ఒక్క ఛాన్స్ ప్లీజ్...

Updated By ManamSat, 09/22/2018 - 13:01
Political Leader Are Eagerly Waiting for party tickets

ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వివిధ పార్టీలకు చెందిన ఆశావాహులు వందల సంఖ్యలో క్యూకడుతున్నారు. అయితే అభ్యర్థులకు టికెట్లు జారీ చేసే విషయంలో ముఖ్యపాత్ర పోషించే వివిధ పార్టీలకు చెందిన జిల్లా అధ్యక్షులు సైతం టికెట్ల రేసులో ఉన్నారు. ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్, టీటీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులు టికెట్ల కోసం హోరాహోరీగా ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అయితే ఎవరికి టికెట్ లభిస్తుందనేది ఉత్కంఠగా మారింది. 
 
 

Political Leader Are Eagerly Waiting for party tickets

హైదరాబాద్ :  ప్రతిష్టాత్మకంగా మారిన ఎన్నికల ప్రక్రియ క్రమంగా ఊపందుకుంటున్నది. టీఆర్‌ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. కొన్ని స్థానాలను మినహాయించింది. ఇక టీటీడీపీ, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. అయితే ఆయా పార్టీలకు చెందిన జిల్లా అధ్యక్షులు పోటీకి సై అంటున్నారు. మహాకూటమి తరపున గెలుపు గుర్రాలను బరిలో దింపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. 

ఈ క్రమంలోనే పార్టీల అధ్యక్షులుగా పనిచేస్తున్న నేతలకు టికెట్లు కేటాయిస్తారా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.  అధ్యక్షుని హోదాలో పార్టీ అభివృద్ధి కోసం అహర్నిషలు పనిచేస్తున్న వారికి ఆయా పార్టీలు ఇంకా ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపు పట్ల స్పష్టత రాకపోవడంతో శ్రేణుల్లో ఆందోళన నెలకొన్నది.  ఎలాగైనా తమకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని గ్రేటర్ పార్టీల అధ్యక్షులు  అధిష్టానాలపై ఒత్తిడి తెస్తున్నారు.

అధ్యక్షుడి హోదాలో...   
పార్టీ గ్రేటర్ అధ్యక్షుని హోదాలో ఏళ్ల తరబడి పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ శ్రేణుల కోసం నిరంతరం పనిచేస్తున్న తమకు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా టికెట్  కేటాయించాలని వివిధ పార్టీలకు చెందిన  అధ్యక్షులు తమ పార్టీ అధిష్టానాలను కోరుతున్నారు. తమకు కేటాయించకపోతే తమ వారసులకైనా టికె ట్లు ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బలమైన టీఆర్‌ఎస్‌ను ఎదుర్కునే సత్తా తమకే ఉందని అన్ని పార్టీల అధ్యక్షులు అధిష్టానం వద్ద తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

అయితే టీఆర్‌ఎస్‌తో సహా ఏ పార్టీ కూడా ఇంత వరకు గ్రేటర్‌లో పనిచేస్తున్న అధ్యక్షులకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించకపోవడం విశేషం. అయితే టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్, టీడీపీలు, సీపీఐలు మహాకూటమిగా ఏర్పడటంతో పొత్తుల్లో భాగంగా ఏ పార్టీ అధ్యక్షునికి టికె ట్ వస్తుందో ఎవరికి టికెట్ ఊడుతుందో ప్రశ్నార్ధకంగా మారింది. ఇక ఒంటరిగా పోటీ చేయనున్న బీజేపీ, టీజేఎస్  సైతం తమ పార్టీ గ్రేటర్ అధ్యక్షులుగా పనిచేస్తున్న వారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

మల్కాజిగిరిపై మైనంపల్లి గురి..
టీఆర్‌ఎస్ గ్రేటర్ అధ్యక్షునిగా పనిచేస్తున్న ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావుకు మొదటి విడతలో ప్రకటించిన జాబితాలో ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ కేటాయించలేదు. మైనంపల్లి గత ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఇదే టీఆర్‌ఎస్ నుంచి ఎంపీగా పోటీ చేసి స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు. అయితే పార్టీ గ్రేటర్ అధ్యక్షుని హోదాలో ఆయన పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుండడంతో ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా టికెట్ వస్తుందని మైనంపల్లి వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

అయితే మైనంపల్లి మళ్లీ మల్కాజిగిరి నుంచే ఎమ్మెల్యే టికెట్‌ను ఆశిస్తున్నట్లు సమాచారం. పార్టీ అధినేత కేసీఆర్ గ్రేటర్‌లో అంబర్‌పేట, చార్మినార్, మలక్‌పేట, మేడ్చల్, ముషీరాబాద్, ఖైరతాబాద్, గోషామహల్,మల్కాజిగిరి స్థానాల్లో ఇంకా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించకపోవడంతో మైనంపల్లిని ఎక్కడి నుంచి బరిలో దింపుతారన్నది ఆసక్తికరంగా మారింది. కాగా మైనంపల్లికి మల్కాజిగిరి టికెట్ ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చర్చించుకోవడం కొసమెరుపు.

