ఒంపుల కెంపులు!

Updated By ManamSat, 03/17/2018 - 08:01
image

imageరత్నాలు, వజ్రాల కోసం రాజ్యాలను కోల్పోయిన రాజులు చాలా మంది ఉన్నారు. సహజ కాంతిని నలుమూలలకూ ప్రసరింపజేసి, ఒంటిమీద ధరించగానే శరీరానికో ప్రత్యేక వెలుగునిచ్చే ఈ మేలిరకపు ఆభరణాలు వేల సంవత్సరాల నుంచే నానుడిలోకి, వాడుకలోకి వచ్చాయి. రాచరికపు ఆనవాళ్లగా మిగిలిపోయాయి. ఆభరణాల్లో ఇప్పటికీ వజ్రాలే అత్యంత మేలిమివని  చెప్పుకునేందుకు ఆధారాలు కనిపిస్తున్నా, రెండో స్థానం మాత్రం కెంపులదే. ఆడవారి నవ్వును కెంపులతో పోలుస్తారు. ప్రపంచ చరిత్రలో కెంపులదెప్పుడూ సమున్నతమైన స్థానమే. కెంపులను ఇంగ్లీషులో రూబీలంటారు. ఇవి రెండువేల ఐదొందల సంవత్సరాల క్రితమే పుట్టాయని చరిత్ర  చెబుతోంది. నవరత్నాల్లో నేనూ ఒకదాన్నంటూ ఎప్పటికీ వెలుగుతూనే ఉన్న కెంపులను ఎన్నో దేశాల మహారాజులు తమ కిరీటాల్లోనూ, ప్రియురాళ్లకు ప్రేమకానుకగా ఇచ్చే ఉంగరాల్లోనూ వాడేవారు. 

వీటి జన్మస్థలం చాలామందికి బర్మా (మయన్మార్) అని మాత్రమే తెలుసుగానీ శ్రీలంక, ఆఫ్రికాలు కూడా అని చాలా తక్కువ మందికి తెలుసు. బర్మాలో ఎక్కువగా దొరుకుతాయనీ, అయితే అవి అంత కాంతివంతంగా వుండవనీ ఓ వాదన కూడా ఉంది. స్వచ్ఛమైన కెంపులు శ్రీలంకలో మాత్రమే దొరుకుతాయని అంటారు. ఇక దక్షిణాసియాలో వీటి స్థావరాలు బాగా ఉన్నాయంటారు. సైబీరియన్ రూబీ, అమెరికన్ రూబీ, కేప్ రూబీ, మోంటానా రూబీ, రాక్ మౌంటెన్ రూబీలను అసలైన కెంపులుగా చెప్పుకోవాలి. కెంపుల్లో స్వచ్ఛమైన వాటిని గుర్తించేందుకు వాటి గూర్చి కొద్దిగా తెలుసుకుని ఉండడం మంచిది. పూర్తిగా ధరించే స్థాయికొచ్చిన కెంపులు గొప్ప కాంతిని వెదజల్లుతూ ఉంటాయి. అందులోనూ నక్షత్రాకారపు కాంతిని ప్రసరింపచేయడంలో కెంపులకు మరేవీ సాటిరావు. నునుపైన వాటి ఉపరితలంపై మన చేయి తగిలితే మన వేళ్ల నీడ ఆ కాంతిలో స్పష్టంగా కన్పిస్తుంది. అందుకే ఎక్కువ నునుపుగా ఉండి కాంతినిచ్చే కెంపులే అసలైనవని తెలుసుకోవచ్చు.
   

