పునఃసృష్టి

Updated By ManamSat, 04/14/2018 - 01:31
santhosh
  • ఏకైక భారతీయ టాక్సిడెర్మీ కళాకారుడు సంతోష్ గైక్వాడ్

santhosh‘టాక్సిడెర్మీ’ అనే పదానికి మూలం గ్రీకుభాషలోని ‘టాక్సిస్’, ‘డెర్మా’ అనే పదాల్లో ఉంది. ‘టాక్సిస్’ అంటే కదిలేది, ‘డెర్మా’ అంటే చర్మం. అంటే కదిలించడానికి వీలుగా ఉండి, చర్మంతో చేసిన కళాఖండాన్ని ‘టాక్సిడెర్మీ’ అని పిలుస్తారు. మరణాన్ని గౌరవించే సంప్రదాయం నుంచి పుట్టిన కళ ఇది. క్షీరదాలు, పక్షులు, చేపలు, తదితర జీవుల్ని చనిపోయిన తరువాత యధాతథంగా వాటి రూపాన్ని సజీవకళతో పరిరక్షించడానికి టాక్సిడెర్మీ ప్రతిమల్ని ఉపయోగిస్తారు. అలాగే జీవజాతుల పరిరక్షణకు సంబంధించిన మ్యూజియంలలో నెలకొల్పడానికి లేదా జీవజాతులకు సంబంధించిన శాస్త్రీయ పరిశోధనలకు ఈ టాక్సిడెర్మీ ప్రతిమల్ని వాడుతుంటారు. ప్రధానంగా అంతరించి పోతున్న జీవజాతుల గురించిన సమాచారాన్ని రికార్డు చేయడానికి మ్యూజియంలలో ఈ టాక్సిడెర్మీ ప్రతిమలు చాలా ఉపయోగపడతాయి. అలాగే క్రీడాకారులకు, పూర్వకాలంలో వేటగాళ్ళకు సంబంధించిన పోటీల్లో విజేతలకు బహుమతులుగా కూడా ఈ ప్రతిమల్ని బహూకరించే వారు. టాక్సిడెర్మీ ప్రతిమల్ని తయారు చేసే కళాకారుల్ని ‘టాక్సిడెర్మిస్ట్’లంటారు. టాక్సిడెర్మిస్ట్‌కు శిల్పం, చిత్రలేఖనం, వడ్రంగం వంటి కళలన్నింటిలో అనుభవం ఉండాలి. దీనికి తోడు అతనికి జంతువుల దేహనిర్మాణం గురించిన పరిజ్ఞానం కూడా ఉండాలి. చనిపోయిన తరువాత జంతు కళేబరాల్లో సులభంగా పాడైపోయే అవకాశం ఉన్న భాగాల్ని తొలగించి, శుభ్రపరచి, వాటి చర్మా న్ని పదిల పరచడమన్నది అనాదిగా వాడుకలో ఉన్న ప్రక్రియే. దీనికి మూలాలు ఈజిప్టు మమ్మీల చరిత్రలో ఉంది. చనిపోయిన జంతువును దాని సహజాకృతిలో ఉంచి, టాక్సిడెర్మీ ప్రతిమగా మారుస్తారు. సాధారణంగా ప్రాచీన కాలంలో పెంపుడు జంతువుల్ని, పక్షుల్ని ‘మమ్మీ’లుగా మార్చే సంప్రదాయం ఉండేది. ప్రపంచంలో 18 వ శతాబ్దంలో టాక్సిడెర్మీ ప్రతిమల్ని ఇళ్ళలో, భవంతుల్లో అలంకరణ నిమిత్తం వినియోగించే వారు. ఇరవయ్యో శతాబ్దానికి ఈ టాక్సిడెర్మీ కళకు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది. కానీ అటు తరువాత ఈ కళకు ప్రాచుర్యం బాగా తగ్గిపోయింది. అయితే మన దేశంలో కేవలం ఒకే ఒక్క వ్యక్తి ఈ టాక్సిడెర్మీ కళను పరిరక్షిస్తుండడం తెలుసుకోదగిన విశేషం. 

