రెడీ టు ఫైర్

Updated By ManamWed, 09/19/2018 - 00:50
nambi narayananan

‘నేను జీవించి ఉండగానే ఈ అపవాదు నుంచి బయటపడాలని  నా పిల్లలు చెప్పారు. లేకుంటే వంశం మొత్తం జీవితాంతం ఈ కళంకాన్ని మోయాల్సి వస్తుందని, అది తమకు ఇష్టం లేదని వాళ్ళన్నారు. అందుకే ఇంతకాలం జీవించి ఉన్నాను. పోరాడడానికే జీవించి ఉండడమన్నది నాకు అవసరమై పోయింది. ఇది నా దేశానికి వ్యతిరేకంగా జరిగిన ఒక కుట్ర కథ..., ఇది నా కథ!’    - నంబి నారాయణన్


దేశానికి వ్యతిరేకంగా గూఢచర్యం చేశారన్న అభియోగం ఒక్కటి చాలు, ఒక వ్యక్తి సామాజిక, సాంస్కృతిక, నైతిక, ఆర్థిక, కౌటుంబిక పునాదులన్నీ కదిలిపోతాయి. ఒక వ్యక్తి జీవితాన్ని మట్టిపాలు చేయడంతో పాటు, గూఢచర్యం అన్న పదం ఒక దేశ ఖగోళ శాస్త్ర పరిశోధనకు ఉపయోగపడాల్సిన మేధస్సును కూడా వ్యర్థం చేసేసింది. దేశానికి సంబంధించిన రాకెట్ పరిశోధనల తాలూకు రహస్యాల్ని పాకిస్తాన్‌కు అందిస్తున్నారన్న అభియోగం మీద ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ను 1994 నుంచి వేధించి, హింసిం చి, నరకం చూపించారు కేరళ పోలీసులు. ఇన్నేళ్ళపాటు కొనసాగిన అసత్య ఆరోపణల ఫలితంగా ఈ దేశం ఒక శాస్త్రవేత్త సేవల్ని కోల్పోయింది. ఒక శాస్త్రవేత్త తన ఆశయానికి దూరమయ్యాడు. ఒక ప్రతిష్ఠాత్మక ఖగోళ పరిశోధనా సంస్థ తన పరువును పోగొట్టు కుంది. ఒక కుటుంబం అవమానంతో కుంగిపోయింది. ఈ అసత్య గూఢచర్యం కేసులో సుప్రీంకోర్టు గత శుక్రవారం వెలువరించిన తీర్పు నిజాయితీకే తుది విజయ మన్న విశ్వాసానికి సాక్ష్యం. 

image


భారీ ఉపగ్రహాల్ని కూడా మోసుకెళ్ళగలిగే రాకెట్లను తయారు చేసే శాస్త్ర సాంకేతికతను రాకెట్ రంగంలో క్రయోజెనిక్స్ అంటారు. నంబి నారాయణన్ (76) భారత ఖగోళ పరిశోధనా కేంద్రం ‘ఇస్రో’కు చెందిన క్రయోజెనిక్ సైంటిస్టు. ఆయనతోపాటు ఇస్రోలో నే పని చేస్తున్న మరో సైంటిస్టు శశికుమార్, మాల్దీవులకు చెందిన మరియం రషీదా, ఆమె స్నేహితురాలు ఫౌజియా హసన్, వ్యాపార వేత్త శర్మ, రష్యన్ వ్యోమ పరిశోధనా సంస్థ ప్రతినిధి చంద్రశేఖ ర్‌లపై కేరళ పోలీసులు గూఢచర్యం కేసును నమోదు చేసి, అరెస్టు లు చేశారు. 

ఆద్యంతం అసత్యారోపణలతో నిండిపోయిన ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ‘వీరిని అనవసరంగా అరెస్టు చేశారం టూ’, ఇందుకు బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవా లని తీర్పునిచ్చింది. ఈ దిశగా ఒక కమిటీని నియమించాలని ఆదేశించింది. 

