విశ్వోద్భవ విజ్ఞాన వైతాళికుడు

Updated By ManamWed, 03/14/2018 - 22:19
stephen hawking

ఒక తార రాలిపోయింది. ఒక మహా మేధ ఆగిపోయింది. స్టీఫెన్ హాకింగ్‌ని చావు మింగేసింది. ఆయన ఇంగ్లండు పౌరుడే అయినా ప్రపంచమంతా గుర్తుపట్టగలిగిన శాస్త్రవేత్త. మొత్తం మానవాళి తన ప్రతినిధిగా చెప్పుకోగలగిన విశ్వమానవుడు. చనిపోయేనాటికి ఆయన వయస్సు 76. తాను 75 ఏళ్లపాటు బతికివుంటానని అనుకోలేదని గత ఏడాది ఓ సందర్భంలో హాకింగ్ అన్నాడు. ఎందుకంటే 21వ ఏటనే ఆయనకు పెద్ద జబ్బు (motor nuerone disease). అతడు మరో రెండు సంవత్సరాలు మాత్రమే బతుకుతాడని డాక్టర్లు చెప్పారు. అప్పుడతనికి అది ఒక పెద్ద షాక్. కాని తర్వాత క్రమంగా ఆయన ఆ జబ్బు గురించి ఆలోచించడమూ, బాధపడడమూ మానేశాడు. ‘నాకు వచ్చిన అఔఖి జబ్బు గురించి నేను ఏమనుకుంటున్నాను అని తరచుగా నన్ను అడుగుతూ ఉంటారు. పెద్దగా అనుకునేది ఏమీలేదు. సాధ్యమైనంత వరకూ మామూలు జీవితాన్ని గడపడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. నేను నా పరిస్థితి గురించి ఆలోచించను. జబ్బు వల్ల నేను చేయలేని పనుల గురించి బాధపడుతూ కూర్చోను. నిజానికి అటువంటి పనులు ఎక్కువవేమీ లేవు కూడా’ అని ‘కాల బిలాలూ పిల్ల విశ్వాలూ’ అన్న తన పుస్తకంలో ఆయన రాశాడు.   

ఆయన ఆక్స్‌ఫర్డ్‌లో పుట్టి కేంబ్రిడ్జ్‌లో చనిపోయాడు. ఇంగ్లండులో అత్యంత సుప్రసిద్ధమైన రెండు విశ్వ విద్యాల యాలున్న నగరాలవి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనే నానుడి హాకింగ్‌కి బొత్తిగా వర్తించదు. ఆయన తొలినాటి అధ్యయనం అంత ఘనంగా ఏమీ సాగలేదు. ‘నాకు ఎనిమిదో ఏడు వచ్చేదాకా చదవడం రాదు. మా చెల్లెలు ఫిలిప్పా ... నాలుగో ఏటే చదవగలిగేది. ఆమె నా కంటే తెలివైంది’ అంటాడు హాకింగ్. 

కాని క్రమంగా హాకింగ్ తన పరిశోధనలో పూర్తిగా నిమగ్నమై పనిచేశాడు. ఖగోళశాస్త్రంలో గొప్ప దార్శనికుడైన శాస్త్రవేత్తగా ఎదిగాడు. ఆయన దృఢ సంకల్పానికీ, ప్రజ్ఞకీ మారుపేరుగా నిలిచాడు. విశేషమేమంటే, అంత కష్టంలోనూ ఆయన ఏనాడూ ధైర్యం కోల్పోలేదు. తన హాస్య చతురతనీ పోగొట్టుకోలేదు. ఆయన ఆవిష్కరణలు అన్నిటిలోనూ విలువై నదేది అంటే కాలబిలాలు మరీ అంత కారు నలుపేమీ కాదు అన్న తన సైద్ధాంతిక ప్రతిపాదన విలువైంది అంటాడాయన. కాలబిలాల పరిధి దాటి లోపలి నుంచి బయటికీ, బయటి నుంచి లోపలికీ కాంతి కిరణాలు గానీ మరేవీగానీ  ప్రసరించవు అన్నదానికి మినహాయింపులు ఉన్నాయనీ కాలబిలాలు రేడి యేషన్‌ని బయటకు వదులుతాయనీ ఆయన సూత్రీకరణ. ఐన్‌స్టయిన్ సామాన్య సాపేక్ష సిద్ధాంతం ప్రకారం విశ్వం బిగ్ బాంగ్‌తో మొదలై బ్లాక్ హోల్‌గా అంతమౌతుంది అంటాడు హాకింగ్.  

