ఆంక్షల నడుమ చమురు సరఫరా

Updated By ManamTue, 11/06/2018 - 22:14
oil

oilన్యూఢిల్లీ: ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునేందుకు ఇండియా, మరి ఏడు దేశాలు అమెరికా నుంచి ఎంత ఊరట పొందాయో పూర్తిగా అవగాహన చేసుకునేందుకు మరికొంత కాలం పడుతుంది. వివరాలను నిశితంగా పరిశీలిస్తేకానీ మర్మం బయటపడదు. అందుకనే తదుపరి కార్యాచరణను రూపొందించుకునేందుకు ముందు షరతులు, నియమ నిబంధనలు నిశితంగా వెల్లడయ్యేంత వరకు ఎదురు చూడాలని ఆయిల్ కంపెనీలు, పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ అధికారులు భావిస్తున్నారు. ‘‘ఇరాన్ చమురు దిగుమతిని కొనసాగించేందుకు మనకు ఆరు లేదా ఏడు నెలలపాటు అవకాశమిచ్చినట్లుగా పైకి కనిపిస్తోంది. అది తాత్కాలిక మాఫీయేనా లేక ప్రస్తుత కాంట్రాక్టుల గడువు ముగిసిన తర్వాత కూడా సెకండరీ ఆంక్షలకు లోనుకాకుండా ఇండియా దిగుమతులను కొనసాగించుకోవచ్చా అనేది లోపలి వివరాలు వెల్లడైన తర్వాత మాత్రమే తెలుస్తుంది’’ అని ఈ వ్యవహారాలతో ప్రమేయం ఉన్న అధికారి ఒకరు చెప్పారు. ‘‘ఎనిమిది దేశాలకు వాషింగ్టన్ ఇచ్చిన  గణనీయ తగ్గింపు మినహాయింపు (ఎస్.ఆర్.ఇ) వివరాలను మేం ఇంకా పరిశీలించవలసి ఉంది. అనేక షరతులతో అమెరికా ఆ మినహాయింపును మంజూరు చేసింది. చమురు దిగుమతులను మున్ముందు మరింత సంకోచింపజేసే అవకాశం ఉంది. ఇరాన్‌కు అమ్మే వస్తువులపైన కూడా ఆంక్షలు పెట్టవచ్చు. స్థానిక కరెన్సీతో చేసే చమురు కొనుగోళ్ళలో సమతౌల్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించవచ్చు’’ అని ఆ అధికారి వివరించారు. 

