్‌లు చేశారు.

ప్రతిపక్ష పార్టీ ఎంపీలను అరెస్ట్ చేయించి హిట్లర్ తన మైనార్టీ ప్రభుత్వాన్ని మెజార్టీలోకి తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఇందిరా గాంధీ హిట్లర్‌లా కాకుండా భారత్‌ను వంశపారంపర్య ప్రజాస్వామ్యంగా మార్చారని విమర్శించారు. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా వేధించిందని, ప్రాథమిక హక్కులను కాలరాసిందని తెలిపారు. మీడియాపైనా ఆంక్షలు విధించిందని, పలువురు ప్రతిపక్ష నేతలను జైళ్లలో పెట్టించిందని జైట్లీ గుర్తుచేశారు. వివిధ పార్టీల కార్యకర్తలను, ప్రతిపక్ష నేతలను, ఆరెస్సెస్ కార్యకర్తలను జైలుకు పంపించారని జైట్లీ వెల్లడించారు.
 

English Title
Narendra Modi attack on Congress, Indira Gandhi over Emergency
Related News