‘కాళేశ్వరం’లో సరికొత్తరికార్డు

Updated By ManamMon, 04/16/2018 - 05:24
Harish_Rao_Kaleshwaram_Project_
  • ఒకేరోజు 7 వేల క్యూబిక్ మీటర్ల పనులు.. ఆసియాలోనే సరికొత్త రికార్డు సృష్టించాం

  • సీఎం కేసీఆర్ సూచనలతోనే సాధ్యం.. మేడిగడ్డ నిర్మాణ కంపెనీ ఎల్‌అండ్‌టీ

  • ప్రభుత్వ శాఖలు ఏజెన్సీల సమన్వయం.. ఇదే పట్టుదల కొనసాగించాలని సూచన 

  • ఇంజనీర్లు.. కార్మికుల సమష్టి కృషి వల్లేనని సీఎం కేసీఆర్, హరీశ్ అభినందనలు

Harish_Rao_Kaleshwaram_Project_హైదరాబాద్: లక్షలాది ఎకరాలకు నీరందించే మహా సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ రంగంలో సరికొత్త రికార్డును అందుకుంది. ఒక్క రోజులోనే 7 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు పూర్తిచేసిన ప్రాజెక్టుగా శనివారం నాడు చరిత్ర సృష్టించింది. సీఎం కేసీఆర్ మార్గదర్శనాలతోనే ఈ అరుదైన రికార్డును సాధించినట్లు ప్రాజెక్టు నిర్మాణ పనులు చేస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ తెలిపింది. ఈమేరకు ఆదివారం నాడు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టును వేగంగా పూర్తిచేసి రైతుల పొలాల్లో నీరు పారించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ గతేడాది డిసెంబర్ 7న మేడిగడ్డను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనులలో ఆయన కొన్ని సూచనలు చేశారు. ప్రాజెక్టు ఇంజనీర్లకు సలహాలిచ్చారు. వాటిని అమలు చేసిన తర్వాత పనుల్లో పురోగతి గణనీయంగా పెరిగిందని సంస్థ తెలిపింది. ఈ ప్రాజక్టు ద్వారా 37 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో ప్రాజెక్టు పనులను శీఘ్రంగా పూర్తిచేయాలని ప్రభుత్వం ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇస్తూవస్తోంది. దీంతో శనివారం ఒక్కరోజే 7 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు జరిగాయని ప్రాజెక్టు ఇంజనీర్లు తెలిపారు. వచ్చే వానాకాలం నాటికి ప్రాజెక్టు పనులు పూర్తిచేయడానికి గాను శ్రమిస్తున్నట్లు వివరించారు. కాగా, సీఎం కేసీఆర్ చేసిన దిశానిర్దేశం మేరకు పనులు అనూహ్య రీతిలో ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ పనులను గత డిసెంబర్ 7న పరిశీలించారు. కన్నెపల్లి పంప్‌హౌజ్, అన్నా రం బ్యారేజీ పనులను కూడా ఆరోజు తనిఖీ చేశారు. వానాకాలం నాటికి కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు పంపించడానికి గాను రోజుకు 7 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు జరగవలసిందేనని అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటించిన 4 నెలలలో పనుల పురోగతి అటు ఇంజనీర్లను, ఇటు రాజకీయ నాయకులను అందరినీ అబ్బురపరుస్తోంది. సీఎం పర్యటించినప్పుడు మేడి గడ్డ బ్యారేజీలో రోజుకు సగటున 1,169 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు జరుగుతున్నాయి. సీఎం పర్యటన తర్వాత పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక, వివిధ శాఖలు, అధికారుల మధ్య సమన్వ యం, కార్మికులు, ఇంజనీర్ల సంఖ్య పెంపుదల, అవసరమైన ఎక్విప్‌మెంటు, యంత్రపరికరాలు సమకూర్చుకోవడం వంటి చర్యలతో రోజుకు 7 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనుల అసాధారణ రికార్డును తెలంగాణ ఇరిగేషన్ శాఖ సొంతం చేసుకున్నది.

యంత్రాలు పెంచి..
ముఖ్యమంత్రి మేడిగడ్డకు వచ్చి వెళ్ళిన నాటి నుంచి ఈ బ్యారేజీలో ఇప్పటివరకు మొత్తం 5,39,361 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు జరిగాయి. సీఎం పర్యటించే నాటికి జరిగిన సిమెంటు కాంక్రీటు పనులు 77,946 క్యూబిక్ మీటర్లు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించిన నాడు 4 బ్యాచింగ్ ప్లాంట్లు వినియోగిస్తుండగా వాటి సంఖ్య ప్రస్తుతం ఎనిమిదికి పెంచారు. బ్యాచింగ్ ప్లాంట్ల సామర్థ్యం 390 క్యూబిక్ మీటర్ల నుంచి 870కి పెంచారు. బూమ్ ప్లేసర్ల సంఖ్యను 3 నుంచి 12 కు పెంచారు. కార్మికుల సంఖ్యను 1,245 నుంచి 3,065 కి పెంచారు. ఇంజనీర్ల సంఖ్యను 113 నుంచి 162కు పెంచారు. ట్రాన్సిట్ మిక్సర్ల సంఖ్యను 25 నుంచి 85కు పెంచారు.

సీఎం సలహాలతోనే రికార్డు..
ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు, సలహాలు, ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు నిరంతర పర్యవేక్షణ, సమీక్షల కారణంగానే ఈ అసాధారణ రికార్డు సాధించగలిగినట్టు మేడిగడ్డ బ్యారేజీ నిర్మిస్తున్న ఎల్ అండ్ టి సంస్థ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఒక్కరోజులో 7 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనుల రికార్డ్ బ్రేకు చేసినందుకు మంత్రి హరీశ్‌రావు మరో ప్రకటనలో ఎల్ అండ్ టి సంస్థ, ఇరిగేషన్ అధికార యంత్రాంగాన్ని అభినందించారు. తక్కువ కాలంలో ప్రాజెక్టును పూర్తిచేసి ఆసియాలోనే సరికొత్త రికార్డు నెలకొల్పనున్నట్టు ఆయన చెప్పారు. రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే ఈ పథకం పూర్తయితే సీఎం కల సాకారమవుతుందన్నారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన, పాలుపంచుకుంటున్న ఏజెన్సీలు, ఇరిగేషన్ ఇంజనీర్లు, సిబ్బందిని పేరుపేరునా హరీశ్ రావు అభినందించారు. ఇదే పట్టుదల, ఇదే వేగం కొనసాగించాలని అయన సూచించారు. ఇరిగేషన్, రెవెన్యూ, అటవీ, విద్యుత్తు, గనులు తదితర ప్రభుత్వ శాఖలు, కాంట్రాక్టు సంస్థలు సమన్వయంతో సమష్టిగా పనిచేసి నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేయాలన్నారు. భూసేకరణ ప్రక్రియ, అంతర్రాష్ట్ర ఒప్పందాలు, కేంద్ర ప్రభుత్వ అనుమతులు, టెండర్ల ప్రక్రియ, నిర్మాణం.. ఇలా అన్ని రంగాల్లోనూ కాళేశ్వరం కొత్త రికార్డులను తిరగరాస్తుందని ఆయన సంతోషం వ్యక్తంచేశారు.

English Title
Newest caricature in 'Kaleshwaram'
Related News