నేడే రాహుల్ రాక

Updated By ManamMon, 08/13/2018 - 05:14
Rahul
  • ఏర్పాట్లు పూర్తి చేసిన పీసీసీ.. అధినేత ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి

  • శేరిలింగంపల్లి సభపై సెటిలర్ల దృష్టి.. సరూర్‌నగర్ సభకు భారీగా నిరుద్యోగుల రాక!

  • ఓయూ విద్యార్థులపైనే అందరి చూపు

హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వస్తుండడంతో పీసీసీ నేతలు ఈ పర్యటనను ప్రతిష్టాత్మ కంగా భావించి ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల పాటు సాగే ఈ పర్యటన.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కలిసోస్తుందనే పలువురు అభిప్రా యపడుతున్నారు. ప్రధానంగా నగరంలో సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉండే శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బహిరంగ సభ పెట్టడం కాంగ్రెస్‌కు కలిసిరానుంది. ఎందుకంటే, గత ఎన్నికల తో పోల్చిసే, టీడీపీ బలహీన పడడం.. టీఆర్‌ఎస్ సెటిలర్ల సమస్యలను పట్టించుకోకపోవడం వంటి అంశాలపై రాహుల్ ప్రసంగం సుదీర్ఘంగా సాగనుంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లబ్ధి చేకూరడం ఖాయమని కాంగ్రెస్ నేతలు చెప్పు కొస్తున్నారు. ఏది ఏమైనా గత రాహుల్ పరట్యనలతో పోల్చుకుంటే.. ఈసారి పర్యటనకు అధిక ప్రాధాన్యత చోటుచేసుకుంది.

image


రాహుల్ ప్రసంగంపై ఆసక్తి..
ఇటీవల పార్లమెంటులో రాఫెల్ యుద్ధవిమానాల చర్చ సందర్భంగా రాహుల్ చేసిన ప్రసంగం అందరి దృష్టిని ఆకర్షించింది. నిన్నమొన్నటి దాకా రాహుల్ ప్రసంగాల్లో ఏమాత్రం వాడివేడి కన్పించేది కాదు. కానీ పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న విధానాలు, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వంటి అంశాలపై ఆయన విశ్లేషాణాత్మకంగా ప్రసంగం ఆద్యంతం రసవత్తరంగా సాగడంపై దేశ ప్రజలతో పాటు కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహన్ని నింపింది. అయితే హైదరాబాద్ పర్యటనలో భాగంగా రాజేంద్రనగర్‌లో మహిళలతో సమావేశం, శేరిలింగంపల్లి, సరూర్‌నగర్ స్టేడియాల్లో బహిరంగ సభలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రాహుల్ మరోసారి తన ప్రసంగ వేడిని ప్రత్యర్థులకు రుచిచూపనున్నారనే ఊహగాహనాలు లేకపోలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళ సంఘాలకు రుణాల విషయంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాలు, సమభావన సంఘాలు, అభయహస్తం పింఛన్ తదితర అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మహిళ సంఘాల రుణాలకు పెద్దపీట వేశారు. ఆ రుణాల వల్ల ఎంతోమంది మహిళలు, గృహిణులు ఆర్థికంగా బలపడ్డారు. కానీ ప్రత్యేక రాష్ట్రంలో ఆ దిశగా చెప్పుకోదగ్గ ప్రయత్నాలు జరగలేదు. దీంతో మహిళా సంఘాలతో సమావేశం ప్రత్యేకతను సంతరించుకుంది.

ఓయూ సభకు అనుమతి నిరాకరణతో ఊపు..
రాహుల్ గాంధీ ప్రజా చైతన్య బస్సు యాత్రలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థులతో సదస్సు నిర్వహించాలని భావించారు. అందులో భాగంగానే ఓయూ జేఏసీ నాయకులు ఏర్పాట్లు చేసేందుకు వర్సిటీ వీసీకి దరఖాస్తు చేసుకున్నారు. భద్రతా కారణాల వల్ల తాము అనుమతి ఇవ్వలేమంటూ.. వర్సిటీ ఎస్టేట్ సెల్ అధికారి అనుమతి నిరాకరించారు. ఈ విషయాన్ని ఓయూ విద్యార్థులతో పాటు కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. సామాజిక మాధ్యమాల్లో అనుమతి నిరాకరణ అంశంపై జోరుగా చర్చ సాగింది. ఫలితంగా రాహుల్‌గాంధీ పర్యటనకు అప్పటివరకు లేని ప్రాధాన్యత కల్పించినట్టయ్యింది. ఓయూలో సదస్సు పెడితే.. కేవలం 1500 మందితోనే ముగిసేది. కానీ అనుమతి నిరాకరణ కారణంగా సరూర్‌నగర్‌లో బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అంతకుముందు వరకు ఒక్క శేరిలింగంపల్లిలో మాత్రమే బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. కానీ ఓయూ అనుమతి నిరాకరణ కారణంగా మరో బహిరంగ సభ ఏర్పాటుకు అవకాశం ఏర్పడింది. సరూర్‌నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు విద్యార్థులు, నిరుద్యోగ అభ్యర్థులు పెద్ద ఎత్తున రానున్నారు. ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం.. ఓయూపై నీలినీడలు కమ్ముకున్నాయనే ఆరోపణలున్నాయి. శతాబ్ది ఉత్సవాలు, నిధుల కేటాయింపు, వర్సిటీ వసతి గృహాల్లో అసౌకర్యాలు, సిబ్బంది, ప్రొఫెసర్ల కొరత, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన లేమి వంటి అంశాలపై రా్రష్ట్ర ప్రభుత్వం చిన్న చూపుచూసిందనే విమర్శలు ప్రస్తుతం జోరుగా విన్పిస్తున్నాయి. దీంతో సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభకు ఓయూ విద్యార్థుల హాజరుపై అందరి దృష్టి నెలకొంది.

ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు..
రాహుల్ పర్యటనకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో సదస్సుకు నిరాకరణతో పాటు ముస్లింలతో చర్చించేందుకు హకీం గ్రౌండ్‌లో అనుమతి ఇవ్వకపోవడాన్ని కాంగ్రెస్ నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. ఎట్లాగైనా ప్రజా చైతన్య బస్సు యాత్రలో రాహుల్ పర్యటనను నూటికినూరుశాతం విజయవంతం చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాహుల్ పర్యటించే ప్రాంతాల్లో ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాపై ఇటీవల టీఆర్ ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే పలుమార్లు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రాహుల్ తెలంగాణ రాష్ట్ర ప్రజలనుద్దేశించి మంచి ప్రసంగం చేస్తారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని పీసీసీ నేతలు చెబుతున్నారు.

English Title
Rahul arrives today
Related News