దృష్టి మళ్లించాలనే!

Updated By ManamSun, 09/23/2018 - 23:50
IMRAN-KHAN
  • అందుకే ఇరు దేశాల చర్చలు రద్దు

  • రఫేల్‌పై మోదీ రాజీనామాకు డిమాండ్లు

  • అందుకే భారత్ వైపు నుంచి యుద్ధకాంక్ష

  • పాక్ మంత్రి ఫవాద్ హుస్సేన్ విమర్శలు

  • మన చేతగాని తనమే: పాక్ ప్రతిపక్షం 

IMRAN-KHANఇస్లామాబాద్: రఫేల్ ఒప్పందంపై చెలరేగిన దుమారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే భారత్-పాకిస్థాన్ విదేశాంగ మంత్రుల సమావేశాన్ని భారత్ రద్దుచేసిందని పాకిస్థాన్ ఆరోపించింది. ఈ ఒప్పందం నేపథ్యంలో ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్లు పెరుగుతుండటంతో భారత్ యుద్ధకాంక్షను బయట పెట్టుకుంటోందని పాక్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ హుస్సేన్ ట్వీట్ చేశారు. ఇలాంటి యుద్ధకాంక్ష ఉన్న నాయకులను తాము తిరస్కరిస్తామని, ఈ మెగా అవినీతి నుంచి దృష్టి మళ్లించాలనే వాళ్లలా చేస్తున్నారని అన్నారు. భారత రక్షణ దళాలపై మోదీ సర్కారు సర్జికల్ స్ట్రైక్ చేసిందన్న రాహుల్‌గాంధీ వ్యాఖ్యలను కూడా ఫవాద్ ప్రస్తావించారు. రాహుల్‌గాంధీ, పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఖండించారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా అంతర్జాతీయ మహాకూటమిని ఏమైనా రాహుల్ ఏర్పాటు చేయాల నుకుంటున్నారా అని కూడా ఆయన ప్రశ్నించారు. రాహుల్‌తో పాటు పాకిస్థాన్ కూడా ‘మోదీ హఠావో’ అంటోందని,  ఇప్పుడు ప్రధాని మీద రాహుల్ చేస్తున్న నిరాధార ఆరోపణలను పాకిస్థాన్ కూడా సమర్థిస్తోందని, ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ మోదీకి వ్యతిరేకంగా అంతర్జాతీయ మహాకూటమి ఏర్పాటు చేస్తున్నట్టుందని ఎద్దేవా చే శారు. 

సమాధానం చెప్పాలి: రావత్
పాకిస్థాన్‌తో చర్చలు రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ స్వాగతించారు. పాక్‌కు దీటుగా సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. ప్రభుత్వ విధానం స్పష్టంగా ఉందని, ఉగ్రవాదం - చర్చలు ఒకేసారి కుదరవన్న విషయాన్ని మనం స్పష్టం చేశామని, పాక్ ఈ ఉగ్రవాద భూతాన్ని నిర్మూలించాల్సిందేనని రావత్ తెలిపారు. ఉగ్రవాదులు, పాక్ సైనికుల అనాగరిక దాడులపై భారత్ కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. కాగా, చర్చలను భారత్ రద్దుచేయడంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. భారత్‌ది పొగరుబోతు నిర్ణయమని ఆయన అన్నారు. చిన్న వ్యక్తులు పెద్ద పదవులకు వస్తే ఇలాగే ఉంటుందని, తన జీవితంలో ఇలాంటి వాళ్లను చాలామందిని చూశానని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు.

ఇమ్రానే కారణం
పాకిస్థాన్‌తో చర్చలను భారత్ రద్దుచేసుకోడానికి ప్రధాని ఇమ్రాన్ ఖానే కారణమని పాక్ ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. ఇది ఆయన దౌత్య ఓటమికి నిదర్శనమని, సమావేశం పెట్టడానికి ముందు అసలు తగిన హోం వర్క్ చేసి ఉండాల్సిందని అన్నాయి. జమ్ము కశ్మీర్‌లో పోలీసులను చంపడం, బుర్హాన్ వనీపై స్టాంపు విడుదల చేయడం లాంటి చర్యలను నిరసిస్తూ భారత్ ఇరుదేశాల చర్చలను రద్దుచేసింది. దీనిపై పాకిస్థాన్ ముస్లిం లీగ్ -నవాజ్ (పీఎంఎల్-ఎన్), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఇమ్రాన్‌ఖాన్‌ను తీవ్రంగా తప్పుబట్టాయి. ఇమ్రాన్ మరీ ఆతృతపడ్డారని, ఇది మన బలహీనతను సూచిస్తుందని పీఎంఎల్‌ఎన్ ప్రతినిధి మహ్మద్ ఆసిఫ్ విమర్శించారు.

Tags
English Title
To redirect attention!
Related News