రైజర్స్ v/s రైడర్స్

Updated By ManamSat, 05/19/2018 - 00:47
ipl
  • కోల్‌కతాకు చావో  నేడు హైదరాబాద్‌తో ఐపీఎల్ మ్యాచ్

  • ఐపీఎల్ సీజన్-11 చివరి దశకు చేరుకుంది. కానీ, ఇంకా ప్లే ఆఫ్‌పై స్పష్టత రాలేదు.. తొలి రెండు స్థానాలను సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకోగా.. మిగిలిన రెండు స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ స్థానాల కోసం ఐదు జట్లు పోటీ పడుతున్నాయి. అందులో కోల్‌కతా నైట్‌రైడర్స్ కూడా ఒకటి. అందుకే ఈ మ్యాచ్ నైట్‌రైడర్స్‌కు చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్‌కు చేరుకుంటుంది. ఒకవేళ ఓడిపోతే మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అందుకే ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ తప్పనిసరిగా గెలవాలని పట్టుదలతో ఉంటే..వురోవైపు వరుసగా రెండు ఓటములను చవిచూసిన సన్  రైజర్స్ ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలిచి టాప్ ప్లేస్‌తో ముగించాలనే పట్టుదలతో ఉంది

Riders v/s ridersహైదరాబాద్: వరుస పరాజయాలపాలైనప్పటికీ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఇక ఏమాత్రం తప్పులు చేయడానికి వీల్లేదు. ఐపీఎల్‌లో భాగంగా శనివారం జరగనున్న మ్యాచ్‌లో బలమైనా, టేబుల్ టాపర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కేకేఆర్ తలపడనుంది. 13 మ్యాచ్‌ల్లో 9 విజయాలు సాధించి 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో 14 పరుగులతో ఓటమిపాలైంది. అయినప్పటికీ ఆతిథ్య జట్టు గత మ్యాచ్‌ల్లో సాధించిన విజయాలతో స్ఫూర్తి పొందవచ్చు. రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన కేకేఆర్ 13 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు సాధించి 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. తొలి రెండు స్థానాల్లో ఉన్న హైదరాబాద్, చెన్నై జట్లకు దగ్గరైన కేకేఆర్ శనివారం మ్యాచ్‌లో గెలుపు కోసం సర్వశక్తులొడ్డి పోరాడనుంది. మొన్నటి వరకు బలమైన బౌలింగ్ అటాక్ కలిగిన జట్టుగా పేరొందిన హైదరాబాద్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన కనబరిచింది. అయితే కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌లో ఆ తప్పులను సరిచేసుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌కు హైదరాబాద్ జట్టులో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. బెంగళూరుతో మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకుని ఐపీఎల్‌లోనే చరిత్ర సృష్టించిన పేసర్ బాసిల్ థంపిపై వేటు పడే అవకాశముంది. పూర్తి బౌలింగ్ కోటా నాలుగు ఓవర్లలో అతను 70 పరుగులిచ్చాడు. దీంతో ఇంతకుముందు ఇషాంత్ శర్మ నెలకొల్పిన రికార్డును థంపి బద్దలు కొట్టాడు. థంపీ బౌలింగ్‌ను ఏబీ డివిలియర్స్, మొయిన్ అలీ చితకబాదారు. అయినప్పటికీ సన్‌రైజర్స్ అద్భుతమైన బ్యాటింగ్‌తో హైదరాబాద్ జట్టు గెలుపుకు దగ్గరగా వచ్చింది. ఈ సీజన్‌లో 600 పరుగులు పూర్తి చేసిన సన్‌రైజర్స్  కెప్టెన్ కేన్ విలియమ్సన్ ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. మరోసారి తన ప్రతాపాన్ని చూపేందుకు సిద్ధమయ్యాడు. బెంగళూరుతో మ్యాచ్‌లో విలియమ్సన్ 42 బంతుల్లో 81 పరుగులు చేశాడు. ఈ ఐపీఎల్‌లో అతను అర్ధ సెంచరీకిపైగా పరుగులు చేయడం ఇది ఎనిమిదోసారి.  మరోవైపు బెంగళూరు బౌలర్లపై వీరవిహారం చేసి అర్ధ సెంచరీ చేసిన మనీష్ పాండే అదే జోరును కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు. గత మ్యాచ్‌లో ఆడలేకపోయిన ప్రధాన బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఈ మ్యాచ్‌కు బరిలోకి దిగనున్నాడు. రషీద్ ఖాన్, సిద్ధార్థ్ కౌల్, షకీబ్ అల్ హసన్ అతనికి అండగా నిలవనున్నారు. కేకేఆర్ జట్టులో అత్యున్నత విశ్వాసంతో ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే కుల్‌దీప్ యాదవ్. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కుల్‌దీప్ నాలుగు వికెట్లు తీసి జట్టుకు సునాయస విజయాన్ని అందించాడు.

చాలెంజర్స్‌తో రాయల్స్ పోరు
జోస్ బట్లర్, బెన్ స్టోక్స్ వంటి స్టార్ ప్లేయర్స్ లేకపోవడంతో బలహీనపడ్డ రాజస్థాన్ రాయల్స్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో తలపడేందుకు సిద్ధమైంది. శనివారం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఐదారు స్థానాల్లో ఉన్న ఈ రెండు జట్లకూ ఈ మ్యాచ్ కీలకమైంది. ప్లే ఆఫ్ అవకాశాలు వేడెక్కుతున్న సమయంలో నాలుగైదు స్థానాల కోసం ఐదు జట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఇప్పటికే తొలి రెండు స్థానాలను ఖాయం చేసుకున్నాయి. కాగా రాజస్థాన్ రాయల్స్, ఆర్‌సీబీ, పంజాబ్, ముంబై ఇండియన్స్, కేకేఆర్ జట్లు మిగిలిన రెండు స్థానాల కోసం పోటీ పడుతున్నాయి. 

ఐపీఎల్‌లో నేడు
రాజస్థాన్ రాయల్స్ X రాయల్ చాలెంజర్స్  సవాయి మాన్‌సింగ్ స్టేడియం-జైపూర్  సా 4 గంటలకు..
సన్‌రైజర్స్ హైదరాబాద్ X కోల్‌కతా నైట్‌రైడర్స్ ఉప్పల్ స్టేడియం హైదరాబాద్  రా 8 గంటలకు...

Tags
English Title
Riders v/s riders
Related News