నారా లోకేశ్ అవినీతికి అవధుల్లేవ్!: పవన్

Updated By ManamWed, 03/14/2018 - 21:09
Pawan Kalyan Sensational Comments On Nara Lokesh Corruption

pawan on nara lokesh corruption

అమరావతి: 2014 ఎన్నికల నుంచి నేటి వరకూ చంద్రబాబు ప్రభుత్వాన్ని పలెత్తి మాట అనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవిర్భావ దినోత్సవ సభా వేదికగా తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. అసలు ఇన్నాళ్లుగా పవన్‌‌లో ఇంత ఆగ్రహం దాగుందా.. ! అన్నంతగా ఆయన అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు ఆశ్చర్యపోయేంతగా ప్రసంగించారు. బాబు సర్కార్‌పై, మంత్రి నారా లోకేశ్‌పై పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును, ఆయన ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనని పవన్‌ కల్యాణ్‌.. తాజాగా పార్టీ ఆవిర్భావ సభలో ధ్వజమెత్తడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని.. మరోవైపు కేంద్రప్రభుత్వాన్ని... ఇంకోవైపు వైసీపీ తీరును ఎండగడుతూ పవన్ చేసిన ప్రసంగం జాతీయస్థాయిలో పవన్‌పై చర్చించుకుంటున్నారని వినికిడి.

మీ అబ్బాయి అవినీతి మీ ద‌ృష్టికి వచ్చిందా లేదా..?
" మీ అబ్బాయి (మంత్రి నారా లోకేష్) చేస్తున్న అవినీతి మీకు తెలుసా..లేదా? లేకుంటే మీకు తెలిసే చేయిస్తున్నారా? అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. నాకు వ్యక్తిగతంగా మీ మీద గౌరవం ఉంది. ఇటీవల అమరావతికి వచ్చినప్పుడు ఏపీలో అవినీతి పెద్దఎత్తున ఉందని చంద్రబాబు దృష్టికి తెచ్చాను. విడిపోయిన తర్వాత నంబర్ వన్ అవినీతి రాష్ట్రంగా తయారైంది. ఇదేనా మనం సాధించింది.. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి.  మీరు దోపిడీ చేస్తావుంటే చూస్తూ ఉండటానికా 2014లో మీకు సపోర్ట్ చేసింది..?. పాలించడానికి పెట్టి పుట్టాలా..?. అదేమైనా ప్రత్యేకమైన కళా?. మీ అనుభవం రాష్ట్రానికి కావాలని చెప్పి 2014లో అధికారం ఇచ్చాం. మీకు అండగా నిలబడ్డాం. లోకేశ్ కరెప్షన్‌కు అవధుల్లేవ్.. ఆయన అవినీతిని చూసి ఎన్టీఆర్, టంగుటూరి ఆత్మ క్షోభిస్తుంది. ఎన్టీఆర్ లాంటి మహానుభావుడి మనవళ్లు ఏం చేస్తున్నారు..?. టీడీపీ ఇలా అయిపోవడం చాలా బాధగా ఉంది" అని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబుకు ప్రభుత్వంపై పట్టులేదా..!
ఏపీలో జరుగుతున్న అవినీతిని బట్టి చూస్తే.. ముఖ్యమంత్రిగారికి ప్రభుత్వ యంత్రాంగం.. పార్టీపైన పట్టులేదా?. లేకుంటే.. మీకు తెలిసే ఇదంతా జరుగుతోందా? ఇది రెండు రాష్ట్రాలకు శ్రేయస్సు.. శ్రేయస్కారం కాదు. అలాంటప్పుడు ప్రజలు సరికొత్త నాయకుడ్ని.. సరికొత్త పార్టీని 2019లో ఖచ్చితంగా ఎన్నుకోని తీరుతారు. 2019 ఎన్నికలు.. 2014 ఎన్నికలంత సుఖంగా ఉండవ్.. కచ్చితంగా ఉండవ్. అమరావతిలో రైతులను మొదలుకుని మీరు ఏ ఒక్కర్నీ సంతృప్తి పరచలేదు. రైతుల నుంచి భూమలు తీసుకున్నారు.. వారికి మీరిచ్చిన మాట మీద నిలబడతారా? లేకుంటే మీరిచ్చిన సర్టిఫికెట్స్ అన్నీ చెల్లని కాగితాల్లాగా తయారవుతాయా? అనే భయాన్ని రైతుల నా దగ్గర వెల్లడి చేశారు. మీ అవినీతి చూసి ప్రజలకు అంత భయముంది" అని పవన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

అంత డబ్బులెక్కడ్నుంచి వస్తున్నాయ్! 
2019లో పవన్ కల్యాణ్ మాతో కలిసి ఉంటారో, లేదో తెలియదు. జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలి..? అందుకని మేం ఇప్పడు కరెప్షన్ చేసుకుంటామని వాళ్లు బాహాటంగానే మాట్లాడుతుంటే అంతకుమించిన బరితెగింపు ఏమీ ఉండదు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులు. మీ హెరిటేజ్ మిల్క్ ఫ్యాక్టరీ నుంచి అయితే డబ్బులు తీయడం లేదు కదా..?. మీ ఆస్తులు ఖర్చు పెట్టుకోవడం లేదు కదా..?. మరి ఎక్కడ నుంచి వస్తున్నాయి డబ్బులు. తెలుగుదేశం పార్టీ నాయకులు  2019 ఎన్నికలకి, ప్రతీ నియోజకవర్గానికి రూ. 25 కోట్లు ఆల్‌రెడీ మేం పెట్టేశాం. అన్నీ సర్దేశాం. దానిని ఎక్కడ పెట్టాలో పెట్టేశామని బాహాటంగా, నిసిగ్గుగా మాట్లాడుతుంటే.. ప్రజా స్వామ్యాన్ని పరిహసిస్తున్నారు. మీరు చేసే పనులు చూస్తుంటే టంగుటూరి ప్రకాశం పంతులు ఆత్మ ఘోషిస్తుంది.. ఎన్టీఆర్ ఆత్మ పడే క్షోభ మాములు క్షోభ కాదు’’ అని పవన్ అన్నారు.

English Title
Pawan Kalyan Sensational Comments On Nara Lokesh Corruption In AP
Related News