పదేళ్లలో 657 పరీక్షలు

Updated By ManamSun, 02/11/2018 - 18:25
NM Pushpa

NM Pushpaతన పని తాను చేసుకోవడానికే టైం దొరకని ప్రస్తుత రోజుల్లో.. మానవసేవ.. సమాజం ఇలాంటి పెద్ద పెద్ద పదాలకు మనిషి డైరీలో ప్లేస్ దొరకడం లేదు. కాళ్లు, చేతులు బాగోలేకో.. కళ్లు కనిపించకో చదువుకునే ఎంతోమంది పరీక్షలు రాసి.. వారు జీవితంలో స్థిరపడేందుకు తోడ్పాటునందిస్తోంది ఒక మహిళ. బెంగళూరుకు చెందిన ఎన్.ఎం పుష్ప ప్రియ.. ఎంఎన్‌సీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. స్థానిక బీటీఎం లేఅవుట్‌లో నివసిస్తోంది. రాయలేని వారికి చేదోడుగా.. చూపు లేని వారికి మనోనేత్రంగా గత 10 సంవత్సరాల నుంచి 657 పరీక్షలు రాసింది.

ఫీజులు కట్టలేక తాను చదువు కొనసాగించలేని పరిస్థితుల్లో.. చదువు మానడం తప్ప వేరే దారి లేదని.. అయితే ఎవరో ఆమె ఫీజు కట్టేశారట. ఫైనలియర్ పరీక్షలు రాసిన తర్వాత ఆరా తీస్తే.. ఆ ఫీజు కట్టినతను వాసు అనే అంగవైకల్యంతో బాధపడుతున్న వ్యక్తని తెలిసింది. తాను చదవలేడు కాబట్టి చదవాలన్న ఆసక్తి ఉన్న వారికి సాయం చేయాలని అతనిలా చేశాడని తెలిసింది. కానీ అతన్ని కలవలేపోయా. ఆ బాధ నాలో ఎప్పుడూ ఉండేది. నేనెవరో తెలియకుండానే నాకు సాయం చేసిన ఆ అజ్ఞాత వ్యక్తికి గుర్తుగా ఏదైనా చేయాలనుకునేదాన్ని. అందుకే చదువకోవాలనుకునే దివ్యాంగులకు సాయం చేయాలని నిర్ణయించుకున్నానని పుష్ప వెల్లడించారు.

2007లో ఎస్ఎస్ఎల్‌సీ చదువుతోన్న ఒక చూపులేని వ్యక్తి బాధ చూడలేక అతనికి స్క్రైబ్‌గా మారింది. ఇక అప్పటి నుంచి ఎంతోమందికి స్క్రైబ్‌గా సేవ చేస్తున్నానని. ఇలా చేయడం తనకెంతో సంతృప్తినిస్తోందని పుష్ప తెలిపారు. నేను రాసే దానిమీదే వారి భవిష్యత్తు ఆధారపడి ఉందని.. నా బుద్దిని.. మనసును కేంద్రీకృతం చేసి స్క్రైబ్‌గా వ్యవహరిస్తున్నానని ఆమె అన్నారు. ఇది ఎంతో ఓపికతో కూడుకున్నదని.. ఒక్కోసారి ఒకే ప్రశ్నను 30 నుంచి 40 సార్లు చదవాల్సి వస్తుందని.. వారు అది విని అర్థం చేసుకునే వరకు సహనంతో వేచి చూస్తానని చెప్పారు.

ప్రస్తుత బిజీ ప్రపంచంలో స్క్రైబ్‌ను సంపాదించడం అంత తేలిక కాదని.. పుష్ప గారు తన లాంటి వారు ఎందరినో అవసరంలో ఆదుకున్నారని గణపతి అనే అతను అన్నాడు. చూపు సరిగా లేని తనకు పీజీ ఎంట్రన్స్ పరీక్షను పుష్ప రాశారని.. తాను ప్రస్తుతం ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్నాని తెలిపారు. తనలాంటి వారు.. స్క్రైబ్‌ను వెతుక్కునే పని లేకుండా ఆమె ఒక యాప్ క్రియేట్ చేశారని.. దాని ద్వారా పుష్ప మరింత మందికి చేరువయ్యారని గణపతి సంతోషం నిండిన కళ్లతో చెప్పారు. పుష్ప గారి సాయంతో తాను బీఏ ఫైనలియర్ పరీక్షలు పూర్తి చేశానని.. మహేంద్ర అనే మరో వ్యక్తి తెలిపారు. చిన్న పనికే బోలెడంత ప్రచారం పొందాలని చూసేవాళ్లున్న మన సమాజంలో... ఏళ్ల తరబడి సేవ చేస్తోన్నా కానీ.. ప్రచారానికి దూరంగా ఉండే పుష్ప నిజంగా అభినందనీయురాలు.

English Title
NM Pushpa worked as scribe




Related News