అణు ఒప్పందంలో భాగంగా ఎత్తివేసిన ఆంక్షలను ఇరాన్‌పై అమెరికా తిరిగి విధించింది. ఇవి ఇరాన్ ఎనర్జీ, నౌకా నిర్మాణం, నౌకాయానం, బ్యాంకింగ్ రంగాలపై నవంబర్ 5 నుంచి అమలులోకి వచ్చాయి. వాణిజ్య భాగస్వాములందరినీ ఇరాన్ నుంచి చమురు కొనడాన్ని నిలిపివేయాల్సిందిగా అమెరికా కోరింది. నవంబర్ 4 తర్వాత ఇరాన్‌తో చమురు వర్తకం కొనసాగించే దేశాలపై తాము సెకండరీ ఆంక్షలు విధించడానికి అవకాశం ఉందని వాషింగ్టన్ హెచ్చరించింది. అయితే, చమురుకు దిగుమతులపై ఆధారపడుతున్న ఎనిమిది దేశాలకు ఆంక్షల నుంచి మాఫీ మంజూరు చేయాలని అది నిర్ణయించింది. ఇరాన్ నుంచి దిగుమతులలో ‘‘గణనీయమైన తగ్గింపులను ప్రదర్శించిన’’ దేశాలకు అలాంటి మినహాయింపును కల్పించనున్నట్లు తెలిపింది. ‘‘ఒబామా ప్రభుత్వం 2012-2015 మధ్య కాలంలో 20 దేశాలకు ఎస్.ఆర్.ఇలను అనేకసార్లు మంజూరు చేసింది. మా చర్చలు కనుక పూర్తైతే నిర్ణయాల్లో మార్పు చేర్పులుంటాయి. ఎనిమిదింటికి వాటిని మంజూరు చేశాం. అవి తాత్కాలికమేనని కూడా స్పష్టం చేశాం. చాలా కొద్ది మినహాయింపులను మాత్రమే మంజూరు చేయాలని మేం నిర్ణయించుకోవడమే కాదు, ఆ దేశాల నుంచి మరిన్ని తీవ్రమైన రాయితీలను మేం డిమాండ్ చేశాం. ఇరాన్ ముడి చమురు దిగుమతిని తాత్కాలికంగా కొనసాగించుకునేందుకు అనుమతించడానికి అంగీకరించేముందు వాటి నుంచి వివిధ విషయాల్లో మాట తీసుకోనున్నాం’’ అని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ పాంపియో అక్టోబర్ 2న మీడియా సమావేశంలో చెప్పారు. ‘‘ఆహార పదార్థాలు, మందులు వంటి మానవీయ సామగ్రిని విక్రయించేందుకు దేశాలకు అనుమతిస్తే అనుమతించవచ్చు. ఆంక్షలు వర్తించని మరికొన్ని సరుకుల విక్రయానికి కూడా అభ్యంతరం చెప్పకపోవచ్చు. కానీ, వివరాలు ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. ఇరాన్‌కు చేసే ఎగుమతులు అమెరికా నుంచి తీవ్ర పరిశీలనకు గురికావచ్చు’’ అని భారతీయ అధికారి చెప్పారు. ఇరాన్‌తో వర్తకం జరపడంపై బ్యాంకింగ్ పరమైన ఆంక్షలు ఉన్నందు వల్ల ఆ దేశం నుంచి చమురు దిగుమతి చేసుకునే ఇండియా వంటి దేశాలు వాటి ప్రాంతీయ కరెన్సీలలో చెల్లింపులు జరుపవలసి ఉంటుందని భావిస్తున్నారు. దిగుమతి చేసుకునే దేశంలోని నేషనల్ బ్యాంక్ ఖాతాలో ఆ మొత్తాన్ని జమ చేయవలసి ఉంటుంది.

చెల్లింపు ఏర్పాటు
ఇండియా-ఇరాన్‌ల మధ్య ఇప్పటికే అటువంటి రూపాయి చెల్లింపు ఏర్పాటు ఉంది. గతంలో ఆర్థిక ఆంక్షలు విధించిన కాలంలో చమురుకు చెల్లించడానికి భారత్ అటువంటి ఏర్పాటు చేసుకుంది. ఆ ఏర్పాటును రద్దు చేసుకోలేదు. కాకపోతే దానిని ఇప్పుడు తిరిగి క్రియాశీలం చేయవలసి ఉంది. చమురు దిగుమతికి అయ్యే వ్యయంలో ఇండియా 45 శాతం మొత్తాన్ని రూపాయలలో, మిగిలిన మొత్తాన్ని యూరోలలో చెల్లించాలని కడపటిసారి ఒక అవగాహన కుదుర్చుకున్నారు. యూకో బ్యాంక్‌లో ఉన్న ఖాతాలో చెల్లింపులకు సంబంధించిన రూపాయలను జమచేసేవారు. ఇరాన్ వాటిని భారతదేశం నుంచి వేరే వస్తువులు కొనేందుకు ఉపయోగించుకునేది. ‘‘ఈసారి బ్యాంకింగ్ చానెల్ ఆంక్షలు కూడా మరింత కఠినంగా ఉన్నాయి. యూరోలలో చెల్లింపులు జరపడం మరింత కష్టమవుతుంది. అయితే, వాణిజ్యంలో ఎంత శాతం భాగానికి రూపాయలలో చెల్లింపులు జరపవచ్చో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశంపై ఇరానియన్లతో చర్చలు కొనసాగుతాయి’’ అని ఆ అధికారి చెప్పారు. 

Tags
English Title
Oil supply between emissions
Related News