ఒకేసారి ఎన్నికలు అసాధ్యం: ఈసీ

Updated By ManamTue, 08/14/2018 - 12:46
simultaneous elections- Election Commission
Election commission

న్యూఢిల్లీ : ‘వన్ నేషన్-వన్ పోల్’ విధానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం వ్యతిరేకించింది. వచ్చే సాధారణ ఎన్నికల్లోగా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఈసీ స్పష్టం చేసింది. అయితే  వచ్చే ఏడాది జమిలి ఎన్నికలు జరుగుతాయంటూ గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

కాగా వచ్చే ఏడాది లోక్‌సభతో పాటు 11 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ను సమర్థిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా న్యాయ కమిషన్‌కు సోమవారం లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికలపై ఈసీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

ఏకకాలంలో ఎన్నికలపై  కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి తగినన్ని వీవీప్యాట్స్‌ లేవని తెలిపారు. అయితే జమిలీ ఎన్నికల నిర్వహణపై రెండు, మూడు నెలల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఒకవేళ ఒకవేళ జమిలీ ఎన్నికలు జరిగితే 34 లక్షల ఈవీఎంలు, 26 లక్షల కంట్రోల్ యూనిట్లు, 27 లక్షల వీవీప్యాట్‌లు అవసరం కానున్నాయి. కాగా జమిలీ ఎన్నికలను... అధికార ఎన్డీఏతో పాటు అకాలీదళ్, ఏఐఏడీఎంకే, సమాజ్‌ వాదీ, టీఆర్‌ఎస్‌ సమర్ధించగా, కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, టీడీపీ, జేడీఎస్, వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. 

English Title
Not possible to hold simultaneous elections next year: Election Commission
Related News