గూగుల్, ఫేస్‌బుక్‌లకు  రూ. 60 వేల కోట్ల జరిమానా..?

Updated By ManamMon, 05/28/2018 - 00:55
fine

techశాన్‌ఫ్రాన్సిస్కో: యూరోపియన్ యూనియన్ కొత్తగా తీసుకొచ్చిన జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (జీడీపీఆర్) ప్రభావం సామాజిక మాధ్య మాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఆస్ట్రియన్ ప్రైవసీ అడ్వకసీ గ్రూప్ చేసిన విన్నపానికి జీడీపీఆర్ ఆమోదం తెలిపితే.. సామాజిక మాధ్యమాలైన గూగుల్, ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ దాదాపు 9 బిలియన్ డాలర్లు (రూ.60 వేల కోట్లు) జరిమానా చెల్లించాల్సి రావొచ్చు. ఫేస్‌బుక్ వంటి మాధ్యమాలు యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో.. మే 25 నుంచి అమల్లోకి వచ్చిన డీజీపీఆర్ ఆయా సంస్థలకు భారీగా జరిమానా విధించే అవకాశం ఉంది. గూగుల్, ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి మాధ్యమాలు వినియోగదారుల వ్యక్తిగత వివరాలను బలవంతంగా తీసుకుంటున్నాయని ఆస్ట్రియన్ ప్రైవసీ అడ్వకసీ గ్రూప్ ఆరోపిస్తోంది.

యూజర్లు తమ వివరాలను అందించకపోతే, సేవలను పొందేందుకు వీల్లేకుండా చేస్తున్నాయని, దీనివల్ల వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని అడ్వకసీ గ్రూప్ వాదిస్తోంది. ఈ మేరకు వినియోగదారుల వివరాలను బలవంతంగా తీసుకుంటున్న సంస్థలపై భారీగా జరిమానా విధించాల్సిందిగా ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ, ఆస్ట్రియాకు చెందిన రెగ్యులేటర్లను ఈ బృందం కోరింది. జీడీపీఆర్ నిబంధనల ప్రకారం యూజర్ల గోప్యత విషయంలో అవకతవకలు జరిగితే ఆయా కంపెనీల వార్షిక ఆదాయంలో నాలుగు శాతం జరిమానా విధించాల్సిందిగా అడ్వకసీ గ్రూప్ కోరింది. దీనికి గనుక జీడీపీఆర్ అంగీకరిస్తే.. ఆయా సంస్థలపై దాదాపు 9 బిలియన్ డాలర్ల మేరకు జరిమానా పడనుంది. వీటిలో గూగుల్ మాత సంస్థ ఆల్ఫాబెట్‌కు 4.99 బిలియన్ డాలర్లు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌కు 1.63 బిలియన్ డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది.

English Title
Rs. 60 thousand Crore Fine to Google, Facebook
Related News