అదే వ్యూహం!

Updated By ManamTue, 02/13/2018 - 03:43
bjp
  • వాళ్లు అక్కడ చేసిందే మనం ఇక్కడ చేద్దాం.. అసెంబ్లీలో టీడీపీకి చుక్కలు చూపాలి 

  • పూర్తిస్థాయి ప్రతిపక్ష పాత్ర పోషించాలి.. అసెంబ్లీ సమావేశాల్లో కమలం వ్యూహం

  • అవినీతి... అక్రమాలపై నిలదీయాల్సిందే.. విష్ణుకుమార్ రాజు.. వీర్రాజుల నేతృత్వం

  • ఉభయసభల్లో ఇరుకున పెట్టనున్న మిత్రపక్షం

bjpవిశాఖపట్నం: పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో... అదే పని రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ చేయనుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఆకస్మికంగా వ్యూహం మార్చి ప్రత్యేక హోదా, ప్యాకేజీల నినాదంతో కేంద్రంలో అధికారపక్షమైన బీజేపీని... మిత్రపక్షమైన తెలుగు దేశం పార్టీ ఇబ్బందులకు గురిచేసిన సంగతి తెలిసిందే. దాంతో మార్చి 5వ తేదీ నుంచి  ప్రారంభం కానున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ కూడా ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని అదే తరహాలో ఇరకాటంలో పెట్టేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. పార్లమెంటులో టీడీపీ నినాదం ప్రత్యేక హోదా, ప్యాకేజీ అయితే, ఇక్కడ బీజేపీ నినాదం కేంద్ర నిధుల దుర్వినియోగం, అవినీతి, అక్రమాలు. రాష్ట్రంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై ఇంతకాలం మిత్రపక్షంగా మౌనం దాల్చిన బీజేపీ.. ఇక పూర్తిస్థాయిలో ప్రతిపక్షపాత్ర పోషించాలని నిర్ణయించుకుంది. ఇటు శానససభ, అటు శాసనమండలిలలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడం ద్వారా దెబ్బకు దెబ్బ తీయాలని ఆ పార్టీ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. బీజేపీకి అసెంబ్లీలో నలుగురు, శాసనమండలిలో ఇద్దరు సభ్యులున్నారు. అసెంబ్లీలో బీజేఎల్పీ నేత పెన్మత్స విష్ణుకుమార్ రాజు నేతృత్వంలో, శాసనమండలిలో ఫైర్‌బ్రాండ్ నాయకుడు సోము వీర్రాజు నేతృత్వంలో అవినీతి, అక్రమాల ఆధారంగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రంగం సిద్ధమైంది. అన్ని అంశాలలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించే రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్‌ను పెద్దగా పరిగణనలోకి తీసుకోకుండా తన పని తాను చేసుకోపోవాలనే అభిప్రాయానికి బీజేపీ నాయకులు వచ్చినట్లు తెలిసింది.

కేంద్రం నుంచి వచ్చిందెంత.. ఖర్చు ఎంత?
గ్రామీణ రహదారులు, బహిరంగ మల. మూత్ర వసర్జన నిర్మూలన, స్వచ్ఛభారత్, పంచాయతీరాజ్ , గృహ నిర్మాణం, బీమా తదితర పథకాలకు కేంద్రం నుంచి ఈ నాలుగు సంవత్సరాల్లో వచ్చిన నిధులెన్ని, అందులో వినియోగమెంత అనే అంశాన్ని అసెంబ్లీ సాక్షిగా నిలదీయడానికి బీజేపీ సిద్ధమవుతోంది. ఈ వివరాలను ప్రభుత్వంతోనే చెప్పించి వాస్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేది పార్టీ  వ్యూహం. కేంద్రం మంజూరు చేసిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పరంగా జరిగిన లోపాలను అసెంబ్లీ వేదికగా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారు. వివిధ ప్రాజెక్టులకు డీపీఆర్‌లు సమర్పించకపోవడం, యుటిలిటీ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వంటివి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి జరిగిన లోపాలైనందున.. వాటిని ఎత్తిచూపాలన్న కోణంలో రాష్ట్ర బీజేపీ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందుకోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఇప్పటినుంచే సన్నద్ధం చేసే పనిని పార్టీ ప్రారంభించింది. సోమ వారం విజయ వాడలోని పార్టీ రాష్ట్ర కార్యాల యంలో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ నేతలు కేంద్రం నుంచి వచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ రాష్ట్ర ప్రభుత్వానికి మరోమారు సవాల్ విసిరారు. ముష్టి, భిక్ష వంటి పదాలు వాడటం మంచిది కాదని హెచ్చరించారు.

అవినీతి, అక్రమాలే అస్త్రాలు 
పోలవరం మినహా ఇతర సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జరిగిన అక్రమాలు, పంచాయతీరాజ్, గృహనిర్మాణం, ఆర్‌అండ్‌బీ, మైనింగ్, రెవెన్యూ, మున్సిపల్ శాఖలలో జరిగిన అక్రమాలపై బీజేపీ దృష్టి పెట్టనుంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన హంద్రీ - నీవా సుజల స్రవంతి, గాలేరు - నగరి ప్రాజెక్టుల అంచనాలను రెట్టింపు చేసి వందల కోట్లను దోచుకొన్నారని, పనులు ఏ మాత్రం ముందుకు సాగడం లేదని బీజేపీ నేతలు అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. రాయలసీమలో పెండింగ్‌లో ఉన్న ఇతర ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురౌతున్న తీరును కూడా ప్రస్తావించాలని నిర్ణయించారు. 

Tags
English Title
The same strategy!
Related News