టమోటా రైస్‌లో పురుగుమందు!

tomato rice
  • అందుకే కర్ణాటకలో 11 మంది మరణం

  • ఘటనలో ఇద్దరు అనుమానితుల అరెస్టు

  • బాధితులకు సీఎం, మంత్రుల పరామర్శ

  • మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం

  • ఇరు వర్గాల గొడవతోనే ప్రసాదంలో విషం

  • బెంగళూరు.. మైసూరులో బాధితులకు చికిత్స

బెంగళూరు: కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో ఆలయంలో ప్రసాదం తిని 11 మంది భక్తులు మరణించి, మరో 90 మంది ఆసుపత్రి పాలైన ఘటనలో సంచలన వాస్తవాలు బయటపడుతున్నాయి. భక్తులు ప్రసాదంగా తిన్న టమోటా రైస్‌లో పురుగుల మందు కలిసిందని అంటున్నారు. ఈ ఘటనలో ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసినట్లు రాష్ట్ర మంత్రి ఒకరు తెలిపారు. కుచు మరండ ఆలయంలో ఈ ప్రసాదం తిన్న తర్వాత భక్తులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. 11 మంది మరణించగా వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తమకు టమోటా రైస్, సుగంధనీళ్లు ఇచ్చారని ఓ భక్తుడు చెప్పారు. భక్తులు బయట పారేసిన ప్రసాదం తిని చాలా కాకులు కూడా చనిపోయాయి. ఈ కేసులో మరో ఐదుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చామరాజనగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పుట్టరంగ శెట్టి వెళ్లి వారిని పరామర్శించారు. రెండు వర్గాల మధ్య గొడవే ఇలా ప్రసాదంలో పురుగుమందు కలపడానికి కారణంగా తెలుస్తోందని ఆయన అన్నారు. దోషులు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తప్పవని, పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అరెస్టుచేశారని తెలిపారు. ఎక్కువ మందికి వాంతులు, డయేరియా, శ్వాసకోశ సమస్యలు రావడంతో వారికి చికిత్సలు అందుతున్నాయి. చాలామందికి వెంటిలేటర్ అసవరం కావడంతో, ఆసుపత్రిలో సమయానికి తగినన్ని వెంటిలేటర్లు సమకూర్చడం పెద్ద సవాలుగా మారింది. దాంతో మైసూరులో ఉన్న పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు రోగులను తరలించారు. 47 మందికి బెంగళూరులోని కేర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు మంత్రి చెప్పారు. 17 మంఇని మైసూరులోని జేఎస్‌ఎస్ ఆసుపత్రిలో చేర్చామన్నారు. మిగిలినవారిని మైసూరులోని వివిధ ఆసుపత్రులకు పంపామని తెలిపారు. చామరాజనగర్ నుంచి మైసూరుకు 91 మంది రోగులను తరలించినట్లు వివరించారు. ఆసుపత్రులో చికిత్స పొందుతున్న బాధితులను ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా బాధితులను పరామర్శించారు. ఆలయ శంకుస్థాపన సందర్భంగా ప్రసాదం పంచారని పోలీసులు తెలిపారు. విషపదార్థం ఒక పురుగుమందు అయి ఉండొచ్చని వైద్యులు అంటున్నారని, పూర్తి పరీక్షల తర్వాత కచ్చితంగా అదేంటన్నది తెలుస్తుందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. 

సంబంధిత వార్తలు