ఇన్నేళ్ళుగా తన మీద సాగిన ఈ గూఢచర్యం కేసు గురించిన నిజానిజాలన్నింటినీ ప్రపంచానికి తెలియజెప్పాలన్న ఉద్దేశంతో నంబి నారాయణన్ ‘రెడీ టు ఫైర్ : హౌ ఇండి యా అండ్ ఐ సర్‌వైవ్డ్ ది ఇస్రో స్పై కేస్’ అనే పుస్తకాన్ని రచించారు. ఈ స్వీయగాథలోని కొన్ని భాగాలకు సంక్షిప్త అనువాదాన్ని ‘ముద్ర’ ఇక్కడ మీ కోసం ప్రచురిస్తోంది. 
ఏదో ఒక ముస్లిం పేరు చెప్పు చాలు!

‘సత్య, ధర్మ అనే పేర్లతో ఎవరో కొందరు వ్యక్తులు నా మీద మొదటి పోలీసు విచారణ జరిపారు. నా వెనుక చిన్న కోటు, లాగూ తొడుక్కున్న ఇద్దరు నిలుచున్నారు. వాళ్ళిద్దరూ నా మెడను విరగ్గొట్టడానికే నా వెనుక నిలుచున్నారన్న నిజాన్ని అర్థం చేసుకోవడానికి నాకు ఎక్కువ సేపు పట్టలేదు. 

గదిలో ఉన్న వాళ్ళలో ఒక సీనియర్ అధికారి ‘మీరు గొప్ప శాస్త్రవేత్త. మీరు జాతి సొత్తు. అలాగే మీరు మంచి మెళుకువలు తెలిసిన వ్యక్తి. సరే, ఇదంతా ఎందుకు చేశారు?’ అని నన్ను ప్రశ్నించాడు. 

‘నేనేం చేశాను?!’
‘గూఢచర్యం’
‘గూఢచర్యమేమిటి?’

అతను తన గొంతును సవరించుకుని ‘మిస్టర్ నంబి..., సారీ, డాక్టర్ నంబి...’ అంటూ నన్ను సంబోధించాడు. 
‘నేను డాక్టర్‌ని కాదు, మిస్టర్ చాలు...’ అన్నాను
‘సరే, మీరు డాక్టర్ అంతటి వారే! అయితే, మీరు ఎందుకు ఈ నేరానికి పాల్పడ్డారో చెప్పండి’ అన్నాడు వ్యంగ్యంగా.
‘మీరు దయచేసి అర్థం చేసుకోండి..., నేను ఏ నేరమూ చేయలేదు. మీకేం కావాలో చెప్పండి’
‘పిచ్చిగా మాట్లాడకు, ఒప్పుకుంటే సంతోషంగా బతుకుతావు లేదంటే, నీ చేత ఎలా ఒప్పించాలో మాకు తెలుసు’
బెదిరింపులకు అది మొదటి సూచన.

‘నేను చేసిన నేరమేంటి?’
‘నీక తెలీదా?’ అతను ఒకసారి లేచి, మళ్ళీ కూర్చున్నాడు. ‘నువ్వు దేశ రహస్యాల్ని, రాకెట్ సాంకేతికతను పాకిస్తాన్‌కు అమ్మేశావనడానికి మా దగ్గర ఆధారాలున్నాయి. ఇప్పుడు మేము ఆ మాటను నీ నోటి వెంట వినాలనుకుంటున్నాం. ఇదంతా ఎలా చేశావో చెప్పు. ఎంత లంచం తీసుకున్నావో చెప్పు’
అదే సమయంలో మరో ముగ్గురు గదిలోకి వచ్చారు. వారిలో ఒకడు బూడిద రంగు సఫారీ సూట్‌ను ధరించి ఉన్నాడు. ఒక బక్కపలుచని వ్యక్తి ‘ఈయన ఇండియన్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌లో అతి పెద్ద అధికారి’ అని పరిచయం చేశాడు. 

