కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే టీడీపీ భూస్థాపితం అవుతుంది

Updated By ManamSat, 09/08/2018 - 15:24
ramachandra reddy

ramachandra reddyఅమరావతి: కాంగ్రెస్‌తో టీడీపీ అంటకాగడం కొత్తకాదని, గతంలో కిరణ్ సర్కారు పడిపోకుండా చంద్రబాబు కాపాడారని వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు కురిపించారు. కిరణ్‌ను కాంగ్రెస్‌లో తిరిగి చేర్పించింది చంద్రబాబేనని, కిరణ్ తమ్ముళ్లను స్మగ్లర్లు అన్న చంద్రబాబు, వాళ్లకే కేబినెట్ ర్యాంకు ఇచ్చారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని, కాంగ్రెస్‌లో పొత్తు వల్ల టీడీపీకి ఎలాంటి లాభం ఉండదని రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఏపీలో ఆ పార్టీ భూస్థాపితం అవుతుందని రామచంద్రారెడ్డి జోస్యం చెప్పారు.

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, ఆత్మగౌరవ నినాదంతో దివంగత ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, అలాంటి పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకోవడం దారుణమని అన్నారు. కాంగ్రెస్, టీడీపీల పొత్తు వలన వైసీపీకి ఎలాంటి నష్టం లేదని చెప్పారు. ఇక రెయిన్‌గన్‌లతో 4లక్షల ఎకరాలకు నీరిచ్చినట్లు నిరూపిస్తే, తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు.

English Title
Ramachandra Reddy comments on TDP
Related News