చాలామంది భౌతికశాస్త్రవేత్తల్లాగానే హాకింగ్ కూడా నాస్తికుడు. ఆయన దేవుడినీ, స్వర్గనరకాలనూ నమ్మడు. బహుశా ఆయన శాస్త్రీయ ఆలోచనా విధానం వల్ల ఈ నిర్ధా రణకు వచ్చి ఉండొచ్చు. లేదా కొంత ఆయన తల్లి ద్వారానూ సంక్రమించి ఉండొచ్చు. తల్లి ఇసోబెల్ మెడికల్ రీసెర్చి సెక్రటరీగా పనిచేసింది. ఆమె కామ్సొమాల్ (కమ్యూనిస్టు యువజన సంఘం) సభ్యురాలు. హాకింగ్ తండ్రి ఫ్రాంక్ హాకింగ్ వైద్యుడు. తన మీదా, తన జబ్బు మీదా జోకులు వేసుకొన్నట్టుగానే దేవుడి మీదా జోకులు వేయడం స్టీఫెన్ హాకింగ్‌కి అలవాటు. 

ఇరవయ్యవ శతాబ్దంలో అతి గొప్ప ఆవిష్కరణలు రెండు : ఒకటి- సామాన్య సాపేక్ష సిద్ధాంతం. రెండోది- క్వాంటమ్ సిద్ధాంతం. కొన్ని విషయాల్లో ఈ రెంటి మధ్యా వైరుధ్యా లున్నాయి. వాటిని అర్థం చేసుకోవడానికీ, విశదీకరించడానికీ హాకింగ్ ఎంతో కృషి చేశాడు. విశ్వాన్ని అర్ధం చేసుకోవడమే తన పరమావధి అంటాడు హాకింగ్. 

ఐసాక్ న్యూటన్‌ను గాని మార్లిన్ మన్రో(హాలీవుడ్ తార)ను కాని ఎవరో ఒకరిని కలవడానికి అవకాశం వస్తే ఎవరిని కలుస్తారు? అని అడిగితే ‘మార్లిన్‌నే కలుస్తా’ అని సమాధానం చెప్పాడు, ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్త హాకింగ్ నవ్వుతూ. హాకింగ్ సంగీత ప్రియుడు. ‘నీకు సంగీతం ఎక్కువ ఆనందం ఇస్తుందా, సైన్సు ఎక్కువ ఆనందం ఇస్తుందా’ అని అడిగితే ఆయన చక్కటి సమాధానం చెప్పాడు. ‘అంతా సజావుగా జరిగితే భౌతిక శాస్త్రంలో లభించే ఆనందం చాలా గాఢంగా ఉంటుంది. సంగీతంలో కన్నా ఎంతో గాఢంగా ఉంటుంది. అయితే భౌతికశాస్త్రంలో అంతా సజావుగా మనం అనుకున్నట్టుగా జరగడం అన్నది చాలా అరుదైన విషయం. సంగీతం అలా కాదు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక  రికార్డును ఆశ్రయించవచ్చు’ అన్నాడు. ఆయన మొదటి భార్య జేన్ హాకింగ్ రాసిన పుస్తకం ఆధారంగా ఆయన జీవితాన్ని సినిమాగా తీశారు. దానికి ఆస్కార్ అవార్డులు వచ్చాయి. 

ఆయన ప్రపంచానికి పరిచయమవడానికి ముందు శాస్త్ర వేత్త కాదు. అ ఆటజ్ఛీజ ఏజీటౌ్టటడ ౌజ ఖీజీఝ్ఛ అనే ఒక పుస్తక రచయితగా ప్రపంచానికి తెలిశాడు. ఆ పుస్తకం లక్షలకొద్దీ కాపీలు అమ్ముడు పోయింది. అనేక భాషల్లోకి అనువాదమైంది. దానిని తెలుగులో మేము (పీకాక్ క్లాసిక్స్) కాలం కథ పేరుతో పేరుతో తెచ్చాం. ఈ పుస్తకం సరళమైన భాషలోనే తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఆయనదే మరో పుస్తకం ఆజ్చూఛిజు ఏౌజ్ఛూట ్చఛీ ఆ్చఛడ ్ఖజీఠ్ఛిటట్ఛటని ‘కాలబిలాలూ పిల్ల విశ్వాలూ’ అన్న పేరుతో తెచ్చాం. 

ఆయన తన పిల్లలకు మూడు సలహాలు ఇచ్చాడు : 
1. కింద పాదాలను కాదు, పైన తారలను చూడండి.

2. మనసంతా పెట్టి పనిచేయండి. పనిచేయకపోతే జీవితం డొల్లగా మారుతుంది.

3. ప్రేమ చాలా అరుదైన విషయం. అదృష్టం కొద్దీ మీకది దొరికితే దాన్ని కాపాడుకోండి.  

పిల్లలకు మాత్రమే కాదు; ఈ సలహాలు మొత్తం మానవాళికి అనుసరణీయమైన సూత్రాలు

- ఎ. గాంధి,
సంపాదకుడు, పీకాక్ క్లాసిక్స్

English Title
Pioneer of cosmology
Related News