రూ. 600 కోట్ల నష్టం

Updated By ManamThu, 08/23/2018 - 01:51
aerial-survey
  • వరదలతో ఉభయ గోదావరుల్లో అల్లకల్లోలం.. మునిగిన వరిచేలకు హెక్టారుకు రూ. 25వేలు

  • కూలిపోయిన ఇళ్లకు రూ. 2 లక్షల పరిహారం.. రోడ్ల మరమ్మతులకు రూ. 35 కోట్లు మంజూరు

  • 6,400 హెక్టార్లలో తీవ్రంగా దెబ్బతిన్న పంటలు.. 195 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

  • ఎర్రకాలువ వరదతో పశ్చిమకు తీవ్ర నష్టం.. ఏరియల్ సర్వే అనంతరం సీఎం చంద్రబాబు

aerial-surveyరాజమహేంద్రవరం: భారీ వర్షాలు.. వరదల వల్ల ఉభయ గోదావరి జిల్లాలకు రూ. 600 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. బుధవారం ఆయన తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో వరద  ముంపునకు గురైన ప్రాంతాలను హెలికాప్టర్‌లో పరిశీలించారు. అనంతరం రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వరద ముంపునకు గురైన వరి చేలకు హెక్టారుకు రూ. 25 వేల చొప్పున పరిహారంగా ఇచ్చి రైతులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. వరదల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి, రైతులను అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. రెండు జిల్లాల్లో కలిపి దాదాపు 6,400 హెక్టార్ల పంట దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనాలలో తెలిసిందని అన్నారు. 195గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని, మరిన్ని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయని చెప్పారు.

పశ్చిమగోదావరి జిల్లాలో ఎర్రకాలువ పొంగి, 80 వేల క్యూసెక్కుల నీళ్లు రావడమే అక్కడి నష్టానికి ప్రధాన కారణమని సీఎం తెలిపారు. ఎర్రకాలువ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తగు చర్యలు తీసుకుంటావున్నారు. మూడు నాలుగు రోజులుగా గోదావరి వరదనీరు ఎక్కువగా వస్తోందని అన్నారు. బాగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 2 లక్షల వరకు పరిహారం అందించే యోచనలో ఉన్నామని.. ఈ విషయంలో అధికారులు సర్వే ద్వారా నిర్ణయాలు తీసుకుంటారని ఆయన చెప్పారు. రోడ్ల మరమ్మతులకు రూ. 35 కోట్లు మంజూరు చేశామన్నారు. లంక గ్రామాల ప్రజలను పూర్తిస్థాయిలో ఆదుకుంటామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఏటిగట్లను పటిష్ఠం చేసేందుకు అన్ని విధాల చర్యలు తీసుకున్నామని తెలిపారు. లంక గ్రామాల ప్రజలకు భద్రత గురించి ఆందోళన ఉందని, అలాగే కూరగాయలు పండించే రైతులు కూడా వరదల్లో నష్టపోయినందున వారికి కూడా ఆర్థిక సాయం అందించాలని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా 2019 మే నాటికి నీరు విడుదల చేసేందుకు నిర్మాణ పనులను వేగవంతం చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో జరగవలసిన పనులు సాధ్యమైనంత వరకు పూర్తిచేస్తామన్నారు. నదులను అనుసంధానం చేయడం ద్వారా లక్షలాది ఎక రాలకు సాగునీరు, తాగునీరు అందిస్తామన్నారు.

ఎప్పటికప్పుడు పోలవరం పనులు స్వయంగా పరిశీలిం చడంతో పాటు అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా చర్చిస్తున్నామని తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా 2019 నాటికి కనిగిరి తదితర  ప్రాంతాలకు నీరు ఇస్తామని ముఖ్యమంత్రి అన్నారు. వరదలు వచ్చినపుడు గోదావరి నీరు సముద్రంలో కలుస్తుందని, అలా కాకుండా వాటిని నిల్వచేయడానికి కొత్త నిర్మాణాల గురించి ఆలోచిస్తామని సీఎం చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో సూక్ష్మ సేద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. 34 ఎకరాలు ఈ తరహా సేద్యంలో ఉండగా, దాన్ని కోటి ఎకరాలకు పెంచేలా చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా కార్తికేయ మిశ్రా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో వరదల సమయంలో జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను వివరించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు.. గర్భిణులను ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి ఆహారం, మందులు ఇస్తామన్నారు. ఎర్రకాలువలోని నీరు అత్యంత వేగంగా పెరిగి నష్టం వాటిల్లిందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ అన్నారు. వరద బాధితులను శిబిరాలలో చేర్చి వారికి నాణ్యపరమైన ఆహారంతోపాటు వైద్యసదుపాయాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు చినరాజప్ప, జవహార్, మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రంపచోడవరం ఐటీడీఏ పీఓ నిశాంత్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.

English Title
Rs. 600 crores loss




Related News