ప్రణయ్ హత్యకు మూడు నెలలుగా స్కెచ్

Updated By ManamTue, 09/18/2018 - 18:24
Pranay murder case,1 Crore Contract
  • ప్రణయ్ హత్యకు రూ.50 లక్షలతో డీల్

  • రూ.15 లక్షల అడ్వాన్స్ చెల్లించిన మారుతీరావు

  • అస్గర్ అలీ డైరెక్షన్‌లో బిహారీతో హత్యకు కుట్ర

  • ఈ కేసులో ప్రజాప్రతినిధుల ప్రమేయం లేదు

  • హత్యకేసు వివరాలను మీడియాకు వివరించిన ఎస్పీ రంగనాథ్

  • మీడియా ముందుకు ప్రణయ్ హత్యకేసు నిందితులు

Pranay Murder Case in miryalaguda

నల్గొండ :  రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో నిందితులను పోలీసులు మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ హత్యకేసులో  ప్రధాన నిందితుడు అమృతవర్షిణి తండ్రి మారుతీరావుపాటు  మొత్తం ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు. ప్రణయ్‌ను హత్య చేసేందుకు రూ.50 లక్షల డీల్ కుదిరినట్లు ఆయన వెల్లడించారు. కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్‌ను హత్య చేసేందుకు మూడు నెలలుగా పథకం రచించినట్లు ఎస్పీ తెలిపారు. అడ్వాన్స్‌గా రూ.15 లక్షలు చెల్లించడం కూడా జరిగింది. 

ఈ సందర్భంగా కేసు వివరాలను ఎస్పీ మీడియాకు వివరించారు.‘అస్గర్ అలీ డైరెక్షన్‌లో ప్రణయ్ హత్యకు స్కెచ్ వేశారు. ప్రణయ్ హత్యకు మూడు నెలలుగా ప్రణాళిక రచించారు. ప్రణయ్ హత్యకోసం అస్గర్ అలీ మూడు మారణాయుధాలు కొన్నాడు. ఆగస్ట్ 9 నుంచి రెక్కీ నిర్వహించారు. ఆగస్టు 14నే బ్యూటీ పార్లర్ దగ్గర ప్రణయ్ హత్యకు కుట్ర జరిగింది. అయితే అప్పుడు అతడి సోదరుడు ఉండటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. 

ఆ తర్వాత సెప్టెంబర్ మొదటివారంలో అమృతను కిడ్నాప్ చేసి అనంతరం ప్రణయ్‌ను హత్య చేసేందుకు ప్లాన్ వేసి విరమించుకున్నారు. ప్రణయ్‌ను హత్యచేసింది బిహార్‌కు చెందిన సుభాష్ శర్మ. ప్రణయ్‌ను హతమార్చిన తర్వాత అతడు పట్నాకు పారిపోయాడు. అతడిని బుధవారం నల్గొండకు తీసుకు వస్తాం.  అమృతవర్షిణి తల్లికి ప్రణయ్ హత్య గురించి తెలియదు.

మరోవైపు కూతురిని అబార్షన్ చేయించుకోవాలని మారుతీరావు ఒత్తిడి చేశాడు. అలాగే ఆమెకు ట్రీట్‌మెంట్ చేస్తున్న డాక్టర్‌ను కూడా అబార్షన్ చేయాలని బెదిరించాడు. అలాగే మారుతీరావు అక్రమాస్తులు, ల్యాండ్ కబ్జాలపై త్వరలో విచారణ చేపడతాం. అలాగే ఈ కేసులో ఏ ప్రజాప్రతినిధికి ప్రమేయం లేదు.’ అని ఎస్పీ రంగనాథ్ స్పష్టం చేశారు.

నిందితుల వివరాలు:
ఏ1 మారుతీరావు (అమృత వర్షిణి తండ్రి)
ఏ2 సుభాష్ శర్మ (బిహార్)
ఏ3 అస్గర్ అలీ
ఏ4 మహ్మద్ బారీ
ఏ5 అబ్దుల్ కరీం
ఏ6  శ్రవణ్ కుమార్ (అమృత బాబాయ్)
ఏ7 శివకుమార్ (మారుతీరావు కారు డ్రైవర్)

English Title
Pranay Murder Case: Police Expose Main Accused maruthirao In Front of Media
Related News