‘తాత్త్విక కవన దుఃఖ శిఖరం ‘ఎవరి దుఃఖమో అది’ 

Updated By ManamMon, 09/24/2018 - 01:03
evari  dhukka

evari dhukkomo
ఆచార్య ఎన్. గోపి ప్రఖ్యాత కవియే కాదు. అంతేకాకుండా పరిశోధనా ప్రమాణాలున్న కవితా పరిశోధకులు. తన కవన యానాన్ని వివిధ భారతీయ, అంతర్జాతీయ భాషల్లోకి తెచ్చిన సీనియర్ కవి. ముఖ్యంగా ఆయనది సాదాసీదా కవితా శైలి. ఇక్కడి భౌగోళిక వాతావరణాన్ని కవితా దృశ్యాల్లో కొట్టొచ్చినట్లు కనబడుతుంది. సరళత, స్పష్టతా, అనుభవాల అనుభూతి అక్షరాల్లో ప్రతి పంక్తికి కొత్త సొగసులు సంతరించుకొంది గోపి కవితాక్షరం. 
ఆయన తంగేడు పూలతో ప్రారంభైమె, వైులురాయి, చిత్రదీపాలు, ఎండపొడ, మావూరు మహాకావ్యం, వంతెన, కాలాన్ని నిద్రపోనివ్వను, నానీల నాన్నగా కొత్తగా నానీలను సృష్టించిన సృష్టికర్తగా, చుట్టకుదురు, గోపీ నానీలు, జలగీతం, మరో ఆకాశం, అక్షరాల్లో దగ్ధమై, దీపం ఒక ఏకాంతం, గోవాలో సముద్రం, వానకడిగిన చీకటి, రాతికెరటాలు, హృదయురశ్మి, మళ్ళీ విత్తనంలోకి, పురివిప్పిన ఊపిరి, ఆకాశంలో మట్టి, జీవన భాష, మళ్ళీ యిప్పుడు ‘ఎవరి దుఃఖమో అది’. ఒకనాటి సాదాసీదా కవితారచనే మరో సందర్భంలో లోతైన భావుకతకు వేదికయ్యింది. డాక్టర్ ఎన్.గోపి ‘ఎవరి దుఃఖమో అది’లో అంతర్‌ధ్వనిస్తున్నట్లు అన్పిస్తుంది. ఈ విశ్వకవి సమ్మేళనంలో ఒకచోట గోపి అంటారు. ఎవరి జీవితాన్ని / ప్రేమించటం నేర్పలేదు / ధర్మాగ్రహం చల్లారి పోకుండా / ఎవరూ వేడిని ప్రసారం చెయ్యలేదు / రాజకీయ వ్యవస్థలను చీల్చి / చూడగలిగే నేత్రాలను / ఎవరూ ప్రదానం చెయ్యలేదు. అందుకే జీవితాన్ని ప్రేమించటం కంటే ఘనమైనదేదీ లేదంటారు కవి గోపి. పూర్వాలంకారికుల్లో ఒకరైన జగన్నాధుడు వాక్యం రసాత్మకంగా మహాకావ్యంగా తెలుపుతాడు. రసార్ణవం కళ్ళముందు కాంతిసూర్యులను చీకటి తొలగించడానికి ఆవిర్భవించడానికి ఆస్వాదనీయంగా భావించాడు. 

రక్తం ఖండికతో ఒక గొప్ప సందేశాత్మకతను ఒక జీవన వ్యాఖ్యానుభూతులను పంచిన కవిత ఖండిక ఇది. గీతా, ఖురాన్ బైబిల్ / అన్నీ రక్తంలోంచే పరిణమిస్తాయి / ఇంతకు రక్తమంటే ఏమిటి? అనే ప్రశ్న వేస్తారు. ఈ ఖండికొక తాత్త్వికతను, వైద్య పరిభాషలోని జీవన రసాయానికతను దాని చర్యలను, రక్తం చేసే పనేమిటో దాని సామాజిక మమకార మానవీయ సొగసులద్ది అమోఘమైన భావావిష్కరణను గావిస్తారు కవి గోపి. అదొక సృష్టి సంగీతం / దాని ధ్వనించని అంశం లేదు / రక్తం ఒక కన్నీటి ముత్యం.... అమ్మపాల కెమిస్ట్రీని విశ్లేషిస్తే / అది మవుతాసిక్త / రక్తమహా కావ్యమౌతుందంటారు. రక్తం నడుస్తుంది / రక్తం ఏడుస్తుంది / రక్తం దేన్నైనా జయిస్తుంది / నదుల రక్తనాళాలతో / లోకం వెలుగుతుంది/. ‘రక్తం సంబంధాలను / ఏ రాక్షసులు ఛిద్రం చేస్తున్నారు / రక్తం బాగా పోయిందంటారు / రోడ్డుపైన రక్తం వొలికిపోతే / ప్రాణం విఫలమౌతుంది అని తెలుసుకోరు. 


