‘హక్కుల’ ధిక్కారధీర!

Updated By ManamTue, 02/13/2018 - 06:16
art_wome

art_womeహక్కుల కోసం ఆమె గొంతు ప్రతి సందర్భంలోనూ వినిపించేది. ప్రభుత్వం అనుసరించే అప్రజాస్వామిక విధానాలను, అసహనాన్ని, మతం పేరుతో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను ఎదిరించడంలోనూ ఆమె ముందుండేవారు. ఆదివారం కన్నుమూసిన ప్రఖ్యాత పాకిస్థాన్ న్యాయవాది, మానవ హక్కుల నేత ఆస్మా జహంగీర్ (66) మానవహక్కుల కోసం దృఢంగా నిలబడిన మహిళ. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా, ఎన్ని బెదిరింపులొచ్చినా ఆమె లక్ష్యం సడలిపోలేదు. ఆమెకు దైవదూషణనేరంపై జైలు శిక్ష విధించినా ఆమె బెదిరిపోలేదు. అనేక అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న ఆమె నోబెల్ పురస్కారానికి కూడా నామినేట్ అయ్యారు. మూడు దశాబ్దాల పాటు సునిశిత విమర్శలతో మానవ హక్కుల న్యాయవాదిగా ఆమె ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. ఇస్లామిక్ రాజ్యంగా నడుస్తున్న పాకిస్థాన్‌లో ఒక మహిళ మానవ హక్కుల ఉద్యమ నేతగా ఎదురొడ్డి నిలబడడమే కాకుండా అంతర్జాతీయ ఖ్యాతిగాంచడం నిజంగా చెప్పుకోదగిన అంశమే! గౌరవం పేరుతో మహిళలను దూషించడాన్ని ఆమె వ్యతిరేకించారు. నాస్తికులంటూ ముస్లివేుతరులను వేధించడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. మత తీవ్రవాదాన్ని నిరంతరం వ్యతిరేకించేవారు. అక్కడితో ఆగకుండా నియంతృత్వ పోకడలను నిరసిస్తూ ప్రజాస్వామ్య స్వేచ్ఛకోసం పోరాడారు. పాకిస్థాన్‌లో సైనిక పాలనలో ప్రతి సవమస్యాత్మక అంశంలోనూ ఆమె గొంతు వినిపించేది. బహిరంగంగా పోరాడేందుకు సిద్ధమయ్యేవారు. ఆమె తరచూ చేస్తుండే చమత్కార వ్యాఖ్యానాలు సంబంధితులకు ముళ్లలాగే గుచ్చుకునేవి. అవే ఆమెకు అనేకమంది అభిమానులను, అనుయాయలను తెచ్చిపెట్టింది. జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ సైనిక పాలనకు వ్యతిరేకంగా 2007లో పాకిస్థాన్‌లో న్యాయవిభాగం చేసిన ఉద్యమంతో ఆమె మొట్టమొదటిసారిగా హక్కుల ఉద్యమాని కి పరిచయమయ్యారు. ఆ సమయంలో పాకిస్థాన్ స్వతంత్ర మానవహక్కుల సంఘానికి చైర్‌పర్సన్‌గా ఉన్నారు.

ఆ పరిస్థితుల్లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించి ఉద్యమ నాయకులతో పాటు ఆమెనూ గృహనిర్బంధంలో ఉంచారు. 2017లో ఆక్స్‌ఫర్డ్‌లో ఇచ్చిన ఉపన్యాసంలో, ‘సైనిక పాలన దేశాన్ని అథోగతిపాల్జేయగా, దేశంలోని రాజకీయ నేతలు మాత్రం పంజాలు విసురుతూ, ప్రజాస్వామ్యంతో ఆడుకుంటున్నా’రని ఆమె నిశితంగా విమర్శించారు. 1987లో తన సోదరి హీనా జిలానీతో దేశంలో మహిళల కోసం మొట్టమొదటి చట్టపరమైన సంస్థను ఏర్పాటుచేయడంద్వారా పాకిస్థాన్ మహిళల హక్కులకు ఆమె మార్గదర్శకురాలిగా నిలిచారు. రేప్ బాధితుల్ని వ్యభిచారిణులుగా చూపించే చట్టాల్లోని అంశాలపై కొద్ది సంవత్సరాలుగా ఆమె పోరాటం చేస్తున్నారు. మతతత్వ ఇస్లామిక్ గ్రూపులు మహిళలపై చేస్తున్న అమానుషదాడులను ఆమె తీవ్రంగా నిరసించారు. మారథాన్‌లలో మహిళలు పాల్గొనడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ 2005లో ఆమె ఊరేగింపు నిర్వహించినందుకు అరెస్టయ్యారు. మానవ హక్కుల కార్యాలయాన్ని పోలీసులు చుట్టుముట్టారు. ఒకదశలో ఆమెపై భౌతికదాడికి ప్రయత్నించినా ఆమె వెనుదిరగలేదు.  ఆస్మా జహంగీర్ మృతి పట్ల అంతర్జాతీయ మానవ హక్కుల కార్యకర్తలు నివాళులర్పించారు. ఆమె మరణం ఒక్క ఆమె కుటుంబసభ్యులకే కాకుండా గొంతు వినిపించలేని హక్కుల బాధితులందరికీ తీరని లోటని వారు సంతాపం ప్రకటించారు. 
 తాడేపల్లి శివరామకృష్ణారావు
7396955147

Tags
English Title
'Rights' defiance!
Related News