పంత్, షమీలకు చోటు

Updated By ManamThu, 07/19/2018 - 01:13
image
  • ఇంగ్లాండ్‌తో తొలి మూడు టెస్టులకు టీమిండియా ఎంపిక  

imageలీడ్స్ (ఇంగ్లాండ్): ఇంగ్లాండ్‌తో త్వరలో ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు టీమిండియాను సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ జట్టులో రిషభ్ పంత్‌తో పాటు గత కొంత కాలంగా వ్యక్తిగత వివాదాలతో టీమిండియాకు దూరమైన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి కూడా చోటు దక్కింది. గాయపడిన వృద్ధిమాన్ సాహా స్థానంలో పంత్ జట్టులోకి వచ్చాడు. అయితే తొలి ప్రాధాన్యాత వికెట్ కీపర్‌గా దినేష్ కార్తీక్‌ను ఎంపిక చేశారు. బొటన వేలి గాయం నుంచి కోలుకుంటున్న జస్‌ప్రీత్ బుమ్రాకు కూడా జట్టులో చోటు దక్కింది.

అయితే అతను రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశముంది. కానీ బుమ్రాను తుది జట్టుకు ఎంపిక imageచేసేముందు అతను వంద శాతం ఫిట్‌నెస్‌తో ఉన్నాడో లేదో టీమ్ మేనేజ్‌మెంట్ పరీక్షిస్తుంది. ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో బుమ్రా బొటన వేలికి గాయమైన సంగతి తెలిసిందే. మరోవైపు బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో యో-యో పరీక్ష పాసైన ఫాస్ట్ బౌలర్‌కు కూడా జట్టులో చోటు దొరకడం ఆసక్తికరంగా మారింది. ఇక భువనేశ్వర్ కుమార్ విషయానికొస్తే.. వెన్ను నొప్పి గాయంతో తొలి రెండు వన్డేలకు దూరమైన భువీ మూడో వన్డేలో ఆడటంతో ఆ గాయం తిరగదోడింది. దీంతో టెస్టు సిరీస్‌లో భువీ ఆడటం అనుమానంగా మారింది. అతని ఫిట్‌నెస్ పురోగతిని టీమ్ మేనేజ్‌మెంట్ పరిశీలిస్తోంది. ‘ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో భువనేశ్వర్ వెన్ను నొప్పి గాయం తీవ్రమైంది. బీసీసీఐ వైద్య బృందం అతని పరిస్థితిని అంచనా వేస్తోంది. భువీని టెస్టు జట్టులోకి తీసుకోవాలా వద్దా అనే దానిపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటాం’ అని సెలెక్షన్ కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇండియా, ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు ఆగస్టు 1వ తేదీన ఎడ్గ్‌బాస్టన్‌లో ప్రారంభమవుతుంది. 

సపోర్ట్ స్టాఫ్ పనితీరుపై బీసీసీఐ అనుమానం
ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి, మూడో వన్డేలో భువనేశ్వర్ వెన్ను నొప్పి గాయం తీవ్రం కావడంతో టీమిండియా ఫిజియో పాట్రిక్ ఫర్హాత్, ట్రెయినర్ శంకర్ బసు పనితీరుపై బీసీసీఐ అనుమానంగా ఉంది. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఈ యూపీ పేస్ బౌలర్ వెన్ను నొప్పి గాయంతో బాధపడుతున్నాడు. అంతేకాకుండా ఇంగ్లాండ్ పర్యటనలోని అన్ని మ్యాచ్‌లను అతను ఆడలేకపోయాడు. దీంతో ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు గాను మూడు మ్యాచ్‌లకు ఎంపిక చేసిన జట్టులో భువీకి చోటు దక్కలేదు. అయితే పూర్తి ఫిట్‌గా లేకపోయినప్పటికీ మూడో వన్డేలో అతడిని ఎందుకు ఆడించారని బీసీసీఐ అధికారి ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భువీ గాయం గురించి అడిగితే ‘దయచేసి వెళ్లి రవిశాస్త్రిని అడగండి’ అని ఆ అధికారి అన్నారు. ‘భువనేశ్వర్ గాయం తీవ్రతరమైంది. మూడో వన్డేలో అతను ఆడటంతో పూర్తిగా కోలుకున్నాడని భావించాం. అతను టెస్టు సిరీస్‌కు చాలా ముఖ్చం. పూర్తిగా కోలుకోనప్పుడు వన్డేలో ఆడించాలన్నా రిస్క్ ఎందుకు తీసుకున్నారు?’ అని అధికారి ప్రశ్నించారు.

టీమ్ సెలెక్షన్‌ను సమర్థించుకున్న కోహ్లీ
ఇదిలావుంటే మూడో వన్డేకు తుది జట్టు ఎంపికను టీమిండియా కెప్టెన్ కోహ్లీ సమర్థించుకున్నాడు. వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ కప్‌కు ముందే సమతుల్యమైన జట్టును సమకూర్చుకునేందుకు చివరి వన్డేలో మార్పులు చేయాల్సి వచ్చిందన్నాడు. ‘ఇటువంటి మ్యాచ్‌లు వరల్డ్ కప్‌కు ఎలాంటి జట్టు కావాలో తెలియజేస్తాయి. ఎక్కడ బలహీనంగా ఉన్నామో, ఏ విభాగాన్ని బలోపేతం చేసుకోవాలో కూడా ఇలాంటి మ్యాచ్‌ల వల్ల తెలుస్తుంది. సమతుల్యమైన జట్టు మాకు అవసరం. వరల్డ్ కప్‌కు ముందే దాన్ని మేము సమకూ ర్చుకోవాలి. ఒక్క విభాగం మీదనే ఆధా రపడలేం. అన్ని విభాగాల్లో రాణించాలి’ అని కోహ్లీ వివరణ ఇచ్చాడు.

English Title
Panth, shamy place
Related News