ఐ.డి.బి.ఐ భవన కొనుగోలులో ‘సెబి’

Updated By ManamTue, 02/13/2018 - 19:13
 IDBI Bank’s Mumbai

 IDBI Bank’s Mumbai ముంబయి: భారతదేశపు అతి పెద్ద వాణిజ్య ఆస్తుల స్వాధీనాలలో దీనిని ఒకటిగా చెప్పుకోవచ్చు. ముంబయిలో ప్రధాన వాణిజ్య కూడలి బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బి.కె.సి)లో ఐ.డి.బి.ఐ బ్యాంకుకున్న ఏడంతస్తుల కార్యాలయ భవనాన్ని కొనుగోలు చేసేందుకు భారతీయ సెక్యూరిటీలు, ఎక్చ్సేంజ్ బోర్డు (సెబి) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆస్తి విలువ దాదాపు రూ. 1000 కోట్లు ఉంటుందని అంచనా. దీని కొనుగోలుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబి బోర్డు ఇటీవల ఆమోదం తెలిపినట్లు తెలిసింది. బి.కె.సిలోనే 2015 సెప్టెంబరులో  4.35 లక్షల చదరపుటడుగుల స్థలాన్ని ఎబాట్ ఇండియా రూ. 1480 కోట్లకు కొంది. కార్యాలయ వసతిగా వాడుకునేందుకు జరిగిన భారతదేశపు రెండవ అతిపెద్ద విలువైన లావాదేవీగా సెబి కొనుగోలును భావిస్తున్నారు. ఈ బేరంలో చదరపుటడుగు దాదాపు రూ. 30,000 పలికినట్లుగా  అభిజ్ఞ వర్గాలవారు చెబుతున్నారు. 3.41 లక్షల చదరపుటడుగుల బిల్టప్ ఏరియా కలిగిన ఐ.డి.బి.ఐ భవనం, సెబి కార్యాలయాలు ప్రస్తుతం ఉన్న బి.కె.సిలోని ‘జి’ బ్లాకులోనే ఉంది. ఈ బ్లాకును బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసుల కంపెనీలకు ప్రత్యేకించి కేటాయించారు. భారతదేశపు అతి పెద్ద స్టాక్ మార్కెట్ నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజ్ కూడా ఇదే బ్లాకులో ఉంది. దీనితో బి.కె.సిలో కార్యాలయ రియల్ ఎస్టేట్ యజమానులలో సెబి ఒకటి అవుతుంది. సెబి తన కార్యాలయ ప్రదేశాన్ని రెండింతలకు పైగా పెంచుకునేందుకు ఈ లావాదేవీ సహాయుపడుతుంది. రానున్న ఏళ్లలో ఈ మార్కెట్ల నియంత్రణ సంస్థ ఉద్యోగుల సంఖ్య కూడా పెరగవచ్చని భావిస్తున్నారు. షేర్లు, కమోడిటీ మార్కెట్ సంబంధిత లావాదేవీ ఫీజుల ద్వారా సెబికి ఆదాయం లభిస్తుంది. మార్కెట్‌లో తప్పులు చేసిన వారిని శిక్షించేందుకు వారి నుంచి జరిమానాలు కూడా అది వసూలు చేస్తూ ఉంటుంది. సెబి కొన్నేళ్ళుగా చాలా మెట్రో నగరాలలో కార్యాలయ వసతి భవనాలను కొనుగోలు చేస్తూ వస్తోంది. సిబ్బందికి అది 125కు పైగా అపార్టుమెంట్లు, అతిథి గృహాలు నిర్మించింది. సెబి వద్ద రూ. 1672 కోట్ల మేరకు మిగులు నిధులు పోగుపడడంతో వాటిని ప్రభుత్వ కోశాగారానికి జమ చేయవలసిందిగా ఇటీవల కోరారు. 

English Title
In ₹1,000-crore deal, SEBI buys IDBI Bank’s Mumbai property
Related News