రాహుల్‌పై హార్దిక్ పటేల్ సంచలన వ్యాఖ్యలు

Updated By ManamSat, 02/24/2018 - 13:45
Rahul Gandhi,  Priyanka Gandhi, Hardik Patel
  • రాహుల్ గాంధీ నా నాయకుడే కాదు.. ప్రియాంకా వాద్రా రాజకీయాల్లోకి రావాలి

  • వ్యక్తిగతంగా రాహుల్ అంటే ఇష్టం.. రాజకీయ నాయకుడిగా కాదు

Rahul Gandhi,  Priyanka Gandhi, Hardik Patelముంబై: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) ఉద్యమనేత హార్దిక్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ అసలు నాయకుడే కాదన్నారు. ఒకవైపు రాహుల్‌ను విమర్శిస్తూనే.. మరోవైపు ప్రియాంక గాంధీ వాద్రా రాజకీయాల్లోకి రావాలని పటేల్ ఆకాంక్షించారు. ‘ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నా నాయకుడు కాదు. వ్యక్తిగతంగా రాహుల్ అంటే నాకు ఇష్టం. కానీ, ఆయన్ను ఓ నాయకుడిగా భావించలేను. ఎందుకంటే రాహుల్‌ను ఎన్నడూ ఓ నేతగా నేను చూడలేదు’ అని పటేల్ చెప్పారు. ప్రియాంక గాంధీ వాద్రా రాజకీయాల్లోకి రావాలని, ఆమెలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి తరపున ఎంపీగా హార్దిక్ పోటీ చేయబోతున్నారనే కథనాలు వచ్చాయి.

ఈ వార్తలపై స్పందించిన హార్దిక్.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేయబోనని స్పష్టం చేశారు. గత గుజరాత్ ఎన్నికల సమయంలో పటేల్‌ వయస్సు 25ఏళ్ల కంటే తక్కువ ఉండటంతో పోటీ చేయలేకపోయారు. 2019 నాటికి పోటీ చేసే అర్హత ఉన్నప్పటికీ కూడా తాను పోటీ చేయనని చెప్పారు. ‘వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో (ప్రధాని నరేంద్ర మోదీ) వ్యతిరేకంగా పోటీచేయడం లేదు. వచ్చే ఏడాది ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను. నేను ఎన్నికల్లో పోటీ చేయగలిగినప్పుడు నన్నెవరూ ఆపలేరు. అసెంబ్లీ లేదా పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించాలో ప్రజల నిర్ణయమే ప్రాధాన్యమని భావిస్తాను’ అని హార్దిక్ అభిప్రాయపడ్డారు.

English Title
Rahul Gandhi not my leader, waiting for Priyanka Gandhi: Hardik Patel
Related News