భయ వినోదం

Updated By ManamSat, 09/22/2018 - 00:46
Hanging bridges
  • వేలాడే వంతెనల సవాలు

Hanging bridges

 

 

 

 

 

తీగలకు వేలాడే డెక్ మీద నిలుచోవడం అంటే ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని, అడుగు తీసి అడుగు వేయడానికి సాహసం చేయాల్సిన భయానక అనుభవమే కదా! అలాంటి అనుభవాన్ని మనకు పరిచయం చేసేవే ‘వేలాడే వంతెనలు’. అయితే భయం కూడా ఒక్కోసారి మనోల్లాసాన్ని కలిగిస్తుంది, కాబట్టే దెయ్యాల సినిమాలకు ఈ భూమ్మీద ఇంకా జనాదరణ తగ్గడం లేదు. అలాంటి భయాల్లో కొన్ని అందమైనవి కూడా ఉంటాయి. వేలాడే వంతెనలు కూడా మనకు అలాంటి అందమైన భయాన్నే పరిచయం చేస్తాయి. ప్రపంచంలో భయపెట్టే కొన్ని వేలాడే వంతెనల గురించి మనమిప్పుడు తెలుసుకుందాం. జాంగ్జియాజీ గాజు వంతెన: చైనా లోని హూనన్ ప్రాంతంలో జాంగ్జియాజీ జాతీయ అటవీ ఉద్యానవనానికి సమీపంలో ఈ జాంగ్జియాజీ గాజు వంతెన ఉంది. భూమికి వెయ్యి అడుగుల ఎత్తున 20 అడుగుల వెడల్పుతో నిర్మించిన ఈ గాజు వంతెన 1410 అడుగుల పొడవు ఉంటుంది. అయితే వెయ్యి అడుగుల ఎత్తున కాళ్ళ కింద గాజు మాత్రమే ఉండే ఈ వంతెన మీద నిలబడి ప్రకృతి అందాల్ని తిలకించడమంటే, కొద్దిగా గుండె గుభిల్లుమనే విషయమే కదా! అదీకాక ఈ గాజు వంతెన మీద ఒకేసారి 800 మంది నిలుచోవచ్చు. ఏ క్షణాన కాళ్ళ కింది గాజు పుటుక్కుమంటుందోననే భయం వెన్నాడుతుండగా, దీని మీద నిలబడి ప్రకృతి అందాల్ని తిలకించడమంటే, అదొక చిత్రమైన అనుభూతే!  ఇజ్రేలీ ఆర్కిటెక్ట్ హైమ్ డోటన్ డిజైన్ చేసిన ఈ వంతెనకు స్ఫూర్తి ఏదో తెలిస్తే ఆశ్చర్యంగానే ఉంటుంది. ప్రముఖ హాలీవుడ్ చిత్రం ‘అవతార్’ స్ఫూర్తితో ఈ వంతెనను డిజైన్ చేసారు హైమ్ డోటన్. పారదర్శకమైన గాజు ఫలకాల నుంచి మీరు మీ కాళ్ళ కింద ప్రవహించే నదుల్ని, చుట్టూ విస్తరించిన పర్వతాల్ని, లోయల్ని, జలపాతాల్ని చూడవచ్చు. ఈ వంతెన మీదికి 2016 నుంచి సందర్శకుల్ని అనుమతిస్తున్నారు. గుండె జబ్బులు ఉంటే మాత్రం ఈ వంతెన మీదికి వెళ్ళే సాహసం చేయవద్దని నిపుణుల సూచన.