ఉన్నట్టుండి ఆ బక్కపలుచని వ్యక్తి కోపం గా, ‘ఒరే, లం...కొడకా నీ మీద ఎంత తీవ్ర మైన ఆరోపణలున్నాయో నీకు తెలుస్తోందా? అంటూ అరిచాడు. నేను అతనికి వ్యతిరేకంగా జవాబివ్వగానే, అతను తన దగ్గరున్న ఫైలు నుంచి కొన్ని కాగితాల్ని బయటికి తీసి, నా మీద నమోదైన ఆరోపణల్ని చదివాడు. ఇది అఫిషియల్ సీక్రెట్ యాక్ట్ కింద నమోదైన నేరం. దీనికి పధ్నాలుగేళ్ళు జైలుశిక్ష పడుతుం ది. తరువాత ఆయన తనతో వచ్చిన ఆ ‘పెద్దమనిషి’కేసి వేలు చూపెడుతూ, ‘ఇంత పెద్ద మనిషి నీ నోటి నుంచి ఆ మాటను విన డానికే ఇంత దూరం వచ్చారు. ఈయన నేరుగా దేశంలో అత్యున్నత పదవిలో వ్యక్తికి ఈ సమా చారాన్ని చెబుతారు. ఆయన త్వరలోనే ఢిల్లీకి వస్తారు. కాబట్టి నువ్వు ఎంత త్వరగా ఒప్పు కుంటే అంత మంచిది’ అని అన్నాడు. ఆ పెద్ద మనిషి నిజంగా ఐబికి అధినేత కాదు, ఆయన ఐబి జాయింట్ డైరెక్టర్ ఎం.కె.ధర్ అని నాకు తెలుసు. 
నేను నింపాదిగా, ‘నేను మీకు చెప్పేదేం లేదు. నేను నిరపరాధిని. ఇదం తా ఏవో అపార్థాల వల్ల జరుగుతోంది’ అని జవాబిచ్చాను. కాదు...మాకంతా తెలుసు. నువ్వు మరియం రషీదాని ఎప్పుడు కలుసుకున్నావో చెప్పు’
‘నేను ఆమెను కలవలేదు’ ‘అబద్ధాలాడడానికి నీకు ఎంత ధైర్యం? ఆమె మాకు అంతా చెప్పింది. మా సహనం నశించక ముందే నిజం చెప్పు. అంతటినీ ఒప్పుకో, లేదా నువ్వు అంతమై పోతావు’ ‘దయచేసి నన్ను నమ్మండి’ అని అన్నాను. నా కంఠస్వరం నిజాన్ని ప్రతిధ్వనిస్తోంది. ‘నేను మీరు చెబుతున్నట్టుగా ఆ మాల్దీవుల ఆడవాళ్ళను ఎన్నడూ కలవలేదు. వాళ్ళు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు. నేను వాళ్ళని కలిశానని వాళ్ళు ఎలా చెప్పగలరు?’ ‘నువ్వు ఇలాగే బొంకుతూ ఉంటే, నేను ఫౌజియాను ఇక్కడికి తీసుకొస్తా, దాని చెప్పుతో నిన్ను కొట్టిస్తాను. అది నిన్ను కొడుతుండగా ఫోటోలు తీసి, న్యూస్‌పేపర్లకి ఇస్తాను’ ఆ ఐబి పెద్దమనిషి, అతనితో వచ్చిన వ్యక్తి వెళ్ళిపోయారు. నన్ను విచారిస్తున్న ప్రధాన అధికారి మళ్ళీ తన పనిని కొనసాగిం చాడు. అప్పటికి రాత్రి అవుతోంది. ఒక అబ్బాయి నాకోసం అన్నం, సాంబారు తీసుకొచ్చాడు. నేను ఆ ఆహారాన్ని ముట్టలేదు. అప్పు డు గదిలో ఉన్న ఇద్దరు వెళ్ళిపోయారు. మరో ఇద్దరు వచ్చారు. 

