రూపాయి కష్టాలు మార్కెట్‌కు నష్టాలు

Updated By ManamTue, 09/04/2018 - 22:35
Sensex

Sensexముంబై: ఈక్విటీ గీటురాయి ‘సెన్సెక్స్’ పతనం వరుసగా ఐదో సెషన్‌లో మంగళవారంనాడు కూడా కొనసాగింది.  మూడు నెలల కాలంలో ‘సెన్సెక్స్’ ఇలా వరుసగా ఇన్ని రోజులు నష్టాలను మూటగట్టుకుంటూపోవడం ఇదే మొదటిసారి. పెరుగుతున్న ముడి చమురు ధరలు, క్షీణిస్తున్న రూపాయి, కొనసాగుతున్న ప్రపంచ వాణిజ్య ఘర్షణల రూపంలో అనేక వైపుల నుంచి ఆందోళనలు కమ్ముకోవడంతో స్టాక్ మార్కెట్లలో నిరాశ అలముకుంది. బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల ‘సెన్సెక్స్’ 155 పాయింట్లు నష్టపోయి, రెండు వారాల కాలంలో, బలహీనమైన ముగింపు (38,157.92)ను నమోదు చేసింది. ప్రధానంగా మన్నికైన వినియోగ వస్తువులు, ఫినాన్షియల్, బ్యాంకుల రంగ షేర్లలో విస్తృతంగా అమ్మకాలు చోటుచేసుకున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ కూడా వరుసగా రెండో సెషన్‌లో 62 పాయింట్లకు పైగా నష్టపోయి 11,520.30 వద్ద ముగిసింది. మంగళవారం అది పెద్ద పెరుగుదలను చూడలేదు. ఇంట్రా-డేలో అది 11,496.85 నుంచి 11,602.55 మధ్య ఊగిసలాడింది. విదేశీ ఫండ్ల పెట్టుబడులు స్థిరంగా తరలిపోతూండడం, ముడి చమురులు ధరలు పెరిగిపోతున్న ఫలితంగా పెరుగుతున్న కరెంట్ అకౌంట్ లోటు (ఎగుమతులకన్నా దిగుమతుల విలువ ఎక్కువగా ఉండడం) దేశీయ కరెన్సీ క్షీణించిపోవడానికి దారితీస్తూండడం ఇన్వెస్టర్లను కలవరపెట్టడం ఆపలేదు. 

పడిపోతున్న రూపాయి
కాగా డాలర్‌తో ఇంట్రా-డేలో రూపాయి విలువ సరికొత్త కనిష్ఠ స్థాయి రూ. 71.57కి క్షీణించింది. రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధ ఆవేశకావేషాల ప్రకటనలు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ సెంటిమెంట్లను మరింత దెబ్బతీశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు వినియోగ వస్తువులు, పి.ఎస్.యులు, మౌలిక వసతులు, రియల్టీ, ఎఫ్.ఎం.సి.జి, టెలికాం, ప్రజోపయోగ సర్వీసులు, విద్యుత్, లోహాలు, మోటారు వాహనాలు, ఆరోగ్య రక్షణ, బ్యాంకింగ్, చమురు, ఇంధన వాయువు, యంత్రాలు, యంత్ర పరికరాలు, ఫినాన్స్‌తో సహా దాదాపుగా అన్ని రంగాల్లోనూ ముమ్మర అమ్మకాలను వీక్షించాయి. ఆరంభ ట్రేడ్‌లో బి.ఎస్.ఇ ‘సెన్సెక్స్’ 206.04 పాయింట్లు పెరిగి 38,518.56 స్థాయిని తాకింది. కానీ, తర్వాత చోటుచేసుకున్న అమ్మకాలతో ఆ లాభాలన్నింటినీ కోల్పోయింది. గత నాలుగు సెషన్లలో ‘సెన్సెక్స్’ 584.11 పాయింట్లను కోల్పోయింది. 

ఆందోళన పెంచిన ‘అమ్రీ’
భారతీయ సెక్యూరిటీలు, ఎక్చ్సేంజి బోర్డు (‘సెబి’) మీ వినియోగదారు గురించి తెలుసుకోండి (కెవైసీ) నిబంధనలు కొత్త వాటిని రూపొందించింది. వాటిని కనుక సవరించకపోతే, 75 బిలియన్ డాలర్ల మేరకు ఉన్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల మొత్తం స్వల్ప కాలంలోనే దేశం నుంచి తరలిపోవడాన్ని చూస్తామని, కెవైసీ కొత్త నిబంధనల తక్షణ ప్రభావం అదే అవుతుందని అసెట్ మేనేజ్‌మెంట్ రౌండ్‌టేబుల్ ఆఫ్ ఇండియా (‘అమ్రీ’) అనే ఇన్వెస్టర్ లాబీ గ్రూప్ హెచ్చరించడంతో సెంటిమెంట్ బలహీనపడింది. విదేశీ ఫండ్లు షేర్లను అమ్మేసుకుని సొమ్ము చేసుకోవడం ఎక్కువైంది. షేర్లు, రూపాయిపైన కూడా అది తీవ్ర ప్రభావం చూపుతుందని కూడా ఆ సంస్థ హెచ్చరించింది. 

‘సెబి’ అభ్యంతరం
అయితే, ‘సెబి’ దీనిపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ‘‘‘సెబి’ 2018 ఏప్రిల్‌లో జారీ చేసిన సర్క్యులర్ వల్ల 75 బిలియన్ డాలర్ల ఎఫ్.పి.ఐ మదుపు మొత్తం దేశం నుంచి తరలిపోతుందని పేర్కొనడం అర్ధరహితం, అత్యంత బాధ్యతారహితం’’ అని ‘సెబి’ మంగళవారంనాడు ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు సోమవారం రూ. 21.13 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా, దేశీయ మదుపు సంస్థలు కూడా రూ. 542.12 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించాయని తాత్కాలిక డాటా తెలిపింది. 

దడ పుట్టిస్తున్న ముడి చమురు ధర
భారీ వర్షాలతో కూడిన పెను గాలులు సంభవించవచ్చనే హె చ్చరికలతో గల్ఫ్ ఆఫ్ మెక్సికో ప్రాంతంలో రెండు చమురు ప్లాట్ ఫారాలను ఖాళీ చేయించిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో చ మురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర 1.74 శాతం పెరిగి పీపాకు 79.51 డాలర్లకు చేరుకుంది. డబ్ల్యు.టి.ఐ ధర 2.05 శాతం పెరిగింది.

English Title
Rupee risk losses to market
Related News