పీవీ సింధు మరో రికార్డు

Sindhu

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధూ మరో రికార్డును ఖాతాలో వేసుకుంది. చైనాలోని గ్వాంగ్‌ జూలో జరిగిన ప్రతిష్టాత్మక వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్న్‌మెంట్‌లో జపాన్‌కు చెందిన నోజోమి ఒకుహరాతో తలపడిన సింధు రెండు వరుససెట్లో మ్యాచ్‌ను గెలిచి టైటిల్‌ను నెగ్గింది. ఈ విజయంతో సీజన్ ముగింపు టోర్న‌మెంట్‌లో విజేతగా నిలిచిన తొలి భారత క్రీడాకారిణిగా సింధూ నిలిచింది. కాగా అంతర్జాతీయ టైటిల్‌ను గెలిచి ఈ సీజన్‌ను సగర్వంగా ముగించాలని ఉందని పీవీ సింధు ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటను నిలబెట్టుకుంది.
 

భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు చరిత్ర సృష్టించింది. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ టైటిల్ విజేతగా నిలిచింది. ఈ టైటిల్ గెలిచిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు క్రియేట్ చేసింది. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్లో రెండో సీడ్ ఒకుహర(జపాన్)పై సింధు అద్భుత పోరాటంతో విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన పోరులో గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. 21-19, 21-17 తేడాతో వరుస సెట్లలో గెలిచి ప్రత్యర్థిని మట్టికరిపించింది. గతేడాది ఫైనల్లో ఓడిన సింధు ఈ సారి టైటిల్ గెలిచి.. తన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ విజయంతో సింధు ఫైనల్ ఫోబియాను కూడా అధిగమించింది. ఈ ఏడాది సింగిల్స్‌లో సింధు ఖాతాలో తొలి టైటిల్ ఇదే కావడం విశేషం. మ్యాచ్ మొదటి నుంచి ఆధిక్యం కనబర్చిన సింధు తొలి గేమ్‌ను 21-19తేడాతో సొంతం చేసుకుంది. అనంతరం హోరాహోరీగా సాగిన రెండో గేమ్‌లో సింధుపై ఒత్తిడి పెరిగింది. అయినప్పటికీ 21-17 తేడాతో ఒకుహరపై పైచేయి సాధించి పసిడి కలను సాకారం చేసుకుంది. కీలక సమయంలో చక్కటి రిటర్న్‌లతో పాటు.. పదునైన స్మాష్‌లతో ప్రత్యర్థిపై విరుచుకుపడింది. ఇద్దరి మధ్య రెండో గేమ్ తొలుత రసవత్తరంగా సాగింది. అయితే ప్రత్యర్థి ఒక్క పాయింట్ కూడా ఆధిక్యంలోకి రాకుండా సింధు చాలా జాగ్రత్తగా ఆడింది. ఒకానొక సమయంలో 13-12 తేడా రావడంతో సింధుపై ఒత్తిడి పెరిగింది. దీంతో మూడో గేమ్ కూడా తప్పదనుకున్నారంతా. అయితే తర్వాత సింధు పుంజుకొని ప్రత్యర్థిపై తనదైన షాట్లతో విజృంభించింది. చివరికి 21-17 తేడాతో రెండో గేమ్‌తోపాటు టైటిల్ విజేతగా నిలిచింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతంతో సరిపెట్టుకున్న సింధు ఆ తర్వాత చాలా టోర్నీల్లో ఫైనల్ వరకూ వచ్చి ఓడిపోయింది. దీంతో సింధుకు ఫైనల్ ఫోబియా ఉందన్న విమర్శలు ఎదురయ్యాయి. ఈక్రమంలో ఆదివారం జరిగిన తుదిపోరులో ఒకుహరతో తలపడి గెలవడం కష్టమే అనుకున్నారంతా. కానీ ఇందుకు భిన్నంగా ఆదివారం మ్యాచ్ సాగింది.

నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను: సింధు
‘ఈ ఏడాది తొలి మేజర్ టైటిల్ సాధించాను. నా ఆనందాన్ని మాటల్లో వ ర్ణించలేను. ఈ విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మేజర్ టైటిల్‌తో ఈ ఏడాది ముగిస్తున్నాను. గతంలో నన్ను తరచుగా ఓ ప్రశ్న వెంటాటేది. ఈ విజయంతో విమర్శకులకు సమాధానం ఇచ్చానని భావిస్తున్నా. ఇకనుంచీ ఫైనల్స్ పోరును అధిగమించలేదని నన్ను ఎవరూ ప్రశ్నించరని భావిస్తున్నాను. స్వర్ణం సాధించానని ఇప్పుడు గర్వంగా చెబుతా ను. 2016లో సెమీఫైనల్లోనే వెనుదిరిగాను. గతేడాది రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగి అనున్నది సాధించినందుకు చాలా గర్వంగా ఉంది. నా అభిమానులు ఇలాంటి విజయం కోసం ఎంతో ఎదురుచూశారు. ఈ ఏడాది చివరి మేజర్ టైటిల్ సాధించి నాపై వారికున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లోనూ ఇదే ప్రదర్శనను పునరావృతం చేయాలని భావిస్తున్నాను. ఫైనల్ మ్యాచ్ ఆడుతుంటూ గత ఫైనల్స్ ఫలితాలు వెంటాడాయి. అయినా టైటిల్‌పైనే ఫోకస్ పెట్టడంతో నా కల నెరవేరింది అని సింధు వివరించింది. 

