మా పార్టీల ఎవ్వరు జేర్తలేరెందుకో?

Updated By ManamTue, 09/11/2018 - 23:59
bjp
  • నిరాశలో బీజేపీ క్షేత్రస్థాయి శ్రేణులు.. చేరకపోగా.. ఇతర పార్టీల్లోకి జంప్

  • ఆధిపత్యం, వర్గపోరే కారణమా..?.. అధికారంలోకి వస్తామని మాత్రం ధీమా

  • అమిత్ షా సభ ఉత్సాహం నింపేనా..?

‘‘టీఆర్‌ఎస్‌లోని పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు త్వరలోనే బీజేపీలో చేరుతారు. వారంతా బీజేపీతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు. కాంగ్రెస్, టీడీపీకి చెందిన నేతలు కూడా కమలం పార్టీ వైపు చూస్తున్నారు. 2019 ఎన్నికల్లో అధికారం తమదే.’’ ఇవి గతంలో బీజేపీ నేతలు తరచూ పలికిన మాటలు.
‘‘సార్ తమతో వివిధ పార్టీల కీలక నేతలు టచ్‌లో ఉన్నారు. తొందరలోనే పార్టీలో చేరుతారు’’ అని బీజేపీ నేతలు శంషాబాద్‌లో కలిసిన సందర్భంగా అమిత్‌షాకు వివరిస్తుండగా.. ‘‘ఎప్పట్నుంచో ఇదే చెబుతున్నారు. ఒక్కరు కూడా చేరడంలేదు. అసలు చేరుతారా..?’’ అని కమల దళపతి ఘాటుగా స్పందించారు.
 
imageహైదరాబాద్: రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది.  ఆయా పార్టీలు అభ్యర్థుల వేటలో తలమునకలయ్యాయి. ఆశావహులు సైతం తమ సీటు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఒక వేళ సీటు తమకు రాకపోతే ఇతర పార్టీల వైపు తొంగి చూస్తున్నారు. ఇప్పటికే వివిధ పార్టీల నేతలు అటు..ఇటు వైపు పార్టీలు మారుతున్నారు. అధికారం మాదే అని తరచూ ప్రగల్భాలు పలుకుతున్న బీజేపీలోకి నేతలు రావడం అటుంచితే.. ఉన్న వారు సైతం పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు నాయకులు కాంగ్రెస్ గూటికి చేరారు. ప్రస్తుత పరిణామం బీజేపీ శ్రేణులను నిరాశకు గురిచేస్తోంది.

ఆధిపత్యం, వర్గపోరు..
తెలంగాణ ఉద్యమంలో బీజేపీ కీలక పాత్ర పోషించి, రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. నాడు 2014 ఎన్నికల్లో కింది స్థాయి నేతలకు ఇష్టం లేకున్నా వివిధ కారణాలతో టీడీపీతో పొత్తు పెట్టుకుని 5 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఆ సీట్లన్నీ హైదరాబాద్‌కు చెందిన స్థానాలే. అయితే ఆ సమయంలో ఒక వర్గం టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని, మరో వర్గం వద్దని అంతర్గతంగా వాదించాయి. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి పార్టీలో ఆధిపత్య, వర్గపోరు నడుస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడు నుంచి నాలుగు వర్గాలు ఎవరికి వారే పనిచేసుకుంటున్నారని సమాచారం. కొత్త వారు వచ్చినా ఎదగనీయని, ఎప్పుడూ ఆ ఐదారు పాత ముఖాలే పార్టీలో కనిపిస్తాయని బహిరంగంగా అనుకుంటున్నారు. 

కొత్త చేరికలేవీ..?
ఇక బీజేపీ నేతల తీరుతో పార్టీలో చేరిన నేతలు ఇమడలేకపోతున్నారనే అపవాద ఉంది. ఆ మధ్య సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఇక ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లోకి జోరుగా వలసలు జరుగుతున్నాయి. సీట్లురాని వారు, అసంతృప్తులు ఆ రెండు పార్టీల్లో చేరుతున్నారు. కానీ తామే అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్న బీజేపీ వైపు మాత్రం ఒక్కరు కూడా పరిస్థితి నెలకొంది. గతంలో అడపాదడపా కిందిస్థాయి నేతలు చేరుతున్నారు. పార్టీలోకి కొత్త నేతలు చేరడం పక్కనబెడితే ఉన్న నాయకులు కూడా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, సీనియర్ నేత డీకే సమరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో బీజేపీ శ్రేణులు ‘తెలంగాణలో బలహీనంగా ఉన్న టీడీపీకి వైపు కూడా చూస్తున్నారు. కానీ మా పార్టీల ఎవ్వరుజేర్తలేరు. ’ అని ఒకింత నిరుత్సాహానికి, నిరాశకు లోనవుతున్నారు. 

‘అమిత్ షా’ సభతో కీలక పరిణామాలు?
ఈ నెల 15వ తేదీన మహబూబ్‌నగర్‌లో బీజేపీ సమర శంఖారావం సభ నిర్వహించనున్నారు. ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సభతో ఎన్నికల ప్రచారం షురూ కానుంది. దీనికి సంబంధించి సోమవారం మహబూబ్‌నగరలోని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే భారీ జనసమీకరణకు రాష్ట్ర నేతలకు బాధ్యతలు అప్పగించారు. అయితే సభలో వివిధ పార్టీల నేతలు ఎవరైనా చేరుతారా..? అమిత్ షా ఏం మాట్లాడుతారు..? కమల కేడర్‌కు ఈ సభ ఉత్సాహాన్ని నింపుతుందా..? ఎలాంటి కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయో..? అనేది వేచిచూడాలని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా ‘అమిత్ షా సభతో రాష్ట్రంలో బీజేపీ ఆట మొదలవుతుంది. రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి’ అని ఇటీవల ఆ పార్టీ నేత కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

English Title
no one is not coming to our party
Related News