2020వరకు ఆయనే ట్రాయ్ చైర్మన్

Updated By ManamThu, 08/09/2018 - 17:08
R.S.Sharma
Government reappoints RS Sharma as Trai chief

న్యూఢిల్లీ: ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) చైర్మన్‌గా ఆర్ఎస్ శర్మ మరోసారి నియమితులయ్యారు. ఆయనను ట్రాయ్ చైర్మన్‌గా మరో రెండేళ్ల పాటు కొనసాగించాలనే నిర్ణయాన్ని క్యాబినెట్ నియామక కమిటీ (ఎసిసి) గురువారం ఆమోదించింది. దీంతో ఆర్ఎస్ శర్మ ఈ పదవిలో  సెప్టెంబర్ 30, 2020వరకు కొనసాగుతారు. కాగా  ట్రాయ్‌ చైర్మన్‌గా ఆయన పదవీకాలం నేటితో ముగియనుంది. 2015 ఆగస్ట్‌లో తొలిసారిగా శర్మ ట్రాయ్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. 

కాగా సోషల్ మీడియాలో ఒకరు విసిరిన సవాల్‌కు స్పందిస్తూ తన వివరాలు బయటపెట్టాలని శర్మ ఆధార్‌ సంఖ్యను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ తర్వతా ఆయన బ్యాంక్ ఖాతా వివరాలతో పాటుగా, ఈ మెయిల్ సమాచారాన్ని హ్యాకర్లు ట్వీట్ చేయగా, మరికొందరు ఆయన బ్యాంక్ ఖాతలో ఒక రూపాయి జమ చేశారు.

దీనిపై స్పందించిన ఆధార్ అధికారులు.. ఆ వివరాలు యూఐడీఏఐ నుంచి సేకరించినవి కావని స్పష్టం చేశారు. గూగుల్, ఇతర పబ్లిక్ డొమైన్ల నుంచి శర్మ వివరాలను హ్యాకర్లు సంపాదించారని పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఆధార్‌ వల్ల తన వ్యక్తిగత సమాచారమేదీ బయటికి రాలేదని, అలా వెల్లడైనట్లుగా చెబుతున్న ఆ వివరాలను ఆధార్‌ లేకుండానే తెలుసుకోవచ్చని శర్మ పేర్కొన్నారు కూడా.

English Title
R.S.Sharma has been given two more years as head of TRAI
Related News