సౌదీ అకృత్యం

Updated By ManamSat, 10/20/2018 - 03:25
Saudi

imageయెమెన్‌లో ‘మానవతా విపత్తు’ సృష్టించి ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత ఎదు ర్కొంటున్న సౌదీ అరేబియా జర్నలిస్టు జమాల్ ఖుషోగ్గీ హత్యోదంతంతో మరింత అప్రతిష్టకు గురయింది. అక్టోబర్ 2వ తేదీన ఇస్తాంబుల్‌లోని సౌదీ రాయబార కార్యాలయానికి వెళ్లిన ఖుషోగ్గీ అదృశ్యమైన మిస్టరీ ఎట్టకేలకు సౌదీ అధికారులే అతన్ని హత్య చేశారని టర్కీ దర్యాప్తు బృందాలు నిర్ధారిస్తుండడం అంతర్జాతీ యంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దాంతో ఇరు దేశాల మధ్య దౌత్య సం బంధాలు మునుపెన్నడూ లేనంతగా ఘోరంగా దెబ్బతినడమే కాక సౌదీ దౌత్య సంక్షోభంలో కూరుకుపోయింది. త్వరలో జరగనున్న ‘సౌదీ మదుపుల సదస్సు’లో పాల్గొనేందుకు అమెరికా, బ్రిటన్ దేశాలు నిరాకరించడమేకాక, డచ్, ఫ్రాన్స్ సహా పలు దేశాలు, గోల్డ్‌మన్ సాక్స్, పెప్సీ, ఈడీఎఫ్‌లు కూడా ఈ సదస్సు నుంచి తప్పుకోనున్నాయి. సౌదీలోని రాచరిక పాలన ఇటీవల మరింత క్రూరంగా తయా రు కావడంతో సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ నియమిత రహస్య హంతక ముఠాల సారథ్యంలో అసమ్మతివాదుల అపహరణలు, హత్యలు, అదృ శ్యాలు పెరిగిపోయిన నేపథ్యంలో జర్నలిస్టు ఖుషోగ్గీ హత్య అత్యంత క్రూరంగా జరిగింది. భౌగోళిక రాజకీయాల్లో అత్యంత నమ్మదగిన భాగస్వామిగా ఉన్న సౌదీ అరేబియాను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించడమే కాకుండా, ‘మృత్యు రాకుమారుడు’గా సల్మాన్‌ను విమర్శించాడు. ‘టర్కీలోని తమ కాన్సులేట్‌లో ఏం జరిగిందో తనకు తెలియదని’ ట్రంప్‌కు సౌదీ యువరాజు బిన్ విన్నవించుకోవడం హాస్యాస్పదం. అరబ్ ప్రపంచంలో అమెరికా ప్రయోజనాలకు, వ్యూహాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న సౌదీ అరేబియా ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి ఇంటా, బయటా ఫాసిస్టు ధోరణితో వ్యవహరి స్తోంది.