image

హోంగయూ బ్రిడ్జి: చైనాలో షిజియాఝాంగ్ ప్రాంతంలోని మరో వంతెన కూడా గాజుతో నిర్మితమైందే. దీన్ని హోంగయూ బ్రిడ్జి అంటారు. దీని పొడవు 1,600 అడుగులు. ఇది ఈశాన్య చైనాలోని హెబీ జిల్లాలో ఉంది. గాజు ఫలకాలతో నిర్మించిన ఈ వేలాడే వంతెనను సందర్శించడానికి ప్రతిరోజూ 600 మంది సందర్శకులు వస్తుంటారు. భూమికి 715అడుగుల ఎత్తులో ఉండే ఈ వంతెన నెమ్మదిగా ఊగుతుంది కూడా! దీంతో దీని మీద నిలబడిన వారికి చిన్నపాటి గగుర్పాటు కలుగుతుంది. వంతెన తాలూకు గాజు ఫలకాలకు ఎలాంటి హాని జరుగకుండా ఉండేందుకు వంతెన మీదికి వచ్చే వారికి ప్రత్యేకమైన ‘షూ గ్లోవ్స్’ను కూడా ఇస్తారు. ఈ వంతెనను 2017లో ప్రారంభించారు. కాపిలానో వేలాడే వంతెన: కొలంబియాలోని ఉత్తర వాంకోవర్‌లో ఉన్న కాపిలానో వేలాడే వంతెనను 1889లో నిర్మించారు. కాపిలానో నది మీద 230 అడుగుల ఎత్తున ఈ వంతెనను నిర్మించారు. ఈ వంతెనను తొలుత 1889లో జనపనార, దేవదారు చెక్కతో నిర్మించినప్పటికీ, అనంతర కాలంలో జనపనార, చెక్కల స్థానంలో లోహపు తీగలు, కాంక్రీటు నిర్మాణాలతో వంతెనను ఆధునికీకరించారు. అయితే ఈ వేలాడే వంతెన తీవ్రమైన ఊగిసలాటకు గురవుతూ ఉంటుంది. దీంతో దీని మీద నిలబడడమే ఒక సాహసయత్నంగా మారుతుంది. ఈ విచిత్రమైన అనుభూతి కోసమే ఈ వంతెనను నిత్యం కొన్ని వందల మంది సందర్శిస్తుంటారు. 

స్ట్రామ్స్ రివర్ వేలాడే వంతెన: పేరులో ఉన్నట్టుగానే ఈ వంతెన మీద నడవడం అంటే ఒక పెనుతుఫాను మీద నడవడం కిందే లెక్క. ఎందుకంటే దీని మీద నడుస్తున్నపుడు హిందూ మహాసముద్రపుటలలు మీ పాదాల్ని ముద్దాడుతుంటాయి. తిత్సికమా జాతీయ ఉద్యానవనానికి సమీపంలో స్ట్రామ్స్ నది మీద ఈ వంతెనను నిర్మించారు. దక్షిణాఫ్రికా తూర్పుద్వీపంలో నిర్మించిన ఈ స్ట్రామ్స్ రివర్ వేలాడే వంతెన పొడవు 252 అడుగులు. దీనిని 1969లో నిర్మించారు. హిందూ సముద్రం మీద 20 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ వేలాడే వంతెన మీద నడిచేటపుడు మీ కాళ్ళు ఉప్పు నీటితో తడిసి పోయి, మీ పాదాలకు ఉప్పు అంటుకుని ఉంటుంది. హౌరా బ్రిడ్జి: ప్రపంచంలో భయపెట్టే వేలాడే వంతెనల్లో మన కలకత్తాలోని హౌరా బ్రిడ్జి కూడా ఒకటి. పశ్చిమబెంగాల్ జంటనగరాలైన కోల్‌కతా, హౌరాలను కలుపుతూ హుగ్లీ నది మీద 1943లో నిర్మించిన వేలాడే వంతెన ఇది. మనదేశంలో అత్యంత భారీ వంతెన ఈ హౌరా బ్రిడ్జి. విశ్వకవి రవీంద్రుని జ్ఞాపకార్థం ఈ వంతెనను ‘రవీంద్ర సేతు’గా నామకరణం చేశారు. ఈ ఏడాదితో ఈ వంతెనకు 75 వసంతాలు నిండాయి. హుగ్లీనది మీద నిర్మించిన నాలుగు వంతెనల్లో ఇది కూడా ఒకటి. ప్రతిరోజూ లక్షకు పైగా వాహనాలు, పాదచారులు సంచరించే ఈ వంతెన ప్రపంచంలోనే రద్దీగా ఉండే కాంటిలెవర్ వంతెనగా గుర్తింపు పొందింది. ఈ శైలిలో ప్రపంచంలో నిర్మించిన వంతెనల్లో ఇది ఆరవది. వంతెన మీద ఒక వైపు మనుషులు, వాహనాలు నడిచిపోతుండగా, మరోవైపు గుంపులు గుంపులుగా ఎగిరే పక్షులు కూడా దీనిని తమ నివాసప్రాంతంగా మార్చేసుకున్నాయి.

English Title
Scary entertainment
Related News