‘రక్తం ఒక సంశ్లిష్ట భావన / రక్తం ప్రాణకోటికి లభించిన దీవెన / విచిత్రమైన అల్లిక రక్తం / అఖండంగా వెలిగే జ్వాలిక అంటూ రక్తం సమ్మిశ్రితంను అంతర్గతశక్తిగా, నడవడం, ఏడవడం, దేన్నైనాజయించే శక్తి ఉందని ఒక మాటలో చెప్పాలంటే రక్తం అనేక పదార్థాల అల్లికతో నిర్మితమైన జీవశక్తిగా, ప్రాణశక్తిగా రక్తమే సృష్టి చలన సంగీతమైందని రక్తంలో ధ్వనించని రాగస్వరమే లేదని, రక్తాన్ని కన్నీటి ముత్యంగా, సమాజ సంబంధాల ఆధారాన్ని చిద్రంచేసే రాక్షసులనూ ఖండిస్తారు. ఏదీఏమైనా ఈ ఖండికను ఆచార్య బహుముఖీనమైన చూపుతో తాత్త్వికతను, జీవన సంబంధ దిక్సూచిని, దాని అంతర్గత సృష్టినిర్మితిని, ఆరోగ్యప్రదాయినిగా అనేకాంశాలతో కవనమై రక్తం ప్రాధాన్యతను ఈ ఖండికలో సామాజికత, చారిత్రక, జీవరసాయానిక వాస్తవికతను దాని ఆవశ్యకతను లోతైన భావుకతా శిల్పంతో ఆవిష్కరించి ఆలోచింపజేసే అఖండ వెలుగు జ్వాలికగా ఒక మెరుపు వాక్యంతో పాఠకునికి చెబుతారు కవి గోపి. 

కవి గోపి కవిత్వంలో దుఃఖం శోకంలో కవన హైదరాబాద్‌గా వొడవి దుఃఖాన్ని ఉబుకుతుందని పల్లెలు ఖాళీ అయి నిత్య పరుగుల ప్రపంచంలో వేగంగా ఉక్కిరిబిక్కిరిగా ఊపిరిసల్పనంతగా హైదరాబాద్ దృశ్యంగా ఇంకా నగరంలో అదృశ్య జీవితంతో మానవ సంబంధాలనే విషయాన్ని ఎవ్వరూ ఎవరికి ఏమీ కారు. ఒకరి గురించి మరొకరు పట్టించుకోని అనాథ యాక్సిడెంట్‌ంలా స్థితి ఎడతెరపిలేని వర్షం కుటుంబ దుఃఖంలా ఉంటుందని, సమాజంలోని ఆవేద విషాదాన్ని తన కలం ప్రవాహంలో జాలువారిపోతుందని నిరంతర కవిగా ఆచార్యనిగా అనేకాంశాలను నిత్యం తారసపడే ప్రతివస్తువు కవిత పరుసవేదిని రంగరించి కళాత్మక సృజనాత్మకతను కలిపి నూతన దృశ్యాలెన్నో ఈ సంపుటిలో ఉన్నాయి. చిన్న చిన్న అంశాలను కవితామయం చేసే కవి రోడ్డు, సబ్బు, స్వెట్టర్, గోడ, ప్లాట్‌ఫారం, ఇత్తడి చెంబు, పాతచెప్పులు, రెయిన్‌కోటు తదితర కవితలు డాక్టర్ గోపి కవిత్వంలోని గుండెలోని ఆలోచనాత్మకంగా ఆరాటనాత్మకంగా ఆచరణాత్మక భావావిష్కరణగావిస్తారు. తరంతరాల మధ్య సంభాషణే కవిత్వం. మట్టికీ మనిషికీ అద్వైతభావమే ప్రకృతి ఒక వచనం కాదు దానిని మేల్కొల్పడమే కవిత్వమంటారు. ఇట్లా ఈ సంపుటిలో ఆచార్య గోపి ప్రపంచ దుఃఖంపట్ల సహానుభూతిని ప్రకటిస్తూ తాత్త్విక శిఖర సమానతను సాధిస్తూ కారుణ్యాంశాన్ని ప్రతి ఖండికలో ప్రవచనాల్లా సూక్తుల్లా రచిస్తూ అందరి దుఃఖలోకాన్ని తను స్పందిస్తూ పలికిస్తూ అందరి హృదయ సంభాషణ చేస్తూ, కరుణామూర్తి అనేక ఖండికల్లో తత్త్వగీతాలు రాస్తున్న సీనియర్ కవి గోపి కలం నిరంతర కవితా పరుసవేదికి మూలధనం. 
 సి.హెచ్.ఆంజనేయులు
7702537453

English Title
The 'philosophical tumultuous peak' whose mourning is'
Related News