
హైదరాబాద్: మక్కా మసీదు పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కోర్టు తీర్పుతో న్యాయం జరగలేదని ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. పేలుళ్ల కేసులో ఎన్ఐఏ దర్యాప్తు సరిగా లేదన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఎన్ఐఏపై రాజకీయ ఒత్తిళ్లు పనిచేశాయి. 2014 తర్వాత మెజార్టీ సాక్షులు మాట మార్చారు. పేలుళ్లలో చనిపోయిన 9 మంది కుటుంబాలకు న్యాయం దక్కలేదు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్న స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం, ఎన్ఐఏలు వ్యవహరించాయి. అరెస్టైన ప్రధాన నిందితులకు 90 రోజుల లోపే బెయిల్ వచ్చినా, ఎన్ఐఏ సవాలు చేయలేదు. కళ్లముందు ఇంత జరుగుతున్నా ఎన్ఐఏ గుడ్డి, చెవిటిదానిలా ఉండిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలో న్యాయమన్నదే లేకుండాపోయే ప్రమాదం ఉంది' అని అసదుద్దీన్ మండిపడ్డారు. కాగా, మక్కా మసీద్ పేలుళ్ల కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది. 11ఏళ్ల విచారణ తర్వాత సోమవారం ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును వెలువరించింది. 2007 మే 18న మక్కా మసీదులో బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్ల కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఐదుగురు నిందితులను నిర్దోషులుగా కోర్టు తేల్చింది.
కోర్టు తీర్పును పరిశీలించాల్సి ఉంది: ఎన్ఐఏ
మక్కామసీదు బాంబు పేలుళ్ల కేసులో నాంపల్లి కోర్టు తీర్పును పరిశీలించాల్సి ఉందని ఎన్ఐఏ పేర్కొంది. తీర్పును పరిశీలించాక తదుపరి కార్యాచారణ చేపడుతామని స్పష్టం చేసింది.
ఎన్ఐఏ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నా..
ఎమ్మెల్సీ రామచందర్ రావు మాట్లాడుతూ.. ఎన్ఐఏ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు చెప్పారు. మక్కా పేలుళ్ల కేసులో అప్పటి కేంద్ర ప్రభుత్వం అమాయకులను ఇరికించిందని, సంఘ్ పరివార్ను అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. ఈ కేసులో కీలకమైన సాక్ష్యాలను వదిలిపెట్టిందని రామచందర్ రావు విమర్శించారు.