రెండో దశలో 55 వేల డొల్ల కంపెనీల రద్దు

Updated By ManamSat, 09/22/2018 - 22:18
shell-companies

shell-companiesముంబై: అక్రమ నిధుల ప్రవాహాలను నిర్మూలించే ప్రయత్నాల రెండవ దశలో భాగంగా దాదాపు 55,000 డొల్ల కంపెనీలను రద్దు చేసినట్లు ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. కొన్ని కంపెనీలకు నోటీసులు జారీ చేసినట్లు,  మరికొన్నింటి కార్యకలాపాలను పరిశీలిస్తున్న ట్లు తెలిపింది. ఈ కార్యక్రమం మొదటి దశలో భాగంగా, వరుసగా రెండేళ్ళు లేదా అంతకుమించిన కాలానికి ఫినాన్షియల్ స్టేట్‌మెంట్లు లేదా వార్షిక రిటర్నులు దాఖలు చేయని 2.26 లక్షలకు పైగా కంపెనీలను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. ‘‘డొల్ల కంపెనీలకు సంబంధించినంత వరకు, మొదటి దశలో, మేం దాదాపు 2.26 లక్షల కంపెనీలను రద్దు చేశాం. అవి నిబంధనలను పాటించని సంస్థలు మాత్రమే కాదు. వాటిలో చాలా భాగం బోగస్‌వే. వాటిలో 400లకు పైగా కంపెనీలు ఒక్క గది వ్యవస్థ నుంచే పనిచేస్తున్నాయి. రెండవ దశలో, మేం ఇప్పటికే దాదాపు 55,000 కంపెనీలను రద్దు చేశాం. మరికొన్నింటిపై వేటు పడనుంది’’ అని  కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పి.పి. చౌధరి ఇక్కడ జరిగిన ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక సమావేశం సందర్భంగా మీడియా ప్రతినిధులతో విడిగా మాట్లాడుతూ చెప్పారు. గుప్త ధనాన్ని చెలామణీలోకి తెచ్చేందుకు, మాదక ద్రవ్యాలు, ఎటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల నుంచైనా సరే నిధులు తరలించేందుకు కార్పొరేట్ వ్యవస్థను ప్రభుత్వం ‘‘దుర్వినియోగం’’ కానివ్వదని మంత్రి చెప్పారు. ప్రభుత్వం ఇంతకుముందు 2015-16 సంవత్సరానికి, 2016-17 సంవత్సరానికి సమర్పించాల్సిన ఫినాన్షియల్ స్టేట్‌మెంట్లు దాఖలు చేయని 2.25 లక్షల కంపెనీలను, 7,191 పరిమిత లయబిలిటి భాగస్వామ్యాలను గుర్తించినట్లు ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక సంవత్సరంలో వాటి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అవకాశముందని జూన్‌లో వెల్లడించింది. రెండవ  దశలో నోటీసులు జారీ అయిన కంపెనీలలో కొన్నింటి పనితీరును కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని చౌధరి చెప్పారు. జారీ చేసిన నోటీసులకు కంపెనీలు ఇస్తున్న జవాబులను నిశితంగా పరిశీలిస్తున్నామని, కంపెనీల చట్టం ప్రకారం, అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

English Title
In the second phase, 55,000 companies were canceled
Related News