‘తనఖాలో లేని ఆస్తుల వివరాలు తెలుపండి’

Updated By ManamTue, 03/13/2018 - 22:30
'Provide details of mortgage assets'
  • యూనిటెక్‌కు సుప్రీం కోర్టు ఆదేశం

  • ఆస్తులు వేలం వేసి గృహ కొనుగోలుదార్లకు నగదు వాపసు చేయవచ్చని వెల్లడి

'Provide details of mortgage assets'న్యూఢిల్లీ: సమస్యల వలయంలో చిక్కుకున్న స్థిరాస్తుల అగ్ర సంస్థ యూనిటెక్ లిమిటెడ్‌కు చెందిన తాకట్టుపెట్టని ఆస్తుల వివరాలను సుప్రీం కోర్టు సోమవారం కోరింది. వాటిని వేలం వేసి వచ్చిన డబ్బును దాని దగ్గర గృహాలు కొనుగోలు చేసిన వారికి నగదు వాపసు చేయవచ్చని పేర్కొంది. యూనిటెక్ లిమిటెడ్‌కి హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ ఇచ్చిన కొన్ని రుణాలను బదలాయించుకున్న జె.ఎం. ఫైనాన్షియల్ ఎసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం రూ. 25 లక్షల జరిమానా విధించింది. గృహ కొనుగోలుదారులకు నగదును రిఫండు చేయగలననే అభిప్రాయాన్ని ఆ ఎసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ కల్పించిందని, ఇప్పుడు మొత్తం విచారణ పక్కదోవ పట్టిందని న్యాయమూర్తులు ఎ.ఎం. ఖాన్విల్‌కర్, డి.వై. చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ‘‘దీనిని మేం ప్రధాన కేసు నుంచి దృష్టిని అనవసరంగా పక్కకు మళ్ళించడంగా పరిగణిస్తున్నాం’’ అని జరిమానా విధిస్తూ ధర్మాసనం పేర్కొంది. తాకట్టుపెట్టని ఆస్తుల వివరాలు వెల్లడించవలసిందని ధర్మాసనం ఆ రియల్  ఎస్టేట్ కంపెనీని ఆదేశించింది. చిక్కుల్లో పడిన గృహ కొనుగోలుదార్లకు చెల్లించవలసి ఉన్న మొత్తాలను పరిష్కరించేందుకు ఆ ఆస్తులను వేలం వేసేందుకు అవకాశం ఉందని కూడా స్పష్టం చేసిం ది. సోమవారం నుంచి పదిహేను రోజులలోగా ఆస్తుల వివరాలు సమర్పించాలని ఆదేశించింది. నిర్మాణంలో ఉన్న తమ ప్రాజెక్టులకు రుణాలు సమకూర్చేందుకు ముంబయి కేంద్రంగా ఉన్న జె.ఎం. ఫైనాన్షియల్ లిమిటెడ్ ఆసక్తి చూపుతోందని యూనిటెక్ మార్చి 5న సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించింది. యూనిటెక్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ చంద్ర ప్రస్తుతం జైలులో ఉన్నారు. డిసెంబరు నెలాఖరుకల్లా తన రిజిస్ట్రీ వద్ద ఆ రియల్ ఎస్టేట్ గ్రూప్ నగదును డిపాజిట్ చేస్తేనే సంజయ్ చంద్రకు బెయిలు మంజూరు చేసే అవకాశం ఉంటుందని సుప్రీం కోర్టు గత ఏడాది అక్టోబరు 30న పేర్కొంది. నిర్మాణంలో ఉన్న గృహ నిర్మాణ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు, గృహ కొనుగోలుదార్లకు రిఫండు ఏర్పాట్లు చేసేందుకు వీలుగా కంపెనీ అధికారులు, న్యాయవాదులతో మాట్లాడేందుకు అవకాశం కల్పించవలసిందిగా అంతకుముందు కోర్టు జైలు అధికారులను ఆదేశించింది. బెయిలు ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు ఆగస్టు 11న తిరస్కరించింది. దాంతో సంజయ్ చంద్ర తాత్కాలిక బెయిలు కోసం సుప్రీం కోర్టుకు అప్పీలు చేసుకున్నారు. గురుగ్రామ్‌లోని యూనిటెక్ ప్రాజెక్టులు ‘వైల్డ్ ఫ్లవర్ కంట్రీ’, ‘అంతియా ప్రాజెక్ట్’లకు చెందిన 158 మంది గృహ కొనుగోలుదార్లు 2015లో సంజయ్ చంద్రపై క్రిమినల్ కేసు దాఖలు చేశారు.  

English Title
'Provide details of mortgage assets'
Related News