దేశంలో 1.3 మిలియన్ల మంది ఉండగా, వారిలో కేవలం ఒక్కరి గురించి మాత్రమే మాట్లాడుకోవలసి రావడం అంటే విచిత్రంగానే ఉంటుంది. ఆ విచిత్రం పేరే డాక్టర్ సంతోష్ అనంత్ గైక్వాడ్. ఈయన ముంబయి వెటర్నరీ కళాశాలలో అనాటమీ అధ్యాపకునిగా పని చేసేవారు. వృత్తి రీత్యా పశువుల డాక్టర్. అయితే ఆయన 2003లో ఒకసారి ముంబయి మెయిన్ మ్యూజియంకు వెళ్ళారు. ఆ మ్యూజియం ఆయన ప్రవృత్తినే మార్చేసింది. ఆ మ్యూజియంలోని జంతుశిల్పాలు సజీవంగా కనిపించాయి ఆయనకు. క్షీరదాలు, పక్షిజాతికి చెందిన కొన్ని నమూనాల్ని అక్కడ ఆయన చూశారు. మరణించిన జంతువుల్ని సజీవంగా ఉన్నట్టు తీర్చిదిద్దిన కళా ప్రతిభ ఆయనను ఆకట్టుకుంది. వెంటనే ఆ కళను అభ్యసించి తీరాలని ఆయన నిర్ణయించు కున్నారు. వెంటనే ఆయన సంబంధిత పుస్తకాల్ని చదివారు, విదేశాలకు చెందిన కొందరు టాక్సిడెర్మిస్టుల సలహాల్ని తీసుకున్నారు. తోలును శుభ్రం చేయడం, పెయింటింగ్, కార్వింగ్ వంటివి కూడా నేర్చుకున్నారు. తొలుత కోళ్ళు, పావురాలను టాక్సిడెర్మీ ప్రతిమలుగా తయారు చేయడం మొదలు పెట్టి, క్రమంగా చేపలు, పిల్లులు, కుక్కల ప్రతిమల్ని కూడా రూపొందించారు. తరువాత నెమళ్ళు, పులులు, ఏనుగుల టాక్సిడెర్మీ ప్రతిమల్ని తయారు చేశారు. ఈ కళలో నైపుణ్యం సంపాదించిన తరువాత ఆయన పశువైద్యునిగా తన వృత్తికి రాజీనామా చేసి, పూర్తికాలం టాక్సిడెర్మీ ఆర్టిస్టుగానే కొనసాగడానికి నిర్ణయిం చుకున్నారు. సంజయ్‌గాంధీ నేషనల్ పార్క్‌లో నెలకొల్సిన వన్యమృగ టాక్సిడెర్మీ సెంటర్‌లో ఇప్పుడు గైక్వాడ్ పని చేస్తున్నారు. టాక్సిడెర్మీ ప్రతిమల్ని కేవలం కళాఖండాలుగానే కాకుండా, ఇవాళ అంతరించి పోతున్న జీవజాతుల పరిరక్షణ నిమిత్తం ఒక సాధనంగా ఉపయోగించాలని గైక్వాడ్ ప్రయత్నిస్తున్నారు. ‘ఒకసారి జంతువు మరణిస్తే, మనం దాని మృతదేహాన్ని పూడ్చి పెడతాం, లేదా కాల్చివేస్తాం. దాంతో ఆ జంతువు సౌందర్యమంతా అదృశ్యమై పోతుంది. కానీ అది ప్రకృతి ఇచ్చిన కానుక. ఆ సౌందర్యాన్ని పరిరక్షించే ఈ కళను అభ్యసించడాన్ని ఒక సుకృతంగా భావిస్తున్నాను’ అని ఆయన అంటారు. తన తరువాత ఈ కళను కొనసాగించే వారు లేరంటూ గైక్వాడ్ ఆవేదన చెందుతున్నారు.

Tags
English Title
Recreate
Related News