థియేటర్లలో అధిక ధరలకు కళ్ళెం

Updated By ManamMon, 07/30/2018 - 04:26
akun
  • ఆగస్టు 1 నుండి కొత్త నిబంధనలు

  • ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు, జైలు శిక్ష

  • తూనికలు కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ హెచ్చరిక

imageహైదరాబాద్:  ఆగస్టు 1వ తేదీ నుండి సినిమా హాళ్ళు, మల్టీప్లెక్స్ ధియేటర్లలో మంచినీళ్ళు, కూల్‌డ్రింక్స్, ఇతర తినుబండారాలను కేవలం ఎంఆర్‌పి ధర ప్రకారం అమ్మవలసి ఉంటుంది. దీనికి విరుధ్ధంగా ధరలు పెంచి అమ్మితే భారీ జరిమానాతో పాటు జైలుశిక్ష తప్పదని తూనికలు కొలతల శాఖ కంట్రొలర్ అకున్ సబర్వాల్ హెచ్చరించారు. తినుబండారాలు,పానీయాలకు సంబంధించి ధర,పరిమాణం వివరాలు స్టిక్కర్ రూపంలో ఖచ్చితంగా నమోదుచేయాలని ఆయన స్పష్టం చేసారు. గత కొంతకాలంగా ప్రేక్షకులనుండి అధిక ధరల గురించి లీగల్ మోట్రోలజీ శాఖకు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో  వీటికి అడ్డుకట్ట వేయడానికి తూనికలు కొలతల శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది.

దీనిపై ఇప్పటికే థియేటర్ యజమానులకు అవగాహన కల్పించింది. ఆగస్టు 1 నుండి  కొత్త నిబంధనలను ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని సమావేశంలో అధికారులను కంట్రోలర్ ఆదేశించారు. ఈ మేరకు గాం దీనగర్‌లోని తూనికలు కొలతల శాఖ కార్యాలయంలో అన్ని జిల్లాల అసిస్టెంట్ కంట్రోలర్‌లు, ఇన్‌స్పెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సెప్టెంబరు 1 నుండి స్టిక్కర్ బదులు ప్యాకెట్లపై ఎంఆర్‌పి, పరిమాణం, బరువు ఖచ్చితంగా ముద్రించి ఉండాలని అకున్ హెచ్చరించారు. ధరలో తేడాలుంటే ఎప్పటికప్పుడు మార్పులు,చేర్పులు చేయాలని, ప్యాకేజ్డి రూపంలో ఉన్న వస్తువులపై తయారీదారు పూర్తి వివరాలు, కస్టమర్ కేర్ వివరాలు ముద్రించి ఉండాలని ఆయన తెలిపారు.

ఈ నిబంధనల అమలుపై ఆగస్టు 2, 3 తేదీలలో హైదరాబాద్‌లో తనిఖీలు నిర్వహిస్తామని తరువాత 4, 5 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేస్తామని అకున్ చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మొదటిసారి కేసు నమోదుచేసి రూ 25000, రెండోసారి రూ 50000, మూడోసారి లక్ష రూపాయల జరిమానాతో పాటు, 6 నెలల నుంచి సంవత్సరం వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.

English Title
Pull over high prices in theaters
Related News