సింధుకు అభినందనలు వెల్లువ
బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ విజేతగా నిలిచిన తెలుగు తేజం పీవీ సింధుకు అభినందనలు వెల్లువెత్తాయి. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సింధుకు అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని గవర్నర్ కోరారు. ప్రపంచ టూర్ ఫైనల్‌లో ఒకుహరపై విజయం సాధించిన సింధుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సింధు టైటిల్ విజేతగా నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు. సింధు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సింధుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబనాయుడు అభినందనలు తెలిపారు. దీంతోపాటు సామాజిక మాధ్యమాల వేదికగా సింధుకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 
‘ఈ ఏడాదిని సింధు ఘనంగా ముగించింది. వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ఒకుహరపై విజయం సాధించి చరిత్ర సృష్టించింది. కంగ్రాట్స్ సింధు. నువ్విలాగే దేశానికి ఎన్నో పతకాలు సాధించి పెట్టాలి’  - వీరేంద్ర సెహ్వాగ్
‘ విదేశాల్లో ఆడి స్వదేశానికి బంగారు పతకం తెచ్చిన పీ.వీ. సింధుకు అభినందనలు’                 - వీవీఎస్ లక్ష్మణ్
‘బ్యాడ్మింటన్ లెజెండ్‌కు శుభాకాంక్షలు. నీకు ఫైనల్ భయం లేదని రుజువు చేశావు’                   - గౌరవ్ కపూర్
‘ సింధుకిది నిజంగా మరపురాని రోజే. నిజాయితీ కలిగిన ప్రపంచ స్టార్‌కు అభినందనలు. నీ పట్ల మేమెంతో గర్విస్తు న్నాం. నువ్విలాగే మరిన్ని పతకాలు సాధించాలి’ - హర్షా భోగ్లే
‘ సింధు.. చాంపియన్. ఈమాట వినడానికి ఎంతో గర్వంగా ఉంది. ఈ సంవంత్సరానికి ఘనమైన ముగింపు పలికావు’ - వీరేన్ రస్కిన్హా (టీమిండియా హాకీ మాజీ కెప్టెన్)
‘ఎంత అద్భుతమైన ప్రదర్శన. నువ్వు గ్లోబల్ స్టార్‌వి. మొదటి టైటిల్ సాధించినందుకు శుభాకాంక్షలు. నీ పట్ల భారత్ ఎంతో గర్విస్తోంది’ - రమణ్ సింగ్(ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి).
కఠినమైన సాధనతోనే ఈ విజయం: సింధు తండ్రి 
బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు విజయం సాధించడంపై ఆమె తండ్రి పీవీ రమణ హర్షం వ్యక్తం చేశారు. ‘ఈ సంవత్సరం ఐదు ఫైనల్స్ ఆడినప్పటికీ.. సింధు రజతంతోనే సరిపెట్టుకుంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన బీడబ్ల్యూఎఫ్ ఫైనల్‌లో గెలిచి సత్తా చాటింది. గతంలో ఫైనల్ మ్యాచ్‌ల్లో ఓడిపోయినప్పుడు ఎంతో బాధపడేది. మన ప్రయత్నం మనం చేయాలని, తప్పకుండా విజయం సాధిస్తావు’ అని చెప్పేవాడిన అని ఆయన తెలిపారు. ఈ టూరుకు ముందు నుంచి ఎంతో ఆత్మవిశ్వాసంతో సింధు ఉంది. అందుకు కఠోర శ్రమ కూడా తోడైంది. ప్రాక్టీస్ సెషన్లు ఏదీ మిస్ కాలేదు. కోచ్‌లు చెప్పిన సూచనలు పాటించి ఈ విజయం సాధించింది. వరల్డ్ నెంబర్‌వన్ కావాలన్నదే సింధు లక్ష్యం. ఒలింపిక్ క్వాలిఫికేషన్ ఉన్నందున ఈ సంవత్సరం సింధుకు ఎంతో కీలకమైనది’ అని రమణ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు