రెండు రోజుల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు 

Updated By ManamFri, 04/27/2018 - 22:35
harish
  • మంత్రి హరీష్‌రావు ఆదేశాలు

  • మంత్రులు ఈటల, పోచారంతో కలిసి  కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్

imageహైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మంత్రి హరీశ్‌రావు కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం సచావాలయంలో ఆర్థిక, పౌర సరఫరా శాఖ మంత్రి ఈటర రాజేందర్, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ... తెలంగాణలో 3308 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా 1477 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మిగిలిన కేంద్రాల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించారు. రైతులు 17 శాతం కంటే తక్కువ తేమ ఉండే విధంగా వరి ధాన్యాన్ని ఎండపెట్టి అమ్మకానికి తీసుకుని రావాలని, విస్తృతంగా ప్రచారం నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లర్లకు తరలించుటకు అవసరమైన రవాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. లారీల ఇబ్బంది ఉన్నట్టు గుర్తిస్తే వెంటనే ఆర్‌టీఏ అధికారులను సంప్రదించి లారీలను సేకరించవలనన్నారు. జాయింట్ కలెక్టర్లు ప్రతి రోజు ఉదయం కొనుగోలు కేంద్రాలను సందర్శించి ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఐకేపీ, సివిల్ సప్లై, మార్కెటింగ్, ట్రాన్స్ పోర్టు శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. జిల్లా యంత్రాంగం వరి ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉండాలన్నారు. వరిధాన్యం కొనుగోలు విషయంలో రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని కలెక్టర్లకు ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని అదే రోజు ప్రభుత్వ గిడ్డంగులకు, మిల్లులకు తరలించాలన్నారు. కొనుగోలు చేసిన మక్కల ధరను చెల్లించడానికి వెంటనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 70,298.90 మెట్రిక్ టన్నుల మక్కలను కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ... రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు. వచ్చే 10 రోజుల లోపల ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని ఆదేశించారు. నిధులు అందుబాటులో ఉన్నాయని, 24 గంటల్లో రైతులకు చెల్లింపులు జరుపుతాయన్నారు. రాష్ట్రంలో ఇంత వరకు 5.5 లక్షల టన్నుట ధాన్నాన్ని కొనుగోలు చేసినట్టు తెలిపారు. 300 కోట్లను రైతులకు చెల్లించినట్టు తెలిపారు. ఈ ఏడాది 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వస్తుందని అంచనా వేసినట్టు తెలిపారు. గన్ని బ్యాగుల కొరత లేదన్నారు. ట్రాన్స్‌పోర్టు శాఖ సహకారంతో ధాన్యం కొనుగోలు సెంటర్ల నుంచి మిల్లర్లకు అదే రోజే సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

3 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్‌ను తమిళనాడుకు ఎగుమతి చేయడానికి కరీంనగర్, పెద్దపల్లి, నల్లగొండ, నిజామాబాద్, మెదక్ జిల్లాల రైస్ మిల్లర్లకు అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ... కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే మిల్లుకు తరలించనందువలన తూకంలో వ్యత్యాసం వచ్చి మిల్లు యజమానులు అన్‌లోడ్ చేసినప్పుడు అదనపు కోత విధిస్తున్నందుకు రైతులు నష్ట పోవుచున్నారని, ఈ విషయంలో వెంటనే మార్కెట్ నుంచి కొనుగోలు చేసిన సరకును మిల్లులకు తరలించడంలో అలసత్వం వహించవద్దన్నారు. ఈ సమావేశంలో సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, రోడ్ల భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి, పౌర సరఫరాల శాఖ కమిషనర్ సునీల్ శర్మ, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

English Title
Paddy grain purchase centers within two days
Related News