తెలంగాణ తెలుగులో సంస్కృతం 

Updated By ManamSun, 03/11/2018 - 22:21
image

imageతెలుగు భాషకు ఒక సుగుణం ఉంది. అది చాలా చక్కగా వేలాది సంస్కృత పదాల్ని తనలో స్వాంగీకరణం చేసుకున్నది. తెలుగు భాషా భవనగవాక్షాలు అమరభాషా పవనాల రాకను హాయిగా అంగీకరించాయి. ఒక్క సంస్కృతమే కాదు. ప్రాకృతం, పారసీ, ఉర్దూ, ఆంగ్లం, కన్నడం, తమిళం మొదలైన భాషలకు చెందిన అనేక పదాలు తెలుగు స్వీకరించింది. ఇతరుల నుంచి ఎంత స్వీకరిస్తామో అంత సంపన్నులం అవుతాం. ఆ సంపన్నత తెలుగు భాషకు వుంది. ఈ స్వీకరణగుణం ఆంగ్లానికి అధికం. అందులో పాత ఆంగ్లపదాలతో పాటు ఆంగ్లో సాక్సన్, లాటిన్ గ్రీకు తదితర భాషల పద సంపద వుంది. అందుకే అది ప్రపంచభాష అయింది. ప్రపంచం లోని పలు దేశాల్ని పరిపాలించడం సైతం ఆంగ్ల భాషావ్యాప్తికి ఒక బలమైన కారణం.

తెలుగు భాషకు యితర భాషాపదాన్ని స్వీకరించే గొప్పగుణం వుంది కాబట్టే జేబిఎన్ హాల్డేన్ జాతీయభాష కాదగిన గుణసంపన్నత తెలుగుకే వుందని ఎలుగెత్తిచాటినాడు. అయితే, తెలుగులోకి సంస్కృ తం నుంచి వచ్చి చేరిన పదాలే ఎక్కువ. తెలంగాణ తెలుగులోనూ ఈ పదాలు తక్కువేమీ కాదు. అయితే ఆ సంస్కృతం మాటలు కొం త రూపం మారివుంటాయి. యథాతథంగా వున్నప్పుడు తత్సమాలు అని పిలుస్తాం. (ప్రాకృతసమాలూ తత్సమాలే!). పదం కాస్త మారితే తద్భవాలూ అంటున్నాం (ప్రాకృతానికీ వర్తిస్తుంది). సాధారణంగా సామాన్య ప్రజానీకం మాట్లాడే మాటల్లో తద్భవాలు అధికం. 

‘ఏమి ఆకారంరా నీది?’ అనే ప్రశ్నలోని ‘ఆకారం’ సంస్కృతమే! సంస్కృతభాషలో ‘ఆటోపం’ అనే ఒకపదం వుంది. దీనికి వేగిరపాటు అని అర్థం. అయితే ఈ రూఢ్యర్ధాలు భాషలో మారిపోయి అప్పుడ ప్పుడు వేరే అర్థాలు రావడం కద్దు. ఆటోపానికి పలు కలిసి ‘పటా టోపం’ అవుతుంది. దీని అర్థం ఆడంబరం, దంభం అని. ఈ పటా టోపం పదం తెలంగాణ ప్రజల వ్యవహారంలో ‘పటాతోపం’ అవు తుంది. ‘ఓ! వాని పటాతోపమే వేరు. పెద్ద బంగ్ల కట్టిండు. ఇంటి ముందర కారు. ఇద్దరు పనిమనుషులున్నరు. మంచి పోషాకు వున్నది (బట్టలు మొదలగు వేషధారణ)... ఈతీరు మాటల్లోని ‘పటాతోపం’ సంస్కృత పటాటోపం నుంచి వచ్చింది.