‘ఎందుకు ఈ నేరానికి పాల్పడ్డావో చెప్పు’ అంటూ వాళ్ళు కూడా పాత పాటే పాడసాగారు. 
‘నువ్వు వికాస్ ఇంజన్, క్రయోజెనిక్ ఇంజన్లను పాకి స్తాన్‌కు అమ్మేశావు’ అని అన్నాడు వారిలో ఒకడు. 
‘మీకు రాకెట్ సైన్స్ అంటే తెలియదు. మీరు చెబుతున్న డ్రాయింగ్‌లు లేనే లేవు. ఏ డ్రాయింగ్‌లు ఇస్రో నుంచి బయటకు వెళ్ళలేదు. ఒక వేళ అలాంటి డ్రాయింగులు ఉన్నా, మాతో కలిసి ఏళ్ళూ పూళ్ళూ పని చేయ కుండా కేవలం డ్రాయింగ్‌ల సహాయంతో ఎవ్వరూ ఇంజన్లను తయారు చేయలేరు. ఇంత వరకు భారతదేశానికి క్రయోజెనిక్ ఇంజన్ లేనే లేదు. ఆ విషయం మీకు తెలుసా? అలాంటి ఇంజన్‌ను తయారు చేయడానికే మేమింకా నానా ప్రయత్నాలు చేస్తున్నాం’

పాకిస్తాన్ న్యూక్లియర్ సైంటిస్టు మొహమ్మద్ అస్లామ్‌తో నాకు సంబంధాల్ని అంటగట్టే ప్రయత్నం చేశారు. ఒక న్యూక్లియర్ సైంటిస్టు తో కలిసి, రాకెట్ పరిజ్ఞానం గురించి మాట్లాడడం కుదరదన్నా ను. ముఫ్ఫై గంటల పాటు అన్న పానీయాలు లేకుండా, నిలబడే ఉన్నాను. ‘నేను నిర్దోషినని మీరు ఒప్పుకునేంత వరకు ఇలాగే ఉంటాను’ అని వాళ్ళని బెదిరిం చాను. ‘కనీసం ఒక్క ముస్లిం పేరైనా చెప్పు...’ అంటూ వాళ్ళు నన్ను నానా హింసలు పెట్టారు. నేను నిజాన్ని మాత్రమే నమ్ము కున్నాను. వాళ్ళు వెళ్ళిపోయారు. భారతీయ నిఘా సంస్థ ‘రా’ అధికారులు కూడా నాతో వాళ్ళు కోరుకున్న దాన్ని చెప్పించలేక పోయారు. నాలో ఆత్మవిశ్వాసం బలపడింది. కానీ నేను పనిచేస్తున్న సంస్థ ఇస్రో మాత్రం నాపై వచ్చిన ఈ అపవాదును ఖండించక పోవడం నన్ను బాధపెట్టింది. విక్రమ్ సారాభాయికే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉంటే, ఆయనేం చేసే వాడో?!

అవిశ్రాంత  పోరాటం
imageకేరళలోని తిరువనంతపురంలో హోటల్ సామ్రాట్‌లోని 205 వ నెంబరు గదిలోకి 20 అక్టోబరు 1994న ఒక పోలీసు అధికారి సుడిగాలిలా దూసుకొచ్చాడు. గదిలో ఆయనకి ఒక డైరీ దొరికింది. ఆ డైరీ మాల్దీవులకు చెందిన మరి యం రషీదా అనే మహిళకు చెందింది.  ఆ డైరీ, ఆ రోజు జరిగిన సంఘటనలు భారత దేశపు ఖగోళ పరిశోధనల బాటలో అతి పెద్ద అగాథాన్ని ఏర్పరిచాయి. ఒక శాస్త్రవేత్త సేవల్ని దేశానికి దూరం చేశాయి. ఇరవై నాలుగేళ్ళ జీవితాన్ని అతనికి నరకప్రాయం చేశాయి. భారత ఖగోళ విజయయాత్రకు సారథి అయిన ‘ఇస్రో’ ప్రతి ష్ఠను పరీక్షకు నిలిపాయి. చివరికి ఇన్నాళ్ళకు గ్రహణం వీడింది. ఆ శాస్త్రవేత్త నిర పరాధి అని తేలిపోయింది. 
అవాస్తవాల వెంట పరుగెత్తి, ఇంతటి అనరా ్థనికి కారకులైన వారి మీద చర్య తీసుకోవాలంటూ, ఆ శాస్త్రవేత్తకు యాభైలక్ష ల రూపాయల నష్టపరిహా రాన్ని చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది! కానీ ఈ పరిహారం జరిగిన నష్టాన్ని ఎన్నటికీ పూడ్చలేదు.

