పోలీసుల హత్య వెనుక పాక్!

Updated By ManamSun, 09/23/2018 - 23:48
PAK-ISI
  • బలగాలను హతమార్చాలని ఐఎస్‌ఐ ఆదేశాలు

  • ఆ క్రమంలోనే కశ్మీర్‌లో మగ్గురు పోలీసుల హత్య

  • గుర్తించిన భారత ఇంటెలిజెన్స్ వర్గాలు

PAK-ISIన్యూఢిల్లీ: జమ్మూకశ్మీరులో స్పెషల్ పోలీస్ ఆఫీసర్లను చంపాలని ఉగ్రవాదులకు పాకిస్థాన్ నుంచి ఆదేశాలు వస్తున్నట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) నుంచి వస్తున్న ఆదేశాలను భారత నిఘా వర్గాలు అడ్డుకుని వినగలిగాయి. దీంతో కశ్మీరులోని ఉగ్రవాదులకు పాకిస్థాన్ నుంచి వస్తున్న ఆదేశాలు స్పష్టంగా వెల్లడయ్యాయి. ఈ కారణంతోనే న్యూయార్క్‌లో జరగవలసిన భారత్-పాక్ విదేశాంగ మంత్రుల సమావేశాన్ని భారత్ రద్దు చేసుకున్నట్లుగా తెలిసింది. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ రియాజ్ నైకూ ఇటీవల జమ్మూ-కశ్మీరు పోలీసులను హెచ్చరించిన సంగతి తెలిసిందే. రాజీనామా చేయండి, లేదా, చావండి అంటూ హెచ్చరించాడు. ఈ హెచ్చరిక వెలువడిన రెండు రోజుల్లోనే ఉగ్రవాదులు ముగ్గురు పోలీసులను అపహరించి, హత్య చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పాకిస్థాన్‌లోని వ్యక్తులు ఈ పోలీసుల హత్యలకు ప్రణాళికను రచించి, కశ్మీరు ఉగ్రవాదులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అపహరించిన ముగ్గురు పోలీసులను వెంటనే చంపేయాలని, సాధారణ పౌరుడిని విడిచిపెట్టాలని పాకిస్థాన్‌లోని వ్యక్తులే ఇక్కడి ఉగ్రవాదులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. జమ్మూ-కశ్మీరులో స్థానిక ఎన్నికలు జరగకుండా నిరోధించడమే లక్ష్యంగా పాకిస్థాన్ వర్గాలు పని చేస్తున్నట్లు భారతీయ నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఇదే లక్ష్యంతో పోలీసులను హత్య చేశారని తెలిపాయి. సైనికుల పేర్లను ఉగ్రవాదులకు చేరవేసి పక్కా ప్రణాళిక ప్రకారమే వారిని హతమార్చినట్లు ఐబీ వెల్లడించింది. ముందుగా వారిని విధుల నుంచి వైదొలగాల్సిందిగా ఉగ్రవాదులు హెచ్చరించారని అయినా కూడా జవాన్లు వారి బెదిరింపులకు లొంగకపోవడంతో కిడ్నాప్ చేసి అత్యంత కిరాతకంగా హత్యచేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో పాకిస్తాన్ నైజాం మరోసారి బహిర్గతమైంది. కాగా, పాక్ దుశ్చర్యపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెలువెత్తుతున్నాయి. పాక్ తీరుకు ఖచ్చితంగా తూటాలతోనే సమాధానం చెప్తామని ఆర్మీ ప్రకటించింది. దీంతో సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాక్ సరిహద్దులో భారత సైన్యం భారీగా సైన్యాన్ని మోహరించింది. ఈ నేపథ్యంలో పాక్‌తో జరగాల్సిన చర్చలను భారత్ రద్దు చేసుకోవడంతో పాకిస్థాన్ ప్రధాని  ఇమ్రాన్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలతో భారత్‌పై విరుచుకుపడ్డారు. భారత్ అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని.. తక్కువ స్థాయి కలిగిన వ్యక్తులు ఉన్నత స్థాయి పదవిలో ఉంటే ఇలానే ఉంటుందని మోదీపై ఇమ్రాన్ విషంగక్కారు.

English Title
Pak police behind police killing
Related News