అష్ట బంధనం

Updated By ManamTue, 08/14/2018 - 07:20
tirumala
  • మహా సంప్రోక్షణంలో మూడోరోజు కార్యక్రమం

  • అష్టదిక్కుల్లో సంధిబంధనం చేసిన రుత్వికులు

  • తగ్గిన వేంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం 

  • రోజుకు రూ. 3 కోట్ల నుంచి.. కోటి లోపే!

tirumalaతిరుపతి: కలియుగ వైకుంఠం తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న బాలాలయ అష్టబంధన మహాసంప్రోక్షణంలో మూడో రోజు సోమవారం అష్టబంధన కార్యక్రమం జరిగింది. రుత్వికులు శాస్త్రోక్తంగా అష్టబంధన కార్యక్రమాలు నిర్వహించారు. గర్భాలయంలో మూలమూర్తి (ధ్రువమూర్తి) పటిష్ఠత కోసం విగ్రహం చుట్టూ కదలికలు లేకుండా దృఢంగా ఉండేందుకు ఎనిమిది వైపుల సంధిబంధనం చేయడాన్ని అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం అంటారు. వైఖానస ఆచార్యుల అధ్వర్యంలో సంప్రదాయ శిల్పాచార్యుల సహకారంతో అష్టబంధన ద్రవ్యాలను సేకరించి, ఆయాద్రవ్యాలకు సంబంధించిన దేవతలను ఆరాధించిన తరువాత అష్టబంధనం తయారుచేస్తారు. సోమవారం రుత్వికులు శాస్త్రోక్తంగా అష్టబంధన ద్రవ్యాలను సేకరించి, ఉదయం 6.00 గంటల నుంచి 12 గంటల వరకు, రాత్రి ఏడు నుంచి పది వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం శ్రీ వేంకటేశ్వరుని మూలమూర్తితో పాటు ఇతర దేవతామూర్తుల విగ్రహాలకు అష్టబంధనాన్ని సమర్పిస్తారు. అష్టబంధనం గురించి భృగుమహర్షి  రచించిన భృగుప్రకీర్ణాధికారం గ్రంధంలో చెప్పిన విధంగా చేపట్టారు. భృగు మహర్షి అష్టబంధనం గురించి తెలియజేస్తూ ‘‘శంఖచూర్ణం, మధూచ్చిష్టం, లాక్షా త్రిఫలమేవచ, కాసీసం గుగ్గులుం చైవ చూర్ణం రక్త శిలాకృతమ్, మాహిషం నవనీతం చేత్యష్టబన్ధ ఇతి స్మృతః’’ అని అన్నారని అర్చకులు తెలిపారు. ఎనిమిది రకాల ద్రవ్యాలతో అష్టబంధనాన్ని తయారు చేస్తారు. వాటిలో శంఖచూర్ణం 25.5 తులాలు, మధుజ (తేనె మైనం) 3.5 తులాలు, లాక్షా (లక్క) 3.75 తులాలు, గుగ్గులు (వృక్షపు బంక) 9 తులాలు, కార్పాసం (ఎర్రపత్తి) ఒక తులం, త్రిఫలం (ఎండిన ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ) 7.5 తులాలు, రక్తశిలాచూర్ణము (గైరికము) 7.5 తులాలు, మాహిషా నవనీతము (గేదె వెన్న) 15 తులాలు ఉంటాయి. వీటికి ఔషధ గుణాలు కూడా ఉన్నట్లు తెలిపారు. శంఖ చూర్ణంతో చంద్రుడిని, తేనె మైనంతో రోహిణీ, లక్కతో అగ్ని, గుగ్గులుతో చండ, ఎర్రపత్తితో వాయువును,  త్రిఫల చూర్ణంతో హరిని, గైరికముతో స్కందుడిని, గేదె వెన్నతో యముడిని ఆరాధిస్తారు. ముందుగా ద్రవ్యాలను శుభ్రపరిచి ఆచార్యుల సమక్షంలో సంప్రదాయ శిల్పులు రోటిలో వేసి, 30 నిముషాలు దంచుతారు. దంచగా వచ్చిన పాకాన్ని ముద్దగా చేసుకుని, గంటకు ఒకసారి చొప్పున ఎనిమిది సార్లు, అవసరమైనంత వెన్న కలుపుకుంటూ దంచుతారు. ఈ పాకాన్ని ముద్దలుగా తయారు చేసి, ఈ అష్టబంధనాన్ని పద్మపీఠంపై స్వామి వారి పాదాల కింద అష్టదిక్కుల్లోను సమర్పిస్తారు. ఈ కార్యక్రమం సోమవారం పూర్తయింది. 

తగ్గిన శ్రీవారి హుండీ ఆదాయం
శ్రీవారి ఆలయంలో జరుగుతున్న ఆరు రోజుల మహాసంప్రోక్షణం కారణంగా శ్రీవారి హుండీ ఆదాయం బాగా తగ్గిపోయింది.  స్వామి వారి హుండీ ఆదాయం ఇన్నాళ్లూ సగటున రోజుకు మూడు కోట్ల రూపాయలు ఉండగా, ఆదివారం హుండీ ఆదాయం ఒక్కసారిగా 73 లక్షలకు పడిపోయింది. సోమవారం కోటి రూపాయలకు చేరుకున్నా, మంగళ బుధవారాల్లో  భక్తుల సంఖ్యను పూర్తిగా తగ్గించనున్నారు. దీంతో ఈ రెండురోజుల ఆదాయం మరింత తగ్గిపోయే అవకాశాలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. గత మూడు రోజులుగా  భక్తుల సంఖ్య కూడా విపరీతంగా తగ్గిపోయింది. ఎక్కువ మంది భక్తులకు దర్శించకునేందుకు అవకాశం ఇచ్చినా, అంత మంది భక్తులు తిరుమలకు రావడానికి సంకోచిస్తున్నారు. దీనికి కారణం గతంలో టీటీడీ అధికారులు చేపట్టిన అతి ప్రచారమేనని తెలుస్తోంది. సోమవారం నాటికి భక్తుల సంఖ్య కూడా బాగా తగ్గిపోయి, అరగంటలో శ్రీవారి దర్శనం కల్పించేలా జరుగుతోంది.

English Title
Octal bonding




Related News