5 లక్షల మంది విద్యార్థులకు అన్నం

Updated By ManamSun, 07/29/2018 - 02:24
kadiyam
  • పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ, బీఈడీ, డీఈడీ, మోడల్ జూనియర్ కాలేజీల్లో అమలు

  • కడియం నేతృత్వంలోని కమిటీ చర్చ.. అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా సరఫరా

  • ఆగస్టు 3న సమావేశంలో తుదిరూపు

kadiyamహైదరాబాద్: మరొక బృహత్తర పథకానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తూ, దేశంలోనే తెలంగాణ శభాష్ అనిపించుకుంది. ఇప్పుడు ఈ పథకాన్ని కాలేజీ విద్యార్థులకు కూడా వర్తింపజేయడానికి సిద్ధమైంది. శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ పథకం ప్రారంఛించాలని నిర్ణయించిన విషయం విదితమే. సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు మధ్యాహ్న భోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్, మోడల్ జూనియర్ కాలేజీలు, బీఈడీ, డీఈడీ కాలేజీల్లోని దాదాపు 5 లక్షల మందికి అందించనున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలపై చర్చించేటందుకు శనివారం డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నే తృత్వంలో మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు, ఇంద్రకరణ్ రెడ్డి సచివాలయంలో సమావేశమయ్యారు. మధ్యాహ్న భోజనం అత్యంత నాణ్యంగా, పౌష్టిక విలువలతో అందించేందుకు మూడు రకాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులను కోరింది.

కమిటీ అడిగిన ప్రతిపాదనలు...

  •     ఐదు లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి కావల్సిన సరుకులన్నీ అందిస్తే సరఫరా చేయడం. 
  •     సరుకులన్నీ అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారానే సమకూర్చి భోజనం అందించడం 
  •     పులిహోర, బ్లాక్ రైస్, ఉప్మా, కొర్రలు, జొన్నలు, రాగులు, సజ్జల వంటి విభిన్న తృణ ధాన్యాలతో కూడిన భోజనాన్ని అందించడంపై ప్రతిపాదనలు ఇవ్వాలని అడిగింది.

రాష్ట్రంలోని 31 జిల్లాల్లో అన్ని కాలేజీలకు మధ్యాహ్న సమయానికి భోజనం అందే విధంగా కావల్సిన కిచెన్లు ఏర్పాటు చేసుకోవాలని, మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవాలని మంత్రులు అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధులకు సూచించారు. అక్షయపాత్ర ఫౌండేషన్‌తో పాటు కాలేజీలకు దగ్గరగా ఉన్న మెస్సులు, హోటళ్ల ద్వారా మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించడంపై కూడా చర్చించి, ఈ వివరాలు పూర్తిస్థాయిలో తెప్పించుకుని వచ్చే సమావేశంలో కూలంకుశంగా చర్చించాలని నిర్ణయించారు. ఆగస్టు 3వ తేదీ మరోసారి సచివాలయంలో ఈ కమిటీ సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి అక్షయపాత్ర ఫౌండేషన్ తగిన ప్రతిపాదనలతో రావాలని సూచించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ జాయింట్ డైరెక్టర్ రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

English Title
Rice for 5 lakh students
Related News