‘నిర్భయ’ చట్టం కాదు... సంస్కారం కావాలి!

Updated By ManamSun, 04/15/2018 - 02:55
Nirbhaya

Nirbhayaనిర్భయని  అతి దారుణంగా జనారణ్యంలో సంచరించే మృగాళ్లు కామకింకరులై మింగినపుడు యావత్ భారతం వీధుల్లోకి వచ్చి క్యాండిళ్లతో నిరసన జ్వాలని తెలిపింది. కార్డులని ఎక్కుపెట్టి అబలలపై జరుగుతున్న దాడులను ఆక్షేపించింది. ఆ ఆగ్రహావేశాలకు ప్రతి రూపంగా ‘నిర్భయ చట్టం’ రూపుదాల్చింది. ఆ చట్టం కాగితాల మీద అక్షరాలుగా మిగిలిపోయిందా అన్న చందంలా మళ్ళీ కింకరుల దాడుల యాత్ర కొనసాగుతూనే ఉంది. వాస్తవంలోకి వచ్చి సమస్య మూలాల్ని విశ్లేషిస్తే ఇలాంటి చట్టాలు, ఇంతటి సువిశాల దేశంలో, సాంకేతికత ఇంకా అన్ని వర్గాలకు చేరువ కానీ పరిస్థి తుల్లో మనుగడ సాగించగలవా? దాడులకు పాల్పడే వాళ్ళను  రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటో రకం ఆవేశంతో ఆలోచించే శక్తిని కోల్పోయి అప్పటి కప్పుడు నేరాలు చేయడం, వీరిని ఎలాంటి చట్టాలు నిలువరించలేవు. కొంత వరకు సాంకేతిక పరిజ్ఞానం, మహిళల ముందస్తు జాగ్రత్త తప్ప. రెండో రకం ముందస్తు  జాగ్రత్తలతో ఘోరాలు చేసే వారు, వీరిని సత్వర న్యాయాలను అందించడం ద్వారా మాత్రమే నిలువరించవచ్చు. అందుకు కోర్టుల సంఖ్యను, సాంకే తిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవాలి. కాలచక్రంలో మరెందరో నిర్భయలు నిర్భయ చట్టం కళ్ళ ముందే నిర్దయుల చేతిలో నలిగిపోయారు. ఇప్పుడు అసిఫా వంతు. ఈ నిరసనను తిలకించే వీధులు మారలేదు, ఆ నిరసనలో పాలుపంచుకున్న క్యాండిళ్ళు మారలేదు, గళమెత్తిన యువతా మారలేదు, యథావిధిగా మన ఇంటి బిడ్డలపై జరిగే అఘాయిత్యాలూ మారలేదు. వీధు ల్లోకి క్యాండిల్ పట్టుకొచ్చిన ప్రతీ వోడు పవిత్రుడేనా? ఆ కళ్ళే క్యాండిల్ వెలుగులో చీర కనపడితే కామపు సొల్లు కరుస్తుందేమో? నిరసనకై గళమెత్తుతున్న ప్రతి మగ గొంతు ఆడవారిని పూజిస్తుందా? మందలో ఒకటిగా కలిసి అరుస్తుందా? మార్పు రావాల్సింది గొంతులో కాదు, నిరసనల్లో కాదు... ప్రతీ కుటుంబంలో స్త్రీని చూసే దృక్కోణంలో మార్పురావాలి. వారి అభిప్రాయాలకి విలువనిచ్చే సంస్కృతీ రావాలి. మహిళంటే కుటుం బాన్ని చూసుకునే ఇంటి పనిమనిషి అని, రతి క్రీడకై పుట్టిన వస్తువు అనే భావజాలంలో మార్పురావాలి. 

అమ్మని చూసినంత పవిత్రంగా ఇతర మహిళలం దరిని చూడగలగాలి, అండగా నిలబడగలగాలి. దీని కోసమే కాగడా వెలిగించాలి, విప్లవ గొంతుకను  మోగించాలి. సమస్య పునాదులపై యుద్ధం ప్రకటించాలి. అంతే కానీ ఇలాంటి గాలి దుమారపు నిరసనలు సమస్యను పెకిలించలేవు. ఎవరయితే వీధు ల్లోకి వచ్చి పోరాటం చేస్తున్నారో, ముందు మీ ఇంట్లో ఉన్న మహిళలకి, వాళ్ళ అభిప్రాయాలకి గౌరవం ఇవ్వండి, పరాయి మహిళలనూ అంతే గౌరవించండి. అదే మనం అసిఫాలాంటి ఎందరో చెల్లెళ్లకి ఇచ్చే నిజమయిన నివాళి.
 పరవస్తు విశ్వక్సేన్

Tags
English Title
Is not the 'fear of the law'
Related News