రెండో విడతకు రెడీ!

Updated By ManamMon, 07/30/2018 - 06:33
rythu-bandu
  • సెప్టెంబర్‌లో ఇచ్చే అవకాశం

  • సాగు చేసినా.. చేయకున్నా.. ‘పెట్టుబడి’

  • ముంచుకొస్తున్న ఆర్డర్ చెక్కుల గడువు

  • రూ.5,100 కోట్లను నగదుగా మార్చుకున్న రైతులు

rythu-banduహైదరాబాద్: ప్రపంచంలోనే తొలిసారిగా రైతుల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ సర్కారు రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి మే నెలలో ఎకరాకు రూ.4వేలు సాయాన్ని చెక్కుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీని ప్రారంభించింది. రెండో విడత సాయాన్ని రబీ సీజన్‌కు ముందే అందించేటందుకు సిద్ధమైంది. అవసరమైన రూ.5925 కోట్ల నిధులను విడుదల చేసింది. అయితే వీటిని కార్డుల రూపంలో ఇవ్వాలా? లేదా చెక్కుల రూపంలో ఇవ్వాలా? అనే విషయం ఇంకా ఖరారు కాలేదు. యాసంగి(రబీ) సీజన్ అక్టోబర్ మొదటివారం నుంచి ప్రారంభం కానుంది. అందుకని సెప్టెంబర్ నెలాఖరు నాటికి ఎకరాకు రూ.4వేలు పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. రెండో విడతలో ఇట్లా...

ఖరీఫ్ సీజన్ మాదిరిగానే రబీ సీజన్‌లోనూ పట్టాదారు పాసుపుస్తకం ఉన్న ప్రతి రైతుకూ పెట్టుబడి సొమ్ము ఇవ్వనున్నారు. అయితే పథకం ప్రారంభంలో పంట సాగు చేసిన భూములకు మాత్రమే రెండో విడతలో పెట్టుబడి సాయం అందిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం ఖరీఫ్‌లో ఇచ్చిన రైతులందరికీ పంట సాగు చేసినా.. చేయకపోయినా పెట్టుబడి సాయం అందనుంది. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లో 1.08 కోట్ల ఎకరాలు సాధారణ సాగు కాగా, రబీ సీజన్‌లో 31.92 లక్షల ఎకరాలు మాత్రమే. మొదట్లో ప్రభుత్వం సాగు చేసిన ఎకరాలకు మాత్రమే సాయం అందించాలని భావించింది. కానీ ఖరీఫ్‌లో సాగు చేపట్టిన పత్తి, మిర్చి తదితర పంటలు ఎనిమిది నెలలకు పైగా ఉంటాయి. దీంతో ఖరీఫ్ మాదిరి ప్రతి రైతుకు పంటతో నిమిత్తం లేకుండా రూ.4వేలు అందనున్నాయి.

image

చెక్కులవైపే మొగ్గు...
రెండో విడత పెట్టుబడి సాయాన్ని రైతులకు కార్డుల ద్వారా అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం పథకం ప్రారంభంలోనే భావించారు. కానీ ఈసారి కార్డుల ద్వారా సాయం అందే సూచనలు కన్పించడం లేదు. ఎందుకంటే.. చెక్కుల ద్వారా రైతులకు సాయం సొమ్ము అందించడం వల్ల రైతులకు ప్రభుత్వ సాయం పట్ల స్పష్టత ఉంది. ఎవరికీ ఎంత సొమ్ము వచ్చిందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. దీనికితోడు చెక్కుల పంపిణీ సమయంలో గ్రామాల్లో పండగ వాతవరణం నెలకొంటుంది. దాదాపు రెండు నెలల పాటు ప్రభుత్వం అందజేస్తున్న సాయం, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రైతులు, ప్రజలు నెమరువేసుకునే పరిస్థితి ఉంది. ఫలితంగా వచ్చే ఎన్నికల్లో ఈ అంశాలు టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి సానుకూలంగా మారనున్నాయి. ఈ విషయం ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలోనూ చర్చ జరిగినట్టు సమాచారం. ఏదీఏమైనా రెండో విడత సాయాన్ని చెక్కుల రూపంలోనే అందించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది.

మిగిలిన 9 లక్షల చెక్కులు..
రాష్ట్రంలో 58.33 ల క్షల మంది రైతులు ఉన్నారు. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.4వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని చెక్కుల రూపంలో గ్రామాలకు చేరవేసింది. గ్రామసభల ద్వారా సదరు చెక్కులను వ్యవసాయాధికారులు రైతులకు అందజేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల అధికారులు రైతులకు ఇప్పటివరకు 49 లక్షల చెక్కులను మాత్రమే పంపిణీ చేశారు. దాదాపు 9 లక్షల చెక్కులు పంపిణీ కాలేదు. వాటిల్లో 1.50 లక్షల చెక్కుల వరకు చనిపోయిన రైతుల పేర్ల మీద ఉన్నాయి. మరో లక్ష చెక్కులు విదేశాల్లో ఉన్న వారివి కావడంతో తీసుకోలేదు. మిగిలిన చెక్కులను పలు కారణాల వల్ల రైతులు తీసుకోలేదు. దీనికితోడు ఆర్‌ఓఎఫ్‌ఆర్ భూములకు సంబంధించిన 91,971 చెక్కులను పంపిణీ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు 72,203 చెక్కులను పంపిణీ చేయగా, 19,768 చెక్కులు మిగిలిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు పంపిణీ అయిన చెక్కుల్లో మరో రెండు లక్షల చెక్కులు క్లియర్ కావాల్సి ఉంది. ఇదిలావంటే.. ఇప్పటివరకు పంపిణీ చెక్కుల ద్వారా రైతులు రూ.5100కోట్లు నగదుగా మార్చుకున్నారు.

చెక్కులను దాసుకుంటున్న రైతులు
రాష్ట్రవ్యాప్తంగా చాలామంది రైతులు ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద అందజేసిన ఆర్డర్ చెక్కులను దాసిపెట్టుకున్నారు. బ్యాంకుల్లో రద్దీ ఎక్కువగా ఉండడం, ఇతరత్రా కారణాల వల్ల చెక్కులను ఇంట్లోనే పెట్టుకున్నారు. తీరా గడువు సమయం ముగిసినంక.. బ్యాంకులకు వెళితే సిబ్బంది గడువు అయిపోయిదంటూ తిప్పి పంపుతున్నారు. తమ చెక్కులను ఏలాగైనా చెల్లుబాటయ్యేలా చూడాలని నిత్యం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇదిలావుంటే.. మొదటి విడతలో ముద్రించిన చెక్కుల గడువు తేదీ ఈనెల 19వ తేదీతో ముగిసిపోయింది. తదుపరి విడతల్లో ముద్రించిన చెక్కుల గడువు ఆగస్టు 1, 10, 15 తేదీలతో ముగియనుంది. చెక్కుల గడువు ముగింపు విషయంపై వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి బ్యాంకులను సంప్రదించగా, ఆరు రోజుల పాటు గడువు పెంచేందుకు అంగీకరించాయి.

English Title
Ready for the second installment
Related News