సెప్టెంబర్ 2న ప్రయాణాలు వాయిదా వేసుకోండి

Updated By ManamTue, 08/28/2018 - 06:54
trs party
  • ప్రగతినివేదన సభకు ఏర్పాట్లు ముమ్మరం

  • టీఆర్‌ఎస్ నేతలంతా కొంగర కలాన్‌లోనే..

  • మరో రికార్డు సృష్టించనున్న అధికార పార్టీ


హైదరబాద్: అధికార టీఆర్‌ఎస్ పార్టీ మరో అరుదైన రికార్డును సృష్టిం చనుంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్  జిల్లా ప్రకాష్‌రెడ్డిపేటలో టీఆర్‌ఎస్ అధ్యక్షునిగా, ఉద్యమ నాయకునిగా కేసీఆర్ నిర్వహించిన భారీ బహిరంగ సభకు సుమారు ఇరవై లక్షలకు పైగా తెలంగాణ ప్రజలు హాజరై రికార్డుల్లోకి ఎక్కగా ..ఇప్పుడు ఆ రికార్డును అదే టీఆర్‌ఎస్ పార్టీ అధికార పార్టీ హోదాలో తిరగరాయనుంది. సెప్టెంబర్ 2 న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో 25 లక్షల పై చిలుకు ప్రజలతో నిర్వహించునున్న ప్రగతి నివేదిక సభే అందుకు వేదికగా మారనుంది. ఎన్నికలకు ముందు అధికార టీఆర్‌ఎస్ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ముఫ్పై లక్షల వరకు ప్రజలను, పార్టీ కార్యకర్తలను తరలించాలని సీఎం ఆదేశించడంతో రాష్ట్ర నాయకులంతా జనసమీకరణలో నిమగ్నమయ్యారు. కొంగరకలాన్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి . వాహనాలన్నింటిని సభ కోసం ఉపయోగిస్తున్నందు వల్ల ప్రజలు సాధ్యమైనంత వరకు తమ ప్రయాణాలు ఆ రోజు వాయిదా వేసుకోవాలని నేతలు ప్రజలకు విజ్ఙప్తి చేస్తున్నారు.

image


సభలు పెట్టడం  టీఆర్‌ఎస్‌కు కొత్తేమి కాదు
భారీ బహిరంగ సభలు పెట్టడం, జన సమీకరణ చేయడం అధికార టీఆర్‌ఎస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజలను సకల జనుల సమ్మె పేరుతో ఒక్కతాటిపై నిలిపిన నాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం అంటేనే ప్రజలు ఎన్ని పనులు ఉన్నా ఉరుకులు పరుగుల మీద వస్తారు. అలా తన ఉద్వేగభరిత ప్రసంగాలతో ప్రజల మనస్సు గెలుచుకున్న కేసీఆర్ ఉద్యమ కాలంతో పాటు అధికారంలోనికి వచ్చాక మెజార్టీ ప్రజలు, కార్యకర్తలతో నిర్వహించిన సభలన్నీ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఇందులో భాగంగా నే రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం కొంగరకొలాన్‌లో క నివిని ఎరుగని రీతీలో సెప్టెంబర్ 2 న ప్రగతి నివేదన సభ పేరుతో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల నుంచి 30 లక్షల మందిని తరలించాలన్నది తెరాస అధిష్టాన నిర్ణయం. ఇందులో భాగంగానే మంత్రులు మొదలుకుని గ్రామ స్థాయి నాయకుని వరకు ఇప్పటికే జనసమీకరణకు కావాల్సిన కార్యచరణ రూపొందించడంతో పాటు ప్రజలను సభా ప్రాంగణానికి తరలించాల్సిన వాహనాల ఏర్పాటుపై దృష్టి సారించారు. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఔటర్‌రింగ్ రోడ్డుతో సహా రంగారెడ్డి జిల్లా మొత్తం జనసంద్రం కానుంది. అందుకే అత్యవసర పరిస్థితులైతే తప్ప ఆ రోజు ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు పలువురు మంత్రులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

శరవేగంగా ఏర్పాట్లు
ప్రగతి నివేదన సభ నభూతో న భవిష్యత్ అన్న రీతీలో నిర్వహించేందుకు టీఆర్‌ఎస్ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రులతో పాటు ముఖ్య నాయకులంతా అక్కడే మకాం వేసి బహిరంగ సభ ఏర్పాట్ల పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ప్రగతి నివేదన సభ కోసం 600 ఎకరాలు సభ కోసం, 1500 ఎకరాలు వాహనాల పార్కింగ్ కోసం వినియోగిస్తున్నామని నేతలు చెబుతున్నారు. నాలుగైదు రోజుల్లో పనులు పూర్తవుతాయని రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చే ప్రజల కోసం 200, 100, 60, 40 అడుగుల వెడల్పుతో 15 అనుసంధాన రోడ్లను నిర్మిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సభాప్రాంగణంలో 300 శౌచాలయాలతో పాటు తాగునీటి వసతి, వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. సభ నిర్వహణకు ఎనమిది ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే సభా ప్రాంగణ వేదిక నిర్మాణ పనులు చురుగ్గా సాగుతుండగా వర్షం పడినా ఇబ్బంది ఎదురుకాకుండా ఉండేందుకు ప్రత్యేక రేకుల షెడ్డులను నిర్మిస్తున్నారు. దాదాపు 200 జేసీబీలు, ఇటాచీలు, బుల్‌బోజర్లతో పనులు జెట్‌స్పీడ్‌తో జరుగుతున్నాయి. విద్యుత్‌కు అంతరాయం కలుగకుండా ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయడంతో పాటు పోలీసులు ప్రత్యేక కంట్రోల్ రూం సైతం ఏర్పరచుకుని బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

English Title
Postpone journeys on September 2
Related News