ఆ నాటి ఆ ఘటన ఇస్రోకి చెందిన క్రయోజెనిక్ ప్రాజెక్టు అధినేత, ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ను పదవీ చ్యుతుణ్ణి చేసింది. దేశానికి వ్యతిరేకంగా గూఢచర్యానికి పాల్ప డి, పాకిస్తాన్‌కు దేశ రహస్యాల్ని చేరవేశారన్న అభియోగాన్ని మోపి పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. భారతదేశానికి చెందిన మూడువందల కోట్ల రూపాయల క్రయోజెనిక్ ప్రాజెక్టు తాలూకు రహస్య పత్రాల్ని అక్రమంగా అమ్ముకున్నారంటూ నారాయణన్‌తో పాటు మరో ఐదుగురి మీద అభియోగాన్ని మోపారు. ఇస్రో శాస్త్రవేత్తల్ని ఇద్దరు మహిళలు లైంగిక ప్రలోభా నికి గురిచేసి, ఈ అక్రమానికి పురికొల్పారని పోలీసులు వాదిం చారు.  దాంతో నారాయణన్ తనకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా 2015లో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నారాయణన్ అవిశ్రాంతంగా చేసిన ఈ న్యాయపోరాటంలో గత శుక్రవారం ఆయనకు విజయం లభించింది.

పోలీసుల్ని వదిలి పెట్టను!
తనను దారుణంగా హింసించారంటున్న మరియం రషీదా

‘విదేశీ వ్యక్తుల రిజిస్ట్రేషన్ వ్యవహారాల విభాగంపై పోలీసు అధికారి ఇన్‌స్పెక్టర్ విజయన్ పెత్తనం చెలాయించే వాడు. అతని లైంగిక వాంఛను తీర్చక పోవడంతో నన్ను తప్పు డు కేసులో ఇరికించాడు. నా వీసా గడువును పొడిగించాలని నేను అతణ్ణి సంబంధిత కార్యాలయంలో కలిశాను. నేను దేశాన్ని విడిచి వెళ్ళడానికి టిక్కెట్లు కూడా తీసుకున్నాను. దురదృష్టవశాత్తు అప్పుడు విమాన సర్వీసులు రద్దయ్యాయి. విజయన్ నా పాస్‌పోర్టును, టిక్కెట్లను తీసుకున్నాడు. కొన్ని రోజుల తరువాత అతను నేను ఉంటున్న హోటల్ గదికి వచ్చి, నా స్నేహితురాలు ఫౌజియాను గది వెలుపల వేచి ఉండ మన్నాడు. ఆమె వెళ్ళిపోగానే, అతను నా దగ్గరికి వచ్చి, నా భుజం చుట్టూ చేతులు వేసి, కౌగిలించుకునేందుకు ప్రయత్నిం చాడు. నేను ఆగ్రహించి, అతనిని దూరంగా నెట్టేసి, గదిలోంచి వెళ్ళిపోవాలంటూ కేకలు పెట్టాను...’ అంటూ మాల్దీవులకు చెందిన మరియం రషీదా వాపోయింది.

image


ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ మీద నమోదైన గూఢచర్యం కేసులో ఈమె కూడా ఒక నిందితురాలు. రషీదా అక్టోబరు 1994 నుంచి ఏప్రిల్ 1998 వరకు మూడేళ్ళ పాటు కేరళ జైళ్ళలో గడిపింది. ‘జైలు జీవితం దుర్భరమైంది. ‘ై‘పోలీసు కస్టడీలో నన్ను దారుణంగా హింసించారు. జైల్లో నంబినారాయణన్ పేరు చెప్పాలంటూ నన్ను నానా విధాలుగా హింసించారు. ఆ పోలీసు అధికారులకు వ్యతిరేకంగా నా తరఫున మా న్యాయవాది త్వరలో కేసును నమోదు చేస్తారు’ అని రషీదా హెచ్చరించింది. రషీదా స్నేహితురాలు ఫౌజియా హసన్‌ను కూడా గూఢచర్యం కేసులో అరెస్టు చేశారు. కానీ సాక్ష్యాధారాలతో నిరూపించలేక పోవడం వల్ల ఆమెను, రషీదాను విడిచి పెట్టాలని కోర్టు ఆదేశించింది.

English Title
Ready to fire
Related News