రాజ్యసభ ఎన్నికల్లో ‘నోటా’కు నో

Updated By ManamTue, 08/21/2018 - 14:55
NOTA, Rajya Sabha Elections, Supreme Court, NDA, Congress Party, Non of the Above
  • పరోక్ష ఎన్నికలలో వద్దన్న సుప్రీంకోర్టు.. 2014లో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్

  • అది అవినీతికి తావిస్తుందన్న కాంగ్రెస్.. నోటాను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు

  • కాంగ్రెస్ వాదనకు ఎన్డీయే మద్దతు.. నోటిఫికేషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

NOTA, Rajya Sabha Elections, Supreme Court, NDA, Congress Party, Non of the Aboveన్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల్లో నోటా (నన్ ఆఫ్ ద ఎబోవ్) ఆప్షన్‌ను అనుమతించేది లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఎన్నికల కమిషన్ జారీచేసిన నోటిఫికేషన్‌ను ఓవర్ రూల్ చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం.. ఈసీ నోటిఫికేషన్‌ను రద్దుచేసింది. రాజ్యసభ ఎన్నికల బ్యాలట్ పేపర్లలో నోటా కూడా అనుమతిస్తూ ఈసీ ఇంతకుముందు ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే, రాజ్యసభ ఎన్నికలు వివిధ రాష్ట్రాలకు నైష్పత్తిక ప్రాతినిధ్యం కల్పించడానికి పరోక్షంగా నిర్వహించే ఎన్నికలని, వాటిలో నోటాను పెట్టడం ఏమాత్రం తగదని సుప్రీం వ్యాఖ్యానించింది. బ్యాలట్ పేపర్లలో నోటా పెట్టడాన్ని సవాలు చేస్తూ గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్ చీఫ్‌విప్ శైలేష్ మనుభాయ్ గత నెలలో దాఖలుచేసిన కేసులో తీర్పు వెలువరిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. నోటాను అనుమతిస్తే రాజ్యసభ ఎన్నికల్లో సభ్యుల కొనుగోలు, అవినీతి పెరుగుతాయని ఆయన వాదించారు. 

నోటా అనేది ప్రత్యక్ష ఎన్నికలలో వ్యక్తులు ఉపయోగించడానికి మాత్రమే ఉద్దేశించినదని కోర్టు తెలిపింది. ఈ ఎన్నికలలో ఎవరైనా ఓటు వేయకపోతే వాళ్లను ఆ పార్టీ బహిష్కరించే అవకాశం ఉందని, కానీ నోటాను ప్రవేశపెట్టడం ద్వారా ఓటు వేయకపోవడాన్ని చట్టబద్ధం చేస్తున్నారని అంటూ.. ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక చర్యలో కోర్టును ఎందుకు ఒక పార్టీగా చేస్తారని ప్రశ్నించింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో నోటా ఉండాలని 2013లో సుప్రీంకోర్టే సూచించింది. దాంతో 2014లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కూడా నోటాను ఈసీ ప్రవేశపెట్టింది. దాన్ని గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సవాలు  చేసింది.  కాగా, రాజ్యసభ ఎన్నికల్లో నోటా వద్దన్న వాదనకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా మద్దతు తెలపడం విశేషం.

English Title
NOTA can not be allowed in Rajya Sabha electons, declares Supreme Court
Related News