ఇంక ‘ఆత్మ’ అనే పదం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ఆత్మ సంస్కృతమే! తెలంగాణలో చాలా ఆత్మీయంగా వున్న పలుకుయిది. ‘వానికి ఆత్మ కొట్టుకుంటది చుట్టాల మీద’ అనే వాక్యంలోని ‘ఆత్మ’ అంటే దయగల హృదయం స్పందిస్తుంది అని. ‘వీనిది ఆత్మగల్ల పు ట్క’ అంటే ఎంతో ఆత్మీయతా, ఆప్యాయత కల్గిన మనిషిజన్మ అని అర్థం. అట్లే ‘ఆ తల్లిది ఆత్మగల్ల చెయ్యి’ అనే వాక్యంలోని ‘ఆత్మ’కు దానగుణం కల్గిన, వితరణశీలం వున్న ఉదారహస్తం అని అర్థం. ‘వాడి చేతికి ఎముక లేదు’ అని దానధర్మాల సందర్భంలో ఆధునిక ప్రమాణభాషలో వాడినట్లుగానే, తెలంగాణలో ‘ఆత్మగల్ల చెయ్యి’, పెద్ద చెయ్యి అనే అభవ్యక్తులున్నాయి. తెలంగాణలో ‘ఆత్మ’కు ప్రేమ అనే అర్థం కూడా వుంది. వారంలో ఏడు రోజులుంటాయని అందరికీ తెలుసు. మొదటి వారం ‘ఆదివారం’ కదా! దీనికి మరోపేరు ‘ఆదిత్య వారం’ (భానువారం కూడా వుంది). ఈ ఆదిత్యవారాన్ని తెలంగాణ వాసులు కొందరు ‘అయితారం’ అంటుంటారు. ‘ఆదిత్యవారం’లోని ‘వా’లోని ‘వ్’ పోయింది అయితారంలో ‘వా’లోని ‘ఆ’ అలాగే అయి తారంలోని ‘తా’తో మిగిలింది. అయితే ‘ఆదిత్య’లో వున్న యావత్తు పోయింది. ఆదిత్యలోని ‘ఆ’ హ్రస్వ ‘అ’కారంగా ఆదిలో అంటే మొదట నిలిచింది. ఆదిత్యలోని ‘ది’యిగా అవతారమెత్తింది. ప్రజలు పదాల్ని తమకు అనుకూలంగా వుండేందుకు అనేక అవతారాలు ఎ త్తింపిస్తారు. మరి ఆదిత్యలోని ‘ది’ ‘యి’గా మారవచ్చా? వచ్చు. ‘పదిలం’ అనే పదాన్ని మనం ఎంత పదిల పరిచినా అది తెలంగాణ లో ‘పయిలం’ కాలేదు! ఇరు+పది అనే సంధిలో ఇరు+పయి అయి పిదప ఇరువయి అవలేదా తెలుగు భాషలో. ముప్పది, నలుబది, ఏబది, అరువది మొదలైన ఎన్నో ముప్పయి, నలుబై, ఏబయి, అరవైలుగా మారలేదా తెలుగులో. అటువంటి అనేక పరిణామాల ఫలితంగా ఆదిత్యవారం ‘అయితారం’ అయికూచుంది. అయితేనేం. అది భావప్రకటనకూ, గ్రహణకూ పనికొస్తున్నది. మొదట భాషా లక్ష్యం అదేకదా! ‘ఆపతికి సంపతికి అందుతదని మా పొల్లును దగ్గ రోల్లకు యిచ్చి లగ్గంచేసినం’, ‘ఆపతికి రానోల్లు మనోల్లు ఎట్లయిత రు?’ మొదలైన వాక్యాల్లోనే ‘ఆపతి’ పూర్తిగా సంస్కృతంలో ‘ఆపత్తి’ అంటే విపత్తి, ఆపద. ఆపత్తిలోని చివరి తావత్తు తెలంగాణలో ఊడి పోయింది. అయినా అర్థానికి ఏ ఆపదా రాలేదు. ఒక్క తావత్తు లోపిస్తే కొంప లేమీ అంటుకొని పోవు. యావత్తూ (మొత్తం) లోపించి మూలపదం మారితేనే ఆపద భాషకు. సంస్కృతభాషలోని ‘ఆయువు, ఆయుష్యము, ఆయుస్సు’ అనే పదాలకు జీవితకాలం అని అర్థం. తెలంగాణలో ‘ఆయుషు’ వున్నంత కాలమే బతుకుతరు అనే మాట వుంది. కొన్ని ప్రాంతాల్లో ‘ఆయుష్షు’ కూడా చలామణిలో వుంది. సంస్కృత ‘ఆయుస్సు’లోని సకారం తెలంగాణలో ‘ష’గా మారింది. ఇంకా కొంతమంది ‘ఏదైనా ఆవుసున్నంతవరకే తియ్యిండ్రి’ అంటుంటారు. ఈ పదంలో సకారం చక్కగా నిలిచివుంది. కాకుంటే ‘యు’ ‘వు’గా మారివుంది. ‘ఆయుస్సు’ను ‘ఆయుస్సు’ లాగే పలికేంత తీరికా, ఓపికా సామాన్య జనానికి లేవు.  వ్యవసాయ పనుల్లో పందిరి గుంజలకు కూడా పనిచేప్పే చెమట ప్రాణులు, పదాల్ని వున్నవి వున్నట్లుగానే పలికేంత వ్యవధిని ఎక్కణ్ణించి తెచ్చుకో గలరు? అందుకే వాళ్ళనోట ‘ఆలస్యం’ ఏ ఆలస్యం లేకుండా ‘ఆలిశెం’గా మారిపోతుంది. సంస్కృతభాషలోని ‘ఆలాపము’ తెలంగాణలో ‘ఆలాపన’ అవుతుంది. ఆలాపం అంటే రాగాన్ని ఆలపించడం. తెలంగాణలో ‘ఆలాపన’ పాట కచేరీకి సంబంధితం కాదు. వానికి ఒక్కటే ఆలాపన. ఆ పిల్లను బమిసిండు (ప్రేమించాడు). ఆరు నూరైనా నూరు ఆరైనా ఆమెనే చేసుకుంటడట! నితై ఆ పిల్లమీదనే ఆలాపన...