‘పోలవరం’ 57.41 శాతం పూర్తి 

Updated By ManamMon, 08/13/2018 - 23:54
ap cm
  • 86 జలాశయాల్లో 380.68 టీఎంసీల నీరు

  • చెరువులు, భూగర్భాలలో 867 టీఎంసీలు 

  • సరైన ప్రణాళికలతో సమర్థ నీటి నిర్వహణ

  • అధికారులతో సీఎం చంద్రబాబునాయడు

imageఅమరావతి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 57.41 శాతం పనులు పూర్తయ్యాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వర్షాలు పడుతున్నా పనులు అనుకున్న మేర పూర్తిచేసే ప్రయత్నం జరుగుతున్నదని ఆయన తెలిపారు. రాష్ట్రంలో వివిధ దశల్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులతో పాటు పోలవరం ప్రాజెక్టు పనులపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రధాన డ్యామ్ పనులు 44.23 శాతం, ఎడమ కాలువ పనులు 62.74 శాతం, కుడి కాలువ పనులు 90 శాతం పూర్తయ్యాయని అన్నారు.

గేలరీ వాక్ కి స్పిల్‌వే సిద్ధం అవుతోందని అధికారులు వివరించారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఇతర తవ్వకం పనులు 77 శాతం పూర్తయ్యాయని తెలియజేశారు. జెట్ గ్రౌటింగ్ పనులు 94.2 శాతం, కాంక్రీట్ పనులు 33.7 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ఇప్పటిదాకా పోలవరం ప్రాజెక్టును లక్షమంది సందర్శించినట్లు ప్రకటించారు.అన్ని జిల్లాల నుంచి ప్రాజెక్టు సందర్శనకు ప్రోత్సహించాలని, వారికి పూర్తి వివరాలు తెలియజేయాలన్నారు. పునరావాస పనులు వచ్చే డిసెంబర్‌కి పూర్తిచేయాలన్నారు. ఈ పనులకు చెల్లించే బిల్లులపై జీఎస్టీ గురించి కూడా చీఫ్ ఇంజనీర్ల బోర్డు సమావేశం అవుతోందన్నారు. ఈ అంశాలను కూడా త్వరలోనే పరిష్కారం అవుతాయని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ వనరుల కింద అందుబాటులో ఉన్న జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో అధికారులు వ్యూహాలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

మొత్తం రెండు కోట్ల ఎకరాలకు నీరందించాలన్నారు. ఇందుకోసం భూగర్భ జలాలు, జలాశయాలు, చెరువులలో ఉన్న నీటిని సమర్థ నిర్వహణ చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.  వర్షాభావ పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో అధిక శ్రద్ధ పెట్టాలని చంద్రబాబు సూచించారు. మొత్తం రాష్ట్రంలో 86 జలాశయాల్లో 380.68 టీఎంసీ నీరు అందుబాటులో ఉందన్నారు. మిగిలిన చెరువులు, భూగర్భ జలాలు ఇతర వనరులు చూస్తే మొత్తం 867 టీఎంసీలు అందుబాటులో ఉందని ముఖ్యమంత్రి వివరించారు. రెండు కోట్ల ఎకరాలకు నీరు, తాగునీరు, పరిశ్రమలకు నీరు ఇవ్వడానికి ఎలా నీరు వినియోగించాలన్న అంశంపై  పరిశీలించాలన్నారు. మొత్తం వివిధ దశల్లో ఉన్న 25 సాగునీటి ప్రాజెక్టులను డిసెంబర్ కల్లా పూర్తిచేసే లక్ష్యంతో పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కాగా, 37,546 చిన్న తరహా సాగునీటి చెరువులు ఉన్నాయి, 10 లక్షల పంట కుంటలు నిర్మిస్తున్నాం, చెక్ డ్యామ్‌లు నిర్మించి అన్ని చెరువుల్లో నీటిని నిల్వ చేయాలన్నారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, సీఎం ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్ పాల్గొన్నారు. 

English Title
'Polavaram' completed 57.41%
Related News