కెంపు అనగానే చాలామంది ఎరుపురంగు కెంపునే గుర్తు పట్టేస్తారు. మిలమిలా మెరిసే ఈ ఎర్రటి కెంపులు బంగారంలో ఒదిగితేimage పాలూ నీళ్లలా కలిసి పోతాయనేది ప్రతీతి. ముదురు ఎరుపు రంగు కెంపులు స్వచ్ఛమైనవిగానే ఇప్పటికీ కీర్తిని పొందుతున్నాయి. భూ పొరల్లో జరిగే మార్పుల వల్ల ఈ కెంపుల రంగుల్లో తేడాలొస్తుంటాయి. నూరు డిగ్రీల కంటే ఎక్కువ మోతాదులో ఉష్ణోగ్రత చర్యలు జరిగితే ముదురు ఎరుపురంగుల కెంపులు ఏర్పడుతాయి. కాగా విపరీతమైన లావా లాంటి ఉష్ణోగ్రత చర్యలు ఏర్పడితే మాత్రం ఆకుపచ్చ కెంపులు ఏర్పడుతాయి. ఇలా నీలం, పింక్, ఆరెంజ్ రంగుల్లో కూడా కెంపులు వస్తున్నాయి. ఈ కెంపుల్లో కూడా క్యారెట్స్ ఆధారంగా ప్రమాణాల్ని చెప్పుకోవచ్చు. ఇంతవరకూ ప్రపంచంలో అత్యంత విలువైనదిగా, అందమైనదిగా చెప్పుకునే 162 క్యారెట్ల ఎడ్వర్డ్ కెంపు బ్రిటన్ మ్యూజియంలో ఉంది. దీని ఖరీదు కోట్లలోనే ఉంటుందని అంచనా. దీని తర్వాత 105 క్యారెట్ల కెంపు ప్యారిస్ మ్యూజియంలో అలరారుతోంది. చాలామంది ఇప్పుడు తిథి, నక్షత్రాల ఆధారంగా పగడం, గోమేధికం, పచ్చ, కెంపు వంటి ఆభరణాలను ధరిస్తున్నారు. ఇలా జన్మ నక్షత్రాలను బట్టి ధరించే ఆభరణాల్లో కెంపుది ఎప్పటికీ అగ్రస్థానమే. 
   

image1987 నుంచి సింథటిక్ కెంపులు కూడా తయారు చేయడం మొదలెట్టారు. కొన్ని రసాయనాలను కలిపి ఈ కెంపులను సృష్టిస్తారు. కానీ ఒరిజినల్ కెంపులకు ఎప్పటికీ ఇవి సాటిరావు. ఒరిజనల్ కెంపుల తయారీకి ఎన్నో జాగ్రత్తలుంటాయి. వంద టన్నుల ముడి పదార్ధాన్ని తీస్తే కనీసం రెండొందల యాభై గ్రాముల బరువుండే కెంపులు దొరకడం అతికష్టం. ఒక్కోసారి అవి కూడా లభించక పోవచ్చు. ఇలా ముడి పదార్ధంగా వచ్చిన కెంపురాయిని ప్రాసెసింగ్ యూనిట్లకు పంపిస్తారు. దాన్ని మొదట కొన్ని రసాయనాల్లో వేడి చేసి సున్నితంగా తీర్చిదిద్దుతారు. అలా తయారైన ఈ కెంపురాయి కటింగ్ మిషన్లకు వెళుతుంది. ఆకారాన్ని బట్టి, సైజునిబట్టి కటింగ్ చేసే పరికరాలుంటాయి. తరువాత కటింగ్ యూనిట్ల నుంచి ఫినిషింగ్ యూనిట్ల కెళతాయి. అక్కడే కెంపులు ఒక ఆకారానికి వస్తాయి. ఇలా వజ్రాలు, కెంపుల ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. 
   

కెంపులను ప్రత్యేకంగా సంరక్షించుకునే పద్ధతులేమీ లేవు కానీ బంగారు నగలను భద్రపరచుకున్నట్లే కెంపులను కూడా భద్రపరచుకోవాలి. దాదాపుగా శుభ్రపరచడమూ బంగారంలాగానే. అయితే వీటిని కిందపడకుండా చూసుకోవడం మంచిది. స్త్రీలు మనసారా ప్రేమించే వాటిలో వజ్రం తర్వాత స్థానం కెంపులదే. మెరిసే ముదురు రంగు కెంపును నెక్లెస్‌లో అమర్చుకుంటే అందానికి ఆమే చిహ్నమనిపిస్తుంది. వేల సంవత్సరాలు గడిచినా కెంపుల ఒంపులు, మెరుపులూ ఇప్పటికీ తగ్గలేదు. అంతెందుకు కెంపుల వెలుగులు, సొగసులు మగువల మనసులకే తెలుసు! 
సువర్ణ

English Title
Pearls,Gems, diamonds
Related News