నీరవ్‌, ఛోక్సిలపై ఇంటర్‌పోల్ వారెంట్ కోరిన ఈడీ

Updated By ManamWed, 03/14/2018 - 19:37
neerav modi

neerav modiన్యూఢిల్లీ:  వజ్రాల వ్యాపారులు నీరవ్ మోడి, మేహుల్ చోక్సిలపై రెడ్ కార్నర్ నోటీసులు (ఆర్‌సీఎన్) జారీ చేయాలంటూ.. ఇంటర్నేషనల్ పోలీస్(ఇంటర్‌పోల్)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆశ్రయించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులతో కుమ్మక్కై రూ. 12,000 కోట్లకు పైగా రుణాలు తీసుకుని, ఆపై ఎగవేసిన నీరవ్ మోడి, చోక్సిలు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారంటూ ఇప్పటికే వీరిద్దరిపై నాన్ బెయిలబుల్  అరెస్ట్ వారెంట్‌లు జారీ అయ్యాయి.  ఫ్రాన్స్‌లోని లియాన్‌లోని ఇంటర్‌పోల్ ప్రధాన కార్యాలయానికి ఈమేరకు సమాచారం చేరవేసి ఆర్‌సీఎన్ జారీ అయ్యేలా చూడాలంటూ సీబీఐకు కూడా ఈడీ విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. వాంటెడ్ వ్యక్తుల ఆచూకి కనుగొనేందుకు, వారిని అరెస్ట్ చేసేందుకు అంతర్జాతీయ నేరస్థుల అప్పగింత చట్టం ద్వారా వారిని స్వదేశానికి రప్పించేందుకు ‘రెడ్ కార్నర్ నోటీసు’ తోడ్పడుతుంది. ఒక్కసారి ఆర్‌సీఎన్ జారీ అయిందో ఇక ఇంటర్‌పోల్ రంగంలోకి దిగి, ప్రపంచంలో ఏమూలన ఉన్నా సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేసి ఆయా దేశాలకు అప్పగించి, తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సహకరిస్తుంది. ఈడీ అధికారుల అభ్యర్థనపై ఇప్పటికే మోడి, చోక్సిలపై ముంబైలోని ప్రత్యేక కోర్టు ఈనెల ఆరంభంలో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. అంతకుముందు వీరిద్దరికీ ఈడీ సమన్లుసైతం జారీచేసి, ముంబైలోని కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. అయినప్పటికీ వీరిద్దరు నిందితులు వ్యాపార పనుల కారణంగా తాము హాజరుకాలేమని అప్పట్లో పేర్కొన్నారు. కాగా సీబీఐ కూడా మోడి, చోక్సిల మనీలాండరింగ్ కుంభకోణంపై దర్యాప్తు చేస్తోంది.

English Title
PNB fraud: ED seeks Interpol warrant against Nirav Modi, Choksi
Related News