ఇటువంటి వాక్యాల్లోని ‘ఆలాపన’కు అర్థం ఎల్లకాలం ఒకే విషయం గురించి ఆలోచించడం - ధ్యాస పెట్టడం. సంస్కృత ‘ఆశీస్సు’ తెలంగాణలో ‘ఆశీర్వచనం’గా మారింది. మామూలు జనం ‘తమరు మా పిల్లగానికి ఆశీర్వచనం యిస్తే మంచిగైతది పంతులూ!’ అనే తీరు వాక్యం వింటాం. ‘ఆశీః’, ‘ఆశీస్సు’ మొదలైనవి బాగా చదువుకున్న వాళ్ళు రాస్తారు- మాట్లాడుతారు- దీవిస్తారు. ‘ఆశ్లేషము’ అనేది ఒక నక్షత్రం పేరు. ఇది సంస్కృత అకారాంత పుంలింగ నామవాచకం. తెలంగాణలో చాలా చిత్రంగా అది ‘అసలేరు’ అయింది. ‘శ్లే’ అనే సంయుక్తం ‘సలే’ గా విభక్తం అయిం ది. మూలపదంలో లేని ‘ఏరు’ను తమ మాటలోకి తెచ్చుకున్నారు. ‘అసలేటి ముసలెడ్లు కట్టుకొని’ అనే అంజన్న పాట అందరికీ తెల్సిందే! సంయుక్తాక్షరాల్ని అయితే ద్విత్వాలుగా మారుస్తా రు ప్రజలు, లేదూ విడగొడతారు. వాళ్ళకు కావాల్సింది అనుకూల్యం. అభిప్రాయ సంగ్రహణమే కాక ప్రకటనం. ‘ఈ పోరనికి ఇంద్రియం బాగపోతుంది. ఏం రోగమో పాడో మరి!’ వాక్యంలోని ఇంద్రియం అంటే పంచేంద్రియాల ముచ్చట కాదు. ‘ఇంద్రియం’ సంస్కృత ను డి. దీనికి అర్థాలు అనేకం. అందులో ఒకటి రేతన్సు, వీర్యం అని. అ దే అర్థంలో బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజలు ఆ పదానికి ఏ ఆపదా రానివ్వకుండా వాడడం విశేషం. ‘ఇచ్ఛ’ అంటే కోరిక, కాంక్ష, వాంఛ, సంస్కృత భాషాపదమే యీ ఇచ్ఛ. ఈ ‘ఇచ్ఛ’ తెలంగాణ ప్రజావ్యవ హారంలో అద్భుతంగా వుంది. ‘ఇగో చూడుండ్రి నా ఇచ్చ నేను పోత. మీ యిచ్చ మీరు పోండ్రి’ అని అన్నప్పుడు నా దారిలో నా మానాన, నా సందాన (చందం) నేను పోతాను- మీ బాటలో మీరు వెళ్ళండి అని సారాంశం. అయితే ఈ తెలంగాణ ‘ఇచ్ఛ’కు సంస్కృత పదార్థా లు కూడా వున్నాయి. నీ బాటలో నీవు వెళుతున్నావంటే నీ కోరిక, వాంఛ మేరకే వెళతావు కదా! ఎవరి కోరికల మేరకు వారు వారి దారుల్లో వెళతారు. తెలంగాణలో ఈ ‘ఇచ్ఛ’ పదం బహుళంగా వ్యవహారంలో వుంది. తెలంగాణ వంట యింట్లో కూరగాయలు తరిగేందుకు తప్పని సరిగా ‘ఈలపీట’ వుంటుంది. దీన్నే ఆధునిక తెలుగు ప్రమాణ భాషలో ‘కత్తిపీట’ అంటారు. రెండూ ఒక్కటే!  ‘ఈ లపీట’ అనగానే, అది అపశబ్దం అన్నట్లు హేళనగా చూడటమే చిక్కు. భాషలో ఏ ప్రాంతం వాళ్ళు వాడుతున్న పదమైనా ప్రతిదీ సాధువే! ఒకటి ఎక్కువా, మరోటి తక్కువా కాదు. మరి ‘ఈలపీట’ ఆధారం ఏమిటి? అది సంస్కృతంలోని ‘ఈళిక’ నుంచి వచ్చింది. ఆ పదానికి అర్థం కత్తిపీట, చురకత్తి అనే! వంటింటికి పరిమితం అయినది మాత్రం కత్తిపీట. ఈలపీట సైతం కత్తిలాంటి సముచిత పదం. ‘వాడికి పూనకం వచ్చింది. వీనికి దేవుడు పూనిండు. దానికి సిగం వచ్చింది’ మాటల్లో వ్యక్తులకు దేవుడు లేదా దేవత ఆవహించడం. తెలంగాణలో పూనకం అనరుగానీ సిగం అంటుంటారు. ఈ సిగానికి సంస్కృతంలోని ‘శివం’ ఆధారం. ఇంతేగాక కొన్ని ప్రాంతాల్లో ‘వానికి ఉగ్రం వచ్చింది’ అని వ్యవహరిస్తారు.‘ఉ గ్రం’ సంస్కృతపదం. ఇది ఆకారాంతం స్త్రీలింగం. దీనికి అర్థం భయంకరం అని. 

