సాయం అందదు అప్పు పుట్టదు!

Updated By ManamTue, 08/07/2018 - 00:18
farmer
  • పెట్టుబడికి ప్రైవేటు అప్పులు.. పెరిగిన కౌలు ధర, కూలీ రేట్లు

  • ప్రభుత్వం ఆదుకోవాలంటూ విజ్ఞప్తి.. లేదంటే ఆత్మహత్యే దిక్కంటూ ఆవేదన

farmerహైదరాబాద్: కౌలు రైతుల పరిస్థితి రోజురోజూకీ దుర్భరంగా మారుతోంది. ఇటు ప్రభుత్వ సాయం అందక.. అటు పెట్టుబడికి డబ్బులు దొరక్క.. దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందజేస్తున్న ఎకరానికి రూ.4వేలు కౌలు రైతుకు దక్కకపోవడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై.. నెలలు గడస్తున్నా నేటికీ సగం మంది పెట్టుబడికి డబ్బులు అందక, నాట్లు వేయడం, విత్తనాలు పెట్టడంలో వెనకబడ్డారంటే అతిశయోక్తి కాదు. ఇక అన్ని అర్హతలు ఉన్నా.. రైతులకే రుణాలివ్వడానికి నానా కొర్రీలు పెడుతున్న బ్యాంకర్లు కౌలు రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు లేకపోవడం, ప్రభుత్వం కౌలు గుర్తింపు కార్డులను జారీ చేయకపోవడంతో బ్యాంకు రుణం వీరికి అందని ద్రాక్షగా మిగిలింది. ప్రైవేటుగా తప్ప ప్రభుత్వ పరంగా తక్కువ వడ్డీకి అప్పు పుట్టడంలేదు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న వాతవరణ శాఖ అంచనాలతో ఈ ఖరీఫ్‌ను ఉత్సాహం గా మొదలుపెట్టారు. గతేడాది వర్షాలు సకాలంలో పడకపోవడం, ఈ యేడు అదే పరిస్థితి ఎదురవ్వడంతో కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ఆర్థికంగా చితికిపోతున్న కౌలుదారులు..
ప్రభుత్వ పెట్టుబడి సాయం అందకపోవడం.. బ్యాంకులు రుణాలివ్వకపోవడం మూలంగా కౌలు రైతులు ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. మరోవైపు భూయాజమానులు ముందే కౌలు డబ్బులు ఇస్తే తప్ప.. భూమిని సాగు చేసుకోనివ్వకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. కౌలుదారు చట్టం ప్రకారం భూయాజమానుల అనుమతులు లేకుండానే రైతుకు రుణ అర్హత కార్డులను జారీ చేయాలి. కానీ పాసుపుస్తకాలను బ్యాంకుల్లో పెట్టి రుణాలను ఇప్పించడానికి యజమానులు ససేమిరా ఒప్పుకోవడం లేదు. గతంలో కౌలు గుర్తింపు కార్డులున్న వారికి బ్యాంకులు నేరుగా రుణాలిచ్చేవి. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి గుర్తింపు కార్డులు అందజేసేవారు. ఆర్థిక ఇబ్బందులు కారణంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే దాదాపు 435 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గతేడాది సుమారు 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. వీరిలో 125 మంది కౌలు రైతులు ఉండడం.. వారి దుర్భర పరిస్థితికి అద్ధం పడుతోంది.

రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి ఇలా..
రాష్ట్రవ్యాప్తంగా 58 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరు 1.08 కోట్ల ఎకరాల భూమిని సాగు చేస్తున్నారు. అయితే 58 లక్షల మంది రైతుల్లో దాదాపు 20 లక్షల మంది కౌలు రైతులు ఉండడం గమనార్హం. అయితే రాష్ట్రంలో వ్యవసాయం గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ప్రధాన జీవానాధారం. చాలామందికి ఉపాధి దొరక్క.. కుటుంబాలను పొషించుకునేందుకు కౌలుకు భూమిని సాగు చేస్తున్నారు. గతేడాది వరకు మక్కుతూ ములుగుతూ భూమిని సాగు చేసుకుంటూ.. కుటుంబాలను నెట్టుకొచ్చేవారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం పథకాన్ని అమలు చేయడంతో వీరికి కష్టాలు మొదలయ్యాయని చెప్పాలి. ఎందుకంటే.. అవగాహన లోపం కారణంగా భూమిని కౌలుకు ఇస్తే.. పెట్టుబడి సాయం అందదనే అపోహతో ఈయేడు భూములను వారే సాగు చేసుకున్నారు. భూములను కౌలుకు ఇచ్చేవారు తగ్గడంతో.. పెట్టుబడి పథకం పట్ల అవగాహన ఉన్న కొంతమంది రైతులు ఎక్కువ ధర చెల్లిస్తే.. కౌలుకు ఇచ్చేందుకు అంగీకరించారు. చేసుకునేందుకు పని దొరకదనే భావనతో.. చాలామంది కౌలు రైతులు ధర ఎక్కువ అయినా.. భూమిని కౌలుకు తీసుకున్నారు. ఒక్క ఎకరానికి ఈ సంవత్సరం రూ.14 వేల నుంచి రూ.20 వేల వరకు కౌలు ధర పలికింది. ఇదిలావుంటే.. ప్రభుత్వం ఉచితంగా రూ.4వేలను ఎకరానికి అందిస్తుందనే కారణంతో కూలీలు రేట్లను అమాంతం పెంచేశారు. ప్రస్తుతం నైపుణ్యం ఉన్న కూలీలు దొరక్కపోవడంతో పాటు వ్యవసాయ కూలీలుగా మారేందుకు ఈ తరం యువత ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా కూలీ రేట్లు పెరగడం, కూలు ధరలు ఆకాన్నంటడం వంటి కారణాలతో కౌలు రైతుల పాలిట గుదిబండలా మారాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందేలా చూడాలని పలువురు రైతులు కోరుతున్నారు.

ఆత్మహత్యే శరణ్యం..
కౌలు ధరలు అమాంతంగా పెరిగాయి. పెట్టుబడి పథకం పుణ్యమా అంటూ కూలీ రేట్లను విపరీతంగా పెంచేశారు. నాట్లు వేసేందుకు కూలీల కొరత ఉండడంతో ఎకరాకు రూ.3 వేల నుంచి రూ.4వేలు చెల్లించాల్సి వస్తుంది. గతంలో కౌలు రైతు గుర్తింపు కార్డుతో బ్యాంకుల్లో అప్పిచ్చేటోళ్లు. ప్రస్తుతం అలాంటిదేమీ లేదు. రైతు సంక్షేమానికి ఎన్నో పథకాలు తీసుకొస్తున్న ప్రభుత్వం.. కౌలు రైతుల గురించి ఆలోచించాలి. పెట్టుబడి ఖర్చులకు ప్రైవేటు అప్పులు తేవడంతో వడ్డీల భారం పెరుగుతోంది. ఏటికేడు అప్పుల్లో కూరుకుపోతున్నం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాలి. లేకపోతే కుటుంబాలతో సహ ఆత్మహత్యలే శరణ్యం అవుతాయి.
- కె.బుచ్చిరెడ్డి, 
త్రిపురారం, నల్లగొండ జిల్లా

English Title
No help No debt will be born
Related News