కాంగ్రెస్ నుంచి ఎవరికి?
కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్న మందడి అంజన్‌కుమార్ యాదవ్ ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తాడా లేదంటే తనయుడు అనిల్‌కుమార్ యాదవ్‌ను పోటీ చేయిస్తాడా అన్నది తేలాల్సి ఉన్నది. గతంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన అంజన్‌కుమార్‌యాదవ్‌ను ఈ సారి పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలని ఆదేశిస్తున్నట్లు సమచారం. అయితే మాత్రం సుముఖంగా లేడని పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. 

తాను గతంలో ఎంపీగా పోటీ చేసాను కాబట్టి ఈ సారి సైతం మళ్లీ ఎంపీగానే పోటీ చేస్తానని ఎమ్మెల్యే టికెట్ తన కుమారునికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే అనిల్‌కుమార్‌యాదవ్ తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగా పని చేస్తుండడంతో ఆయనకు ఖచ్చితంగా టికెట్ వస్తుందని ఆయన వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు టీడీపితో జతక ట్టిన కాంగ్రెస్ పొత్తుల్లో భాగంగా అనిల్‌కుమార్‌కు ఎక్కడి నుంచి టికెట్ కేటాయిస్తారన్నది తేలాల్సి ఉంది. 

బీజేపి నుంచి రాంచందర్‌రావు?
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గత ఎన్నికల్లో టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది. ఇందులో భాగంగా గ్రేటర్‌లో గోషామహల్, అంబర్‌పేట, ముషీరాబాద్, ఉప్పల్, ఖైరతాబాద్ స్థానాల్లో జెండా ఎగురవేసింది. అయితే ప్రస్తుతం టీడీపితో మైత్రి చెడడంతో బీజేపీ ఈ సారి ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చే స్తోంది. అయితే అన్ని స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు సూచించడడంతో తాజా మాజీ బీజేపీ ఎమ్మెల్యేలు తమకు పట్టున్న ప్రాంతాలపై కన్నేశారు. అయితే బీజేపీ గ్రేటర్ అధ్యక్షునిగా ఉన్న ఎమ్మెల్సీ రామచందర్‌రావుకు పార్టీ అధిష్టానం టికెట్ ఇస్తుందా లేదా అన్నది సంశయంగా మారింది. 

రామచందర్‌రావు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిపై విజయం సాధించి సంచలనం సృష్టించారు. అయితే ఈ సారి ఏ పార్టీతో పొత్తు లేకుండా బీజేపీ ఒంటరిగా బరిలోనికి దిగుతుండడంతో ఆ పార్టీ నుంచి టికెట్  ఆశించే ఆశావాహుల సంఖ్య తక్కువగానే ఉండడంతో రామచందర్‌రావుకు ఖచ్చితంగా టికెట్ కేటాయించనున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే రామచందర్‌రావు మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న అంశంపై తన అనుచరులతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.

ముచ్చటగా మూడోసారి...
టీడీపి గ్రేటర్ అధ్యక్షునిగా పనిచేస్తున్న ఎం.ఎన్ శ్రీనివాస్‌రావు ముచ్చటగా మూడోసారి తమ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. గత  ఎన్నికల్లో టీడీపి బీజేపితో పొత్తు పెట్టుకుని గ్రేటర్‌లో 10 స్థానాల్లో  ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకుంది. ఈ అభ్యర్థుల విజయంలో గ్రేటర్ అధ్యక్షునిగా పనిచేసిన ఎం.ఎన్ శ్రీనివాస్ కీలక పాత్ర పోషించాడు. అయితే ఎన్నికల అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపి నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు తెరాసలోనికి వెళ్లిపోవడంతో టీడిపి ఎమ్మెల్యేల శిబిరం ఖాళీ అయింది.

ప్రస్తుతం టీడిపి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని మహాకూటమిగా ఏర్పడడంతో పొత్తుల్లో భాగంగా టీడీపీకి తక్కువ సీట్లు ఇస్తామని కాంగ్రెస్ చెబుతుడడంతో గ్రేటర్‌లో ఎన్ని స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందో తెలియక పార్టీ కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారు. అయితే తనకు ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు పట్టుబడుతుండటంతో పార్టీ అధిష్టానం అతనికి టికెట్ ఇస్తుందా లేదా మళ్లీ మొండిచేయే చూపిస్తుందా అన్నది వేచి చూడాల్సిందే.

English Title
Political Leader Are Eagerly Waiting for party tickets
Related News