గతంలో వివాహమాడిన మహిళ నుంచి విడాకుల ధ్రువపత్రం కోసం జమాల్ ఖుషోగ్గీ తనకు కాబోయే భార్యను వెంటబెట్టుకుని టర్కీలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయానికి వెళ్లి అదృశ్యమయ్యాడు. అయితే ఖుషోగ్గీ పెళ్ళి చేసు కోబోయే మహిళ కార్యాలయం బయటే వేచి ఉండడంతో, ఆమె ద్వారా ఖుషోగ్గీ హత్యోదంతం బయట ప్రపంచానికి పొక్కింది. ఖుషోగ్గీని సౌదీ ప్రభుత్వ హంతక దళం హింసించి హత్య చేసిందనీ, ఆయన శరీరాన్ని ముక్కలు చేసి బయటకు తర లించిందన్న ఆరోపణలున్నాయి. వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్టు ఖుషోగ్గీకి సౌదీ రాచ కుటుంబంతో సుదీర్ఘకాలంగా సంబంధాలున్నాయి. సంపాదక స్థాయిలో పనిచేసి నందున మీడియా ప్రముఖలతోనే కాకుండా, సమాజంలోని భిన్నవర్గాలతో ఆయ నకు విస్తృత సంబంధాలున్నాయి. సౌదీలోనే కాకుండా అరబ్ అభ్యుదయవాదుల తోనూ, పాశ్చాత్య మేధావులతోనూ అంతర్జాతీయంగా మంచి సంబంధా లుండ టమే కాకుండా ట్విటర్‌లో ఆయనకు ఇరవై లక్షల మంది అనుయాయులున్నారు. మృత్యు రాజకుమారుడు బిన్ ఫాసిస్టు చర్యలకు, విధానాలకు వ్యతిరేకంగా ఆయన తన రచనల్లో తరచూ ఎండగట్టేవారు. యెమెన్‌లో మానవతా సంక్షోభం, లెబనాన్‌తో ఘర్షణలు, ఖతార్‌పై పగ సాధింపులు, మహిళా హక్కుల ఉద్యమ కారిణిని నిర్బంధించడం వంటి నియంతృత్వ పోకడలను ఆయన తీవ్రంగా విమర్శి స్తుండడం వల్ల సౌదీ పాలకులు ఇంతటి ఘాతుకానికి పాల్పడినట్లు కొన్ని ఆధా రాలు బయటపడ్డాయి. ఖుషోగ్గీ అదృశ్యంపై నిష్పాక్షిక విచారణ జరిగే విధంగా అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తీసుకురావాలి. అయితే సౌదీ యువరాజు సల్మాన్ అణచివేత విధానాలకు ట్రంప్ వత్తాసు ఉన్న నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు ఏ మేరకు స్పందించగలవన్నది అనుమానమే. సౌదీ చర్యలు గత కొంతకాలంగా ప్రపంచ దేశాలకు కొరుకుడుపడని విధంగా ఉండటానికి అమెరికా మద్దతే ప్రధాన కారణం. 2003లో అసమ్మతివాదిగా ముద్రపడి, జెనీవాలో తలదాచుకుంటున్న సౌ దీ రాజకుటుంబాలకు చెందిన ప్రిన్స్ సుల్తాన్ బిన్ తుర్కిని అపహరించి, తమ దేశానికి తరలించి శిక్షించడం, లెబనాన్ ప్రధానిని తమ దేశానికి అతిథిగా ఆహ్వా నించి, నిర్బంధించి రాజీనామా ప్రకటన చేయించడంపై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో సౌదీ ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గింది.

2011లో అరబ్ విప్లవం ఉనికిలోకి వచ్చిన నాటి నుంచి సౌదీ రాజకుటుం బానికి, టర్కీ అధినేత ఎర్డొగాన్‌కు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ-దుబాయ్), ఈజిప్టులలో అసమ్మతిని రెచ్చగొట్టేందుకు, ముస్లిం బ్రదర్‌హుడ్ సంస్థకు టర్కీ సహాయ సహ కారాలు అందిస్తోందని సౌదీ రాజకుటుంబం భావిస్తోంది. ఇదేవిధమైన ఆరోపణ లతో ఖతర్‌పై కక్షసాధింపు చర్యలకు పాల్పడిన విషయం విదితమే. అదేవిధంగా 2016లో తనకు వ్యతిరేకంగా జరిగిన విఫల సైనిక తిరుగుబాటుకు కారణం సౌదీ అరేబియానే అని టర్కీ అధ్యక్షుడు ఎర్డొగాన్ భావిస్తున్నారు. దానికి తోడు  మధ్య ఆసియా ప్రాంతంలో జరుగుతున్న అంతర్యుద్ధాల్లోని పరస్పర విరుద్ధ శక్తుల పక్షం వహిస్తున్నాయి. తన మిత్రపక్షాల మధ్య ఏర్పడిన ఈ వైషమ్య స్థితిని పరిష్క రించేందుకు అమెరికా రంగంలోకి దిగింది. టర్కీ, సౌదీ దౌత్య యుద్ధం ఇరాన్‌కు లాభించకూడదన్న లక్ష్యంతో అమెరికా పావులు కదుపుతోంది. రాజరిక కుట్రలు, హత్యలు బైజాంటిన్ రిపబ్లిక్ సంప్రదాయంలోనే కాకుండా, అంతర్యుద్ధ అగ్ని గుండంగా మారిన మధ్య ఆసియాలో ఇలాంటి అకృత్యాలు, అదృశ్యాలు సర్వసా దారణంగా మారాయి. పౌర హక్కులు, మీడియా హక్కులు సహా సకల ప్రజా స్వామిక సంప్రదాయాలు ఆవిరవుతున్నాయి. భౌగోళిక ఆర్థిక, రాజకీయ సమీ కరణలకు, స్థానిక నిరంకుశ రాజ్యాలకు వ్యతిరేకంగా సౌదీ అరేబియా, దుబాయ్ తదితర దేశాల్లో మరో అరబ్ విప్లవం మొలుచుకు వచ్చి, అది సమగ్ర, నూతన ప్రజాస్వామిక ఉద్యమ స్థాయికి రూపాంతరం చెందితేనే అరబ్ ప్రజలకు ఉపశ మనం లభించగలదు. 
 

English Title
Saudi unruly
Related News