ఇక రాజకీయం..

Updated By ManamSun, 09/02/2018 - 06:00
ntr
  • త్వరలో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ!.. పొలిట్‌బ్యూరో సభ్యత్వం ఇచ్చే చాన్స్

  • నందమూరి వారసుడిగా ఆరంగేట్రం.. ఎన్టీఆర్ క్రేజ్ కోసం టీడీపీ ప్రయత్నం

  • తారక్ జోరుతో పవన్‌కు చెక్ పడేనా.. ఆసక్తిగా మారనున్న జూనియర్ నిర్ణయం

అమరావతి: నందమూరి హరికృష్ణ మరణంతో ఖాళీ అయిన టీడీపీ పొలిట్‌బ్యూరో పదవిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరికిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. హరికృష్ణ వారసుల్లో కల్యాణ్‌రామ్‌కు లేదా జూనియర్ ఎన్‌టీఆర్‌లలో ఒకరికి ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. పెద్ద కొడుకు కల్యాణ్‌రామ్‌కు పొలిట్‌బ్యూరో పదవి ఇవ్వడం సమంజసమే అయినా.. జనంలో బాగా క్రేజ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్‌కు ఇస్తే ప్రయోజనంగా ఉంటుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. బావ, బావమరుదులైన చంద్రబాబు, హరికృష్ణ మధ్య అవినాభావ సంబంధం ఉందని అటు పార్టీలోనూ, ఇటు వారి కుటుంబాల్లోనూ చెప్పుకుంటారు.

image


చంద్రబాబుకు ముందు నుంచి వెన్నుదన్నుగా హరికృష్ణ నిలబడ్డారు. మొదటిసారి చంద్రబాబు సీఎం అవ్వడానికి హరికృష్ణ బాగా సహకరించారు. ఈ క్రమంలోనే హరికృష్ణకు బాబు పలు పదవులు కట్టబెట్టారు. పార్టీలో హరికృష్ణ లేని లోటును ఎన్టీఆర్‌తో పూడ్చాలని చూస్తున్నారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉమ్మడి రాష్ట్రంలో ప్రచారం చేశారు. ప్రచారం మధ్యలో ఉండగా ఆయన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభావం, దానికితోడు ప్రజారాజ్యం కూడా బరిలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి.. కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చింది. వైఎస్సార్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడిగా హరికృష్ణ పార్లమెంట్‌లో సమైక్యవాణి గట్టిగా వినిపించారు. విభజనను వ్యతిరేకిస్తూ ఆ పదవికి రాజీనామా కూడా చేశారు. టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడిగానే మరణించారు. 

హరికృష్ణ అంత్యక్రియల్లోనూ భౌతికకాయంపై చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను కప్పి పార్టీ వ్యక్తిగానే వీడ్కోలు పలికారు. అదే స్ఫూర్తితో హరికృష్ణ వారసుడ్ని పార్టీలోకి క్రీయాశీలకంగా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. 2019లో జరిగే ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికలలో ఎన్‌టీఆర్ సేవలు పార్టీకి ఎంతో లాభిస్తాయి. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చిన పవన్‌కల్యాణ్ ఇప్పుడు పార్టీకి వ్యతిరేకంగా మారారు. రానున్న ఎన్నికల్లో సినీ హీరో పవన్‌ను తట్టుకోవడానికి తమ పార్టీలోనూ హీరో ఉంటే బాగుంటుందని టీడీపీ భావిస్తున్నది. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయినా హరికృష్ణ కుటుంబం నుంచి కూడా వారసుడ్ని తీసుకువస్తే నందమూరి కుటంబమంతా టీడీపీకి అండగా ఉందనే సంకేతాలు కూడా ప్రజల్లోకి వెళతాయి.

నందమూరి వారసులను చంద్రబాబు దూరంగా పెడుతున్నారనే కొంతమంది అపోహలు సమసిపోయే అవకాశం ఉంది. ఎన్టీఆర్ క్రేజ్ కూడా పార్టీ గెలుపునకు తోడవుతుంది. అయితే ఈ అంశంపై జూనియర్ ఎన్టీఆర్ ఆలోచన, నిర్ణయం ఎలా ఉంటాయనేది తెలియాల్సి ఉంది. పదేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎన్టీఆర్ ప్రచారం చేసినా.. ఆ తర్వాత మహానాడు, తదితర పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం, అమరావతి శంకుస్థాపనకు కూడా ఎన్టీఆర్ హాజరుకాలేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పొలిట్‌బ్యూరో పదవి పొందేందుకు ఎన్టీఆర్ సమ్మతి తెలుపుతారని పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే అప్పుడే రాజకీయాలపై ఆసక్తి లేదు. కొన్నేళ్లు సినీరంగంలోనే ఉండాలనే ఆశ కూడా జూనియర్‌కు ఉన్నట్లు సమాచారం. మొత్తానికి ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి ఆయన నిర్ణయమే కీలకం కానున్నది. 

English Title
political entry..
Related News