‘వీడు ఉచితార్థంగ పైసలన్ని పాడుచేసుకున్నడు’ వాక్యంలోని ఉచితార్థం మొత్తం సంస్కృతమే! ఉచితము అంటే తగినది అని అ ర్థం. తెలంగాణలోని ‘ఉచితార్థంగ’ అంటే అనవసరంగా అని భావం. ఉచితార్థంలోని అర్థం అంటే కొరకు అని అర్థం. అంటే ఉచితం కోసం, ఉత్తుత్తిగనే, వట్టిగానే, అనవసరం గానే అనే అర్థచ్ఛా యలున్నాయి యిక్కడ. ‘ఉత్తర’ అనేది ఆకారాంత స్త్రీలింగ సంస్కృత పదం. దానికి తెలుగు భాషలోని ‘ము’ ప్రత్యయం చేరి అది కాస్తా ‘ఉత్తరము’ అవుతుంది. ఇక దానికి అర్థాలు ఉత్తరపు దిక్కు, రేఖ మొదలైన అర్థాలు అందరికీ ఎరుకైనవే! ఇక్కడ మరొకమాట ఉత్తరానికి సంబంధించి. ‘వాడు అప్పటి నుంచి ఉత్తరిస్తనే లేదు’ అనే తెలంగాణ భాషా వ్యవహారంలోని ‘ఉత్తరి చ్చుడు’ అంటే జవాబు చెప్పడం, ప్రత్యుత్తరం యివ్వడం, మాట కదపడం, మారుమాట మాట్లాడటం వంటి అర్థస్ఫురణలు అనేకం.

‘ఊరికి ఉప్పులం పుట్టినట్లు మోపు అయిండువీడు’ ఇందులోని ఉప్పులం ఏమిటి? అది కుక్కగొడుగు. చేతివేళ్ళ ఆకృతిలో భయం గొల్పేరీతిలో వుంటుంది. అది పెరట్లో మొలిస్తే అరిష్టం అని ప్రజల నమ్మకం. ఊరికి ఎవరైనా చేటుకల్గించే పనులు చేస్తున్నప్పుడు పై వాక్యప్రయోగం వుంటుంది. మరి ఈ ‘ఉప్పులం’ ఎక్కణ్ణించి వచ్చిం ది. సంస్కృతంలో ‘ఉత్పలం’ వుంది అంటే కలువ అని అర్థం. కలు వకు వున్న రేకుల్లాంటివే ఉప్పలానికీ వుండటం చేత ఆ మాట ఆవిర్భ వించేందేమో ఆలోచించవలసి వుంది. పైగా మారోమాట సంస్కృతం లోనే వుంది. అది ‘విప్లవం’ సమూలమై మార్పే విప్లవం. ఈ ‘విప్ల వం’ నుంచి కూడా తెలంగాణ ‘ఉప్పులం’ అయ్యే పరిస్థితి వుంది. బహుశః విప్లవమ్మీద సదభిప్రాయం లేకపోవడం మూలాన చేటు కల్గించే వ్యక్తిని చూసి ‘ఉప్పులం పుట్టినట్లు పుట్టిండు’ అని వుంటారు. ఇంకా ‘ఉప్పు తింటే ఉష్టం - పప్పు తింటే పైత్యం’లోని ఉష్ణం సం స్కృతమే! ‘ఉపాయం లేనోడు ఉపాసం ఉంటుడు’లో వున్న ఉపాయ ఉపాసాలు సంస్కృతమే! ‘కొద్దిగ నీతో మాట్లాడితే నాకు ఉప శాంతి’లోని ఉపశాంతి అమరమే! బండినిపైకి లేపే జాకీ వంటి పరికరం తెలంగాణలో ‘ఉపకారి’గా పిలవబడుతుంది. ఉపకారి సైతం గీర్యాణమే! ‘ఉదార్నానికి చెప్పుతున్నగని’, ‘ఇగ వాడు వుద్దరిస్తడు’, ‘ఉద్ధార్కం అయినట్లే’ వాక్యాల్లోని ఉదాహరణం, తిద్ధరించు, తిద్ధారకం సంస్కృతపదాలు. ఉద్ధరించు, ఉద్ధారకం తెలంగాణలో నకారాత్మకంగా ప్రయుక్తం కావడం ప్రత్యేకత.

image
 

 

 

-డాక్టర్ నలిమెల భాస్కర్

English Title
Sanskrit